ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో ఈ లోహాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అప్పుడప్పుడే వెండి, బంగారం ధరలు తగ్గుతున్న సమయంలో ఒక్కసారిగా ఇలాంటి యుద్ధ పరిస్థితులు రావడం.. మళ్లీ బంగారం ధరలకు బూస్టింగ్ ఇచ్చింది. ఇది గోల్డ్ లవర్స్‌కు కోలుకోలేని దెబ్బగా మారింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య డ్రోన్ దాడులు, ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్న తరుణంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 6 వేల 700 పెరిగి దాదాపు లక్షా 70 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక కిలో వెండి ధర దాదాపు 3 లక్షల 15 వేలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సుకు ఏకంగా 5 వేల 377 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది.
చాలా కాలంగా మిడిల్ ఈస్ట్‌లో ఈ ఉద్రిక్తతలే బంగారం పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ గొడవలు ప్రారంభం కాకముందు.. అంటే 2023, 2024 ప్రారంభంలో ధరలు ఇప్పటితో పోలిస్తే చాలా తక్కువగా ఉండేవి. బంగారం అంతర్జాతీయంగా ఔన్సుకు 2,000 నుంచి 2,200 డాలర్ల వద్ద ఉండేది. ఇక దేశీయంగా 10 గ్రాముల బంగారం సుమారు 66 వేల వద్ద మాత్రమే ఉండేది. వెండి 2024 ప్రారంభంలో ఔన్సుకు కేవలం 23 నుంచి 25 డాలర్ల వద్ద ఉండేది. దేశీయంగా కిలో 70 నుంచి 75 వేల రేంజ్‌లో ట్రేడ్ అయ్యేది. కానీ ఈ గొడవల కారణంగా గత రెండేళ్లలో ధరలు ఆకాశాన్ని తాకాయి.
ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, బంగారం త్వరలో ఔన్సుకు 6 వేల డాలర్ల స్థాయికి కూడా వెళ్లొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఇండియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రెండు లక్షల మార్క్‌కు చేరనుంది. ఇక వెండికి సేఫ్-హెవెన్ డిమాండ్‌తో పాటు పారిశ్రామిక డిమాండ్ విపరీతంగా పెరింగిది. ముఖ్యంగా ఏఐ, సోలార్, ఈవీ రంగాల నుంచి విపరీతంగా ఉంది. దీని కారణంగా వెండి ధర ఔన్సుకు 120 డాలర్ల మార్కు దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇండియాలో కేజీ వెండి ధర 4 లక్షలకు చేరే అవకాశముంది.
మార్కెట్ ప్రస్తుతం "ప్యానిక్ బయ్యింగ్" మోడ్‌లో ఉంది. ఒకవేళ ఏ క్షణమైనా యుద్ధం సర్దుమణిగి దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగితే, ధరలు భారీగా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కేవలం లాభాల కోసం ఇప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో కొనడం చాలా రిస్క్ అని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. పెళ్లిళ్ల లాంటి కార్యక్రమాలు లేకపోతే.. బంగారం కొనుగోలు విషయంలో కొంత కాలం ఆగితే మంచిదని సూచిస్తున్నారు.