నేటి కాలంలో సెలబ్రిటీ హోదా అనేది ఒక వరం లాంటిదైతే, పబ్లిక్ ప్లేసుల్లో తిరగడం ఒక శాపంగా మారుతోంది. అభిమానం ముసుగులో కొంతమంది ఆకతాయిలు చేస్తున్న పనులు హద్దులు దాటుతున్నాయి. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్, నటి దివి తనకు ఎదురైన ఒక భయంకరమైన వేధింపుల ఘటనను పంచుకుని అందరినీ షాక్‌కు గురిచేశారు.సినిమా తారలు బయటకు వస్తే చాలు ఫ్యాన్స్ ఎగబడటం సహజం. కానీ ఈ మధ్యకాలంలో అది కేవలం అభిమానంలా ఉండటం లేదు. మలయాళ హీరోయిన్ హనీ రోజ్, సీనియర్ నటి మంజు వారియర్ వంటి వారికి కూడా బహిరంగ ప్రదేశాల్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇదే బాటలో దివి కూడా ఒక పబ్ ఈవెంట్లో తాను ఎదుర్కొన్న అసభ్యకర ప్రవర్తన గురించి ఆవేదన వ్యక్తం చేశారు. దివి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు.
"నేను ఒక పబ్ ఈవెంట్‌కు వెళ్ళినప్పుడు, నన్ను లోపలికి తీసుకెళ్లడానికి చుట్టూ బాడీగార్డ్స్ ఉన్నారు. అంతమంది రక్షణగా ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి జనంలో నుంచి వచ్చి నా నడుము గిల్లాడు. ఆ క్షణంలో నేను షాక్ అయ్యాను. వాడు అంత పని చేసి కూడా ఏమీ తెలియనట్లు అమాయకంగా నా ముఖం చూస్తూ నిలబడ్డాడు." సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చాలామంది భయపడి మౌనంగా ఉండిపోతారు. కానీ దివి మాత్రం అస్సలు తగ్గలేదు. ఆ ఆకతాయికి అక్కడికక్కడే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. వెంటనే వాడిపై సీరియస్ అయ్యి, తలపై గట్టిగా కొట్టి దుర్భాషలాడినట్లు ఆమె తెలిపారు. "నేను అప్పుడు రియాక్ట్ కాకపోతే, వాడు చేసిన తప్పును నేను అంగీకరించినట్లు అవుతుంది. అందుకే వాడికి ఇచ్చిపడేశాను" అని ఆమె గట్టిగా చెప్పారు. ఈ ఘటన తర్వాత చాలా సేపటి వరకు తన శరీరాన్ని తనే కవర్ చేసుకుంటూ అసహనంగా నడిచానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు, కెరీర్ పరంగా కూడా దివికి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
ముఖ్యంగా మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్' విషయంలో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 20 రోజులు షూటింగ్లో పాల్గొన్నారు. సినిమా టీజర్ మొత్తం ఆమె క్యారెక్టర్ చుట్టూనే తిరిగేలా ప్లాన్ చేశారు. దీని కోసం 10 రోజులు డబ్బింగ్ కూడా చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్‌కు వెళ్లి చూస్తే, టీజర్లో చూపించిన ఒక్క సీన్ కూడా సినిమాలో లేకపోవడం ఆమెను కలిచివేసింది. తన పాత్ర నిడివిని తగ్గించడంపై ఆమె పలమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన దివి, ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌లోకి ప్రవేశించారు. 2019లో మహేష్ బాబు 'మహర్షి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. A1 ఎక్స్‌ప్రెస్, క్యాబ్ స్టోరీస్, నయీమ్ డైరీస్, జిన్నా, గాడ్ ఫాదర్, రుద్రాంగి, లంబసింగి వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో దివి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆకతాయికి ఆమె బుద్ధి చెప్పిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.