టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం తన సినిమాలతోనే కాకుండా, తోటి నటీనటుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలోనూ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ ఇండియన్ స్పై థ్రిల్లర్ 'ధురందర్ 2' చూసి, సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకున్నారు. ఈ సినిమా ఒక అద్భుతమని, ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉందని ఆయన కొనియాడారు.అల్లు అర్జున్ తన పోస్ట్‌లో ఈ చిత్రాన్ని "Patriotism with Swag" అని అభివర్ణించారు. "ఇప్పుడే ధురందర్ 2 చూశాను. ఇది ప్రతి దేశభక్తుడు గర్వపడేలా చేసే సినిమా.
సినిమాలో ఎన్నో 'క్లాప్-ట్రాపింగ్' క్షణాలు ఉన్నాయి. ఇదొక బ్లాస్ట్!" అంటూ సినిమాపై తనకున్న ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. కేవలం కథ మాత్రమే కాకుండా, సినిమాను మలిచిన తీరు, సాంకేతిక విలువలు అద్భుతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ నటనను బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "రణవీర్ సింగ్ లాంటి వెర్సటైల్ యాక్టర్ మన దేశంలో ఉండటం మన గర్వకారణం. RVS on Fire!" అంటూ తన 'బ్రదర్' రణవీర్ నటనకు ఫిదా అయిపోయారు. రణవీర్ తన ఎనర్జీతో, స్టైల్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని బన్నీ భావించారు. అలాగే సీనియర్ నటుడు మాధవన్ మరియు ఇతర నటీనటుల నటనను కూడా ఆయన అభినందించారు.
'ఉరి ది సర్జికల్ స్ట్రైక్' ఫేమ్ ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఆయన మేకింగ్ స్టైల్‌ను మెచ్చుకుంటూ, "ఆదిత్య ధర్ గారు బంతిని స్టేడియం దాటించారు. మన దేశంలో ఇలాంటి ప్రతిభావంతులైన ఫిల్మ్ మేకర్స్ ఉండటం చాలా సంతోషకరం. ఆయన నిజమైన షో రాకర్" అని అల్లు అర్జున్ రాసుకొచ్చారు.సినిమాలో కనిపించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ మరియు మేకింగ్ క్వాలిటీని ఉద్దేశిస్తూ.. ఇది ఒక భారతీయ కథ అయినప్పటికీ, దీనికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నాయని బన్నీ ప్రశంసించారు. చివరగా "జై హింద్" అంటూ తన సందేశాన్ని ముగించారు.ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐకాన్ స్టార్ నుంచి ఇంతటి భారీ ప్రశంసలు దక్కడంతో రణవీర్ సింగ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అట్లీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, మంచి సినిమాను ఆదరించడంలో బన్నీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు.