కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులకు ఎట్టకేలకే ఒక తీపి కబురు అందింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'కరుప్పు' విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం, ఈ ఏడాది వేసవి కానుకగా మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్జే బాలాజీ తన సోషల్ మీడియా వేదికగా ఈ అప్డేట్ను ఇస్తూ, "బ్లాక్‌బస్టర్ సమ్మర్ మొదలవుతోంది" అంటూ పోస్టర్‌ను పంచుకున్నారు.
ఈ పోస్టర్లో సూర్య ఇంటెన్స్ లుక్ చూస్తుంటే, సినిమా చాలా పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని అర్థమవుతోంది. టీజర్లో చూపించిన వివరాల ప్రకారం, ఈ చిత్రంలో సూర్య 'సరవణన్' అనే న్యాయవాది పాత్రలో కనిపిస్తున్నారు. సూర్య అసలు పేరు కూడా సరవణన్ కావడంతో అభిమానులు ఈ పాత్రపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. "నాకు ఇంకో పేరు కూడా ఉంది.. అది కరుప్పు" అంటూ ఆయన చెప్పే డైలాగ్ సినిమాపై హైప్‌ను అకాశానికి తీసుకెళ్లింది. ఇది కేవలం కోర్టు రూమ్ డ్రామా మాత్రమే కాదు, ఇందులో డివైన్ ఎలిమెంట్స్ మరియు మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయని సమాచారం.
ఈ సినిమాలోని మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, సూర్య మరియు త్రిష దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు. 'మౌనం పేసియాదే', 'ఆరు' వంటి చిత్రాల తర్వాత ఈ జంట వెండితెరపై కనిపించనుండటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు పెద్ద ప్లస్ కానుంది. గతంలో దీపావళికి విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మే 14న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో, సమ్మర్ విన్నర్‌గా 'కరుప్పు' నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి న్యాయవాదిగా సూర్య ఈసారి ఎలాంటి సామాజిక పోరాటం చేస్తారో చూడాలి.