Top story: బాలు, జానకమ్మలపై కుల రొచ్చు.. సోషల్ మీడియాలో ఇంత దిగజారుడుతనమా?

సమాజం ఎటు వెళ్తోంది? టెక్నాలజీ పెరుగుతుంటే మనుషుల ఆలోచనలు ఎందుకు ఇంత సంకుచితంగా మారిపోతున్నాయి? ప్రతి చిన్న విషయానికి, ప్రతి వ్యవస్థకు కులం రంగు పూయడం ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.

Post Published By: dialnews
Updated : 15 July 2026, 7:10 PM IST

సమాజం ఎటు వెళ్తోంది? టెక్నాలజీ పెరుగుతుంటే మనుషుల ఆలోచనలు ఎందుకు ఇంత సంకుచితంగా మారిపోతున్నాయి? ప్రతి చిన్న విషయానికి, ప్రతి వ్యవస్థకు కులం రంగు పూయడం ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. కానీ, దేవుడు ఇచ్చిన స్వరానికి, ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సంగీతానికి కూడా కులాల రొచ్చు అంటించాలని చూస్తే.. అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సంగీత శిఖరాలు.. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకమ్మ. వీరిద్దరూ దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలారు. కానీ ఇప్పుడు కొందరు సోషల్ మీడియా మేధావులు వీరికి కులం రంగు పులుముతూ వికృతానందం పొందుతున్నారు.

ఇటీవల కాలంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లలో ఒక వింతైన, అభ్యంతరకరమైన ప్రచారం జరుగుతోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి.. వీరంతా ఒక నిర్దిష్టమైన కులానికి చెందినవారు కాబట్టే ఇండస్ట్రీలో అంత కాలం నిలబడ్డారని, వారు వేరే కులాల వాళ్లను పైకి రానివ్వకుండా తొక్కేశారని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. "వాళ్ల గ్రూపిజం వల్లే మిగతా గాయనీగాయకులకు అవకాశాలు రాలేదు" అంటూ అడ్డగోలు సిద్ధాంతాలు లేవనెత్తుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేని ఇలాంటి వాదనలు చూస్తుంటే మేధావులకే కాదు, సామాన్య సంగీత ప్రియులకు కూడా ఒళ్ళు మండుతోంది. ప్రతిభతో గెలిచిన మహానుభావుల మీద ఇలాంటి బురద చల్లడం ఎంతవరకు న్యాయం? అంటూ ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు వినపడుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వ్యాపారం. ఇక్కడ వందల కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాతకు, సినిమాను హిట్ చేయాలనుకునే దర్శకుడికి కావాల్సింది 'హిట్ పాట'.. అంతేగాని పాడేవాడి 'కులం' కాదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోజుకు 15 నుండి 20 పాటలు రికార్డు చేసిన రోజులున్నాయి. ఎందుకు? ఆయన వాయిస్ లో ఆ మ్యాజిక్ ఉంది, ఆయన పాడితే సినిమాకు క్రేజ్ వస్తుంది కాబట్టి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, విద్యాసాగర్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజాలు కేవలం కులాన్ని చూసి వీళ్లకు అవకాశాలు ఇచ్చారా? అనే ప్రశ్న వినపడుతోంది.

సంగీత దర్శకుడు కోటి, రాజ్ లాంటి ఎందరో వేర్వేరు సామాజిక వర్గాల నుంచి వచ్చినవారే. వాళ్లెవరూ కులాన్ని చూసి ఎస్పీబీని గానీ, జానకమ్మను గానీ ఎంచుకోలేదు. కేవలం వాళ్ల గొంతులో ఉన్న దైవికమైన ప్రతిభను చూసి మాత్రమే ఎంచుకున్నారు. ఎస్పీబీ, జానకి వేరే వాళ్లను రానివ్వలేదు అనే వాదన ఎంత పెద్ద అబద్ధమో చరిత్ర చెప్తుందని పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎందరో కొత్త గాయనీగాయకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు, ప్రోత్సహించారు. మను, చిత్ర, శారద, వందేమాతరం శ్రీనివాస్ ఇలా ఎందరో గాయకులు ఆయన హయాంలోనే స్టార్స్ అయ్యారు. అందులో అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. అలాగే జానకమ్మ పక్కన పి. సుశీల, వాణీ జయరామ్ లాంటి వారు పోటీ పడి పాడారు. ఎవరి ప్రతిభ ఉన్నంత కాలం వారు రాణించారు తప్ప, ఇక్కడ ఎవరూ ఎవరినీ తొక్కేయలేదు. ఒకవేళ తొక్కేయడమే నిజమైతే.. కేజే ఏసుదాస్ భిన్నమైన నేపధ్యం నుండి వచ్చి గాన గంధర్వుడిగా ఎలా ఎదిగారు? హరిహరన్, ఉదిత్ నారాయణ్‌లు ఎలా పాడగలిగారు? ఒక్కసారి ఆలోచించండి అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఒక పాట రేడియోలోనో, మొబైల్ లోనో వింటున్నప్పుడు.. ఏ రోజైనా ఏ శ్రోత అయినా "ఈ పాట పాడింది ఏ కులం వాడు?" అని ఆలోచించి ఆనందించాడా? జానకమ్మ "శివ శంకరీ.." అని పాడుతుంటే పరవశించిపోయాం. బాలు గారు "ఆగదు ఏ నిమిషం.." అని పాడుతుంటే కన్నీళ్లు పెట్టుకున్నాం. పాట ఇచ్చే ఎమోషన్ కులాలకు, మతాలకు అతీతమైనది. వీరు పాడిన భక్తి పాటలు వినని ఇల్లు ఉందా? వీరు పాడిన మెలోడీలు వినని ప్రేమికులు ఉన్నారా? కోట్లాది మంది ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న లెజెండ్స్‌కు, ఈ రోజు కులం రంగు పూసి సోషల్ మీడియాలో రొచ్చు చేయడం అంటే ఆ సంగీతాన్ని, ఆ సరస్వతీ దేవిని అవమానించడమే.

ఇలాంటి చెత్త కామెంట్స్ పెట్టేవాళ్లకు సంగీతం గురించి తెలీదు, ఇండస్ట్రీ హిస్టరీ అసలే తెలీదు. కేవలం వ్యూస్ కోసమో, సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికో కొందరు పనిగట్టుకుని ఇలాంటి పోస్టులు పెడుతుంటారు. యువత వీటికి దూరంగా ఉండాలి. ప్రతిభను ప్రతిభగా చూడాలి తప్ప, దానికి కులం అద్దాలు పెట్టి చూడకూడదు. కళాకారులకు కులం లేదు.. వారి కులం సంగీతం, వారి మతం గానం అంటూ ఫ్యాన్స్ కౌంటర్ లు ఇస్తున్నారు. చివరిగా.. ఎస్పీబీ, జానకమ్మలు సృష్టించిన అమరగాన సామ్రాజ్యాన్ని ఇలాంటి పిచ్చి కామెంట్లు ఎప్పటికీ కలుషితం చేయలేవు. వారి పాటలు తరతరాలూ వర్ధిల్లుతూనే ఉంటాయి.

Published : 
  • 15 July 2026, 7:10 PM IST