ఈటీవీ విన్ పాపం ప్రతాప్…!

తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది 'ఈటీవీ విన్'. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ఓటీటీ సంస్థ నుంచి ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. అదే 'పాపం ప్రతాప్'. విలక్షణ నటుడు తిరువీర్

Post Published By: dialnews
Updated : 14 April 2026, 7:28 PM IST

తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది 'ఈటీవీ విన్'. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ఓటీటీ సంస్థ నుంచి ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. అదే 'పాపం ప్రతాప్'. విలక్షణ నటుడు తిరువీర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈటీవీ విన్ అంటేనే ఇప్పుడు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' వంటి చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. తాజాగా విడుదలైన 'పాపం ప్రతాప్' ట్రైలర్ లాంచ్ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు.

ట్రైలర్ విడుదల చేసిన హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. "ఈటీవీ విన్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది కచ్చితంగా బాగుంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. చిన్న సినిమాలను ప్రోత్సహిస్తూ వారు సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకం. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' విజయాల పరంపరను 'పాపం ప్రతాప్' కూడా కొనసాగిస్తుందని నమ్ముతున్నాను" అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈనాడు సంస్థతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

"ఈనాడు సంస్థ ప్రతి తెలుగు కుటుంబంలో ఒక భాగం. నేను చిన్నప్పుడు విపుల, చతుర పత్రికలను ఎంతో ఆసక్తిగా చదివేవాడిని. ఇప్పుడు ఈటీవీ విన్ సినిమాలను చూస్తుంటే, ఆ పత్రికల్లోని కథలకు ఒక దృశ్యరూపం ఇచ్చినట్లుగా అనిపిస్తోంది. యావత్ చిత్ర పరిశ్రమ ఆశ్చర్యపోయేలా ఈటీవీ విన్ వరుసగా బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకుంటోంది" అని ఆయన కొనియాడారు. ఈ సినిమాను దర్శకుడు ఎస్పీ దుర్గా నరేష్ తెరకెక్కించారు. వైవిధ్యమైన కథలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్‌లో రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మడిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ట్రైలర్ చూస్తుంటే 'పాపం ప్రతాప్' కూడా ఒక వైవిధ్యమైన కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 17 వరకు వేచి చూడాల్సిందే.

 

Published : 
  • 14 April 2026, 7:28 PM IST