సిల్వర్ స్క్రీన్ నుంచి స్మార్ట్ ఫోన్.. ప్రైవేట్ సాంగ్స్‌తో అదరగొడుతున్న టాప్ స్టార్స్..!

ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. కేవలం సినిమాల్లో పాటలకు మాత్రమే పరిమితం కాకుండా.. టాప్ హీరో హీరోయిన్లు ప్రైవేట్ మ్యూజిక్ వీడియోల వైపు ఆసక్తి చూపిస్తున్నారిప్పుడు.

Post Published By: dialnews
Updated : 3 February 2026, 1:49 PM IST

ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. కేవలం సినిమాల్లో పాటలకు మాత్రమే పరిమితం కాకుండా.. టాప్ హీరో హీరోయిన్లు ప్రైవేట్ మ్యూజిక్ వీడియోల వైపు ఆసక్తి చూపిస్తున్నారిప్పుడు. ఒకప్పుడు కొత్త గాయకులు లేదా చిన్న స్థాయి ఆర్టిస్టులు మాత్రమే చేసే ఈ ఆల్బమ్ సాంగ్స్‌లో.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ మెరుస్తుండటం విశేషం. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ పాటలకు వస్తున్న మిలియన్ల కొద్దీ వ్యూస్, పెరుగుతున్న డిమాండ్ చూసి మన స్టార్స్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది కేవలం పాటగానే కాకుండా, ఒక మినీ సినిమా రేంజ్‌లో క్వాలిటీతో తెరకెక్కుతుండటం ఈ మార్పుకు ప్రధాన కారణం. తాజాగా సీతారామం జంట దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశారు.

దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన భీగి భీగి మ్యూజిక్ వీడియోలో వీళ్లిద్దరూ నటించారు. సినిమాలో వీళ్ల కెమిస్ట్రీకి ఎంతటి ఆదరణ లభించిందో, ఈ ప్రైవేట్ సాంగ్‌లోనూ అంతే ఫీల్ పండించడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రెహమాన్ మార్క్ మ్యూజిక్, దుల్కర్-మృణాళ్‌ల స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ వీడియోను ఒక క్లాసిక్ చార్ట్ బస్టర్‌గా నిలబెట్టాయి. సినిమా పాటలకు ఏమాత్రం తగ్గని రీతిలో దీని మేకింగ్ ఉండటం గమనార్హం. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా ఈ ట్రెండ్‌లో ముందు వరసలో ఉన్నాడు. గతంలో నీ వెనకాలే అంటూ ఒక క్యూట్ లవ్ సాంగ్‌తో అలరించిన విజయ్.. ఆ తర్వాత రాధికా మదన్‌తో కలిసి సాహెబా అనే మరో మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జస్లీన్ రాయల్ స్వరపరిచిన ఈ పాట నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అయ్యింది.

ఇక టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా బాలీవుడ్ నటుడు అపర్‌శక్తి ఖురానాతో కలిసి సోనా ముఖ్‌డా అనే ప్రైవేట్ సాంగ్‌లో తన గ్లామర్ యాంగిల్ చూపించి సర్ప్రైజ్ చేసింది. అలాగే వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ సైతం జిమ్ జిమ్ అనే ప్రైవేట్ ఆల్బమ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక గ్లామర్ డోస్ విషయానికి వస్తే.. మన స్టార్ హీరోయిన్లు పాప్ సింగర్స్ వీడియోలలో మెరుస్తూ నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ పాప్ సింగర్ బాద్షాతో మన హీరోయిన్లు చేసిన సందడి అంతా ఇంతా కాదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాప్ టక్కర్ సాంగ్‌లో, మిల్కీ బ్యూటీ తమన్నా తబాహి సాంగ్‌లో, గోవా బ్యూటీ ఇలియానా సబ్ గజబ్ అంటూ బాద్షాతో కలిసి స్టెప్పులేసి యూట్యూబ్‌ను షేక్ చేశారు. సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ వీడియోలలో గ్లామర్, స్టైల్, కొరియోగ్రఫీ ఉండటంతో ఫ్యాన్స్ వీటికి ఫిదా అవుతున్నారు.

చివరగా ఈ మ్యూజిక్ వీడియోల కల్చర్ పెరగడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా రీల్స్ అండ్ షార్ట్స్. సినిమాలు లేని సమయాల్లో కూడా ఆడియన్స్‌కు దగ్గరగా ఉండటానికి, పాన్ ఇండియా స్థాయిలో తమ మార్కెట్‌ను విస్తరించుకోవడానికి ఈ ప్రైవేట్ సాంగ్స్ స్టార్లకు ఒక మంచి వేదికగా మారాయి. తక్కువ నిడివితో, మంచి కాన్సెప్ట్‌తో వచ్చే ఈ వీడియోలు ఇన్స్టాంట్‌గా జనాలకు కనెక్ట్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద కాంబినేషన్లలో ఇలాంటి క్రేజీ మ్యూజిక్ వీడియోలను మనం ఖచ్చితంగా ఆశించవచ్చు. పైగా డబ్బులు కూడా భారీగానే వస్తున్నాయి. వ్యూస్‌ను బట్టి మనీ కావడంతో.. స్టార్స్ కనిపించిన ప్రతీ పాటకు వందల మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. దాంతో సంపాదన కూడా అలాగే ఉంది.

Published : 
  • 3 February 2026, 1:49 PM IST