బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ అగ్రస్థానంలో నిలుస్తుంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనూ, నిరంతరం ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలోనూ ఈ షో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ అభిమానులకు జియోస్టార్ ఒక అదిరిపోయే తీపి కబురు అందించింది. ఈసారి ‘బిగ్ బాస్’ ఆడియన్స్ కోసం సరికొత్తగా ముస్తాబవుతోంది. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోస్టార్ ఒక భారీ ప్రణాళికను అధికారికంగా ప్రకటించింది.బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బంగ్లా వంటి 6 ప్రధాన భాషల్లో ఈ రియాలిటీ షో లాంచ్ కాబోతోంది. ఈ విషయాన్ని జియో హాట్‌స్టార్ సంస్థ అధికారికంగా వెల్లడించింది.
ఇకపై భాషల వారీగా బిగ్ బాస్ చూడటానికి నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. వచ్చే సెప్టెంబర్ నుంచి జియోస్టార్ టెలివిజన్ నెట్‌వర్క్, అలాగే ‘జియోహాట్‌స్టార్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ అన్ని భాషల వెర్షన్లు ఏకకాలంలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇక మన తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటివరకు విజయవంతంగా 9 సీజన్లు పూర్తయ్యాయి. దీంతో ఈ మైలురాయి సీజన్ కోసం నిర్వాహకులు చాలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ అంటేనే మనకు వెంటనే గుర్తుకువచ్చేది కింగ్ అక్కినేని నాగార్జున. ఈ రాబోయే సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తారని జియో హాట్‌స్టార్ స్పష్టం చేసింది. తనదైన శైలిలో కంటెస్టెంట్లకు క్లాస్ పీకుతూ, ప్రేక్షకులను అలరిస్తూ నాగార్జున మరోసారి స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.
వివిధ భాషల్లో బిగ్ బాస్ షోను నడిపించేందుకు స్టార్ హీరోలు, ప్రముఖులు రంగంలోకి దిగుతున్నారు. తెలుగులో అక్కినేని నాగార్జున,
కన్నడలో కిచ్చా సుదీప్,
హిందీలో సల్మాన్ ఖాన్,
తమిళంలో విజయ్ సేతుపతి,
మలయాళంలో మోహన్‌లాల్ లు హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
ఈసారి మరో ప్రధాన విశేషం ఏమిటంటే.. భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాలీ బిగ్ బాస్ ఎడిషన్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. క్రికెట్ మైదానంలో తన దాదాతనంతో మెప్పించిన గంగూలీ, ఇప్పుడు బుల్లితెరపై బిగ్ బాస్ హోస్ట్‌గా ఎలా అలరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ నుంచి బుల్లితెరపై అలాగే ఓటీటీలో వినోదాల విందు ప్రారంభం కానుంది. ఒకే సమయంలో భారతదేశవ్యాప్తంగా 6 భాషల్లో ప్రసారమయ్యే ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం ఆడియన్స్ ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.