CEO గేమ్‌ అది…!

సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన విలక్షణ నటుడు ఆర్. మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరపై ఆయన చూపించే పరిణతి వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? అది ఆయన ఆడే 'గోల్ఫ్' ఆటేనట! ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గోల్ఫ్ క్రీడ

Post Published By: dialnews
Updated : 2 May 2026, 9:20 PM IST

సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన విలక్షణ నటుడు ఆర్. మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరపై ఆయన చూపించే పరిణతి వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? అది ఆయన ఆడే 'గోల్ఫ్' ఆటేనట! ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గోల్ఫ్ క్రీడ తన వ్యక్తిత్వాన్ని, వృత్తిని ఎలా ప్రభావితం చేసిందో మాధవన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మాధవన్ అభిప్రాయం ప్రకారం, గోల్ఫ్ అనేది కేవలం ఒక వినోద క్రీడ మాత్రమే కాదు. అది మనిషిలో క్రమశిక్షణను పెంచుతుంది. ఈ ఆట ఆడుతున్నప్పుడు ప్రతి అడుగులోనూ ఎంతో ఏకాగ్రత అవసరం. "గోల్ఫ్ ఆడితే క్రమశిక్షణ అలవడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది" అని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.

షూటింగ్ సమయంలో చుట్టూ వందల మంది జనం ఉన్నా, గందరగోళం ఉన్నా.. ఏమాత్రం చెదరకుండా తన పాత్రపై దృష్టి పెట్టగలుగుతున్నానంటే దానికి కారణం గోల్ఫ్ నేర్పిన ఏకాగ్రతేనని ఆయన వివరించారు. ప్రపంచంలో మనం ఆడే చాలా ఆటలు ఇతర ఆటగాళ్లతో పోటీ పడేవిగా ఉంటాయి. కానీ గోల్ఫ్ విషయంలో మాధవన్ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు."ప్రపంచంలో మీతో మీరు పోటీపడే ఏకైక ఆట గోల్ఫ్. ఇందులో మరెవరితోనూ పోటీ ఉండదు. మీరు వేసే ప్రతి షాట్ మీ మునుపటి ప్రయత్నం కంటే మెరుగ్గా ఉండాలి అని మాధవన్ చెప్పుకొచ్చాడు. ఈ లక్షణం తనను నటనలో కూడా మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. ఒక పాత్రలో పూర్తిగా లీనం కావడానికి, పర్ఫెక్ట్ షాట్ ఇవ్వడానికి అవసరమైన నిలకడను ఈ క్రీడ అందిస్తుందని తెలిపారు.

గోల్ఫ్ ఆడేటప్పుడు ఒక వ్యక్తి ఒత్తిడిలో ఎలా స్పందిస్తాడో క్లియర్ గా తెలిసిపోతుందట. ఓటమి ఎదురైనప్పుడు లేదా ఒక షాట్ మిస్ అయినప్పుడు ఆ వ్యక్తి తన తప్పును అంగీకరిస్తాడా? లేక ఇతరులపై నిందలు వేస్తాడా? అనేది ఈ ఆటలో బయటపడుతుందట. అందుకే బిలియనీర్లు, పెద్ద పెద్ద కంపెనీల CEOలు కూడా ఈ ఆటపై మక్కువ చూపిస్తారని మాధవన్ పేర్కొన్నారు. ఇది కేవలం ఫిజికల్ గేమ్ మాత్రమే కాదు, మెంటల్ గేమ్ కూడా అని మాధవన్ నొక్కిచెప్పారు. నటుడిగా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కూడా మాధవన్ తన వ్యక్తిగత ఎదుగుదలకు గోల్ఫ్ ను ఒక సాధనంగా వాడుకుంటున్నారు. నిలకడగా ఉండటం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం వంటివి కేవలం క్రీడల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఎంతో అవసరమని ఆయన మాటలు సినీ అభిమానులకు గుర్తుచేస్తున్నాయి.

Published : 
  • 2 May 2026, 9:20 PM IST