సినిమా పరిశ్రమలో లింగ వివక్ష, బడ్జెట్ కేటాయింపుల్లో అసమానతలపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ చిత్ర పరిశ్రమలో మహిళా ప్రధాన చిత్రాల పట్ల ఉన్న వివక్షతను, బాక్సాఫీస్ వద్ద ఎదురవుతున్న పక్షపాత ధోరణిని నిర్మొహమాటంగా బట్టబయలు చేశారు. ఇటీవల ప్రతిష్టాత్మక కేన్స్ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న ఆమె, ఒక ఇంటర్వ్యూలో భారతీయ చిత్రపరిశ్రమ ప్రస్తుత స్థితిగతులు, కథానాయికల ప్రాధాన్యత కలిగిన సినిమాలకు లభిస్తున్న ఆదరణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ, చిత్రపరిశ్రమలో హీరోలు ప్రధాన పాత్రలు పోషించే సినిమాలకు లభించే భారీ బడ్జెట్లు, మద్దతు మరియు ప్రమోషన్లు.. నాయికా ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులకు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
"హీరోల సినిమాలకు వందల కోట్లు గుమ్మరిస్తారు. కానీ, ఒక మహిళా నటి ప్రధాన పాత్రలో సినిమా తీయాలంటే బడ్జెట్ దగ్గర చేతులు ముడుచుకుంటారు. మాకు ఆ స్థాయి బడ్జెట్లు ఎప్పటికీ లభించవు" అని ఆమె స్పష్టం చేశారు. మహిళా చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద ఒక నిర్దిష్ట సామర్థ్యం మాత్రమే ఉంటుందనే ఒక బలమైన పక్షపాత ధోరణి ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉండిపోయిందని ఆమె అన్నారు.
ఈ రోజుల్లో కూడా అలాంటి వివక్ష ఉందా? అని చాలామంది అడగవచ్చు. బహుశా దీని గురించి బహిరంగంగా ఎవరూ అంతగా మాట్లాడకపోవచ్చు. అంతేకానీ, ఇండస్ట్రీలో ఆ వివక్ష లేదని మాత్రం కాదు. ప్రస్తుతం నేను కూడా ఇదే సమస్యను, ఇదే వివక్షను ఎదుర్కొంటున్నాను" అని హ్యూమా పేర్కొన్నారు.
భారతదేశం ఎంతో వైవిధ్యమైన దేశమని, మనదైన శైలిలో మహిళా ప్రాధాన్య కథలను రూపొందించడానికి ఇక్కడ బోలెడన్ని అవకాశాలు ఉన్నాయని హ్యూమా ఖురేషీ అభిప్రాయపడ్డారు. ఇతర భాషల సినిమాలను రీమేక్ చేయడం కంటే, సొంతంగా ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందించడంపై దర్శకులు, నిర్మాతలు దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. మన పురాణాలు, గొప్ప సంస్కృతులపై కూడా కథలు రీసెర్చ్ చేసి సరికొత్తగా సినిమాలు తీస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.ఇలాంటి అసమానతలు, పరిమితులు ఉన్నప్పటికీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని హ్యూమా ఖురేషీ ఖచ్చితంగా చెప్పారు. "ఇది నిరంతరం ఎదుర్కోవాల్సిన సమస్య. దీనిని అధిగమించడానికి ఏకైక మార్గం ఏమిటంటే.. మన పనిని మనం చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే.
నేను మాత్రమే కాదు, నా తోటి నటీమణులు చాలా మంది కేవలం తమ కెరీర్ కోసం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో తమ తర్వాత రాబోయే ఎంతోమంది మహిళా నటుల కోసం వాస్తవ పరిస్థితిని మార్చడానికి నిరంతరం కృషి చేస్తున్నారు" అని ఆమె గర్వంగా చెప్పారు. శ్రమించి పని చేయడం ద్వారానే తాము ఈ పరిమితులను దాటుతున్నామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.హ్యూమా ఖురేషీ ప్రస్తుతం నటన పరంగా వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె కన్నడ స్టార్ హీరో యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.