నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. 'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, గత కొద్దిరోజులుగా ఈ సినిమా విడుదల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నాని అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మొదట ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాత షూటింగ్ పనులు వేగవంతం చేసి ఆగస్టు 21న థియేటర్లలోకి తీసుకురావాలని డేట్ లాక్ చేశారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ తేదీకి కూడా సినిమా రావడం కష్టమేనని టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, 'ది ప్యారడైజ్' సినిమా 2026 చివరి వరకు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.దీనికి ప్రధాన కారణాలుగా బడ్జెట్ పరిమితులు మరియు షూటింగ్ జాప్యం కనిపిస్తున్నాయి.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పట్టుదలతో ఉండటమే ఈ ఆలస్యానికి కారణమని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.చిత్ర యూనిట్ ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోవడంతో, పుకార్లకు మరింత బలం చేకూరుతోంది. దీంతో తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు వస్తుందో తెలియక ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. అయితే, ఈ సందిగ్ధతకు తెరదించే అవకాశం మే రెండో వారంలో రాబోయే అప్‌డేట్‌తో కలగనుంది. గతంలో విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ సృష్టించిన సంచలనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ క్రేజ్‌ను కొనసాగిస్తూ ఒక లవ్ సాంగ్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఒకవేళ మే రెండో వారంలో అనుకున్న ప్రకారం ఈ రెండో పాటను విడుదల చేస్తే, సినిమా వాయిదా పడలేదని స్పష్టమవుతుంది.
సాధారణంగా పాటల ప్రమోషన్ మొదలైందంటే, మేకర్స్ రిలీజ్ డేట్‌ను కూడా తిరిగి ధృవీకరించే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో కాయాడు లోహర్ నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక అత్యంత పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. నాని - మోహన్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని టాక్. పరిశ్రమ వర్గాల విశ్లేషణ ప్రకారం.. ఒకవేళ రెండో పాట విడుదలలో జాప్యం జరిగితే మాత్రం సినిమా 2026 డిసెంబర్ కి వాయిదా పడటం ఖాయమని భావిస్తున్నారు. కాబట్టి, నాని ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు మే రెండో వారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి శ్రీకాంత్ ఓదెల ఈసారి కూడా 'దసరా' మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా? రిలీజ్ డేట్ పై వస్తున్న రూమర్స్‌కు మేకర్స్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో వేచి చూడాలి.