తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు, అభిమానుల్లో ఒక రకమైన పూనకం మొదలవుతుంది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీని తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్ట్స్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ - డైరెక్టర్ బాబీ కాంబినేషన్ మళ్ళీ సెట్స్ పైకి వెళ్లబోతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఒక ఆసక్తికరమైన అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్ వినడానికి చాలా డిఫరెంట్ గా, మాస్ వైబ్‌తో ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. డైరెక్టర్ బాబీ సాధారణంగా చిరంజీవిని వింటేజ్ మాస్ లుక్‌లో చూపించడానికి ఇష్టపడతారు. ఆ క్రమంలోనే ఈ 'కాకాజీ' అనే పేరు సినిమాలోని హీరో పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని టాక్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరో సెన్సేషనల్ న్యూస్ ఏమిటంటే.. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ వెటరన్ యాక్టర్, ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. బాబీ రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం, ఒక పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఇందులో హీరోకి ధీటుగా ఉండే ఒక ముఖ్యమైన పాత్ర కోసం అనిల్ కపూర్ అయితే కరెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోందట.
నిజానికి అనిల్ కపూర్ కు సౌత్ సినిమాలంటే మక్కువ ఎక్కువే. ఇప్పటికే ఆయన జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న 'డ్రాగన్' లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు చిరంజీవి సినిమాలో కూడా ఆయన భాగమైతే, బాక్సాఫీస్ వద్ద అది ఒక క్రేజీ కలయిక అవుతుందనడంలో సందేహం లేదు. 'వాల్తేరు వీరయ్య' సినిమాతో చిరంజీవిలోని వింటేజ్ మాస్ యాంగిల్‌ను బాబీ అద్భుతంగా ఆవిష్కరించారు. ఇప్పుడు 'మెగా 158' తో అంతకు మించిన గ్యాంగ్‌స్టర్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవిని సరికొత్త గెటప్‌లో, పక్కా మాస్ డైలాగులతో చూడాలని ఆశిస్తున్న అభిమానులకు ఈ సినిమా ఐ ఫీస్ట్ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అనిల్ కపూర్ ఎంట్రీ మరియు 'కాకాజీ' టైటిల్ పై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. చిరంజీవి వరుసగా విభిన్నమైన జోనర్లను టచ్ చేస్తున్నారు. ఒకవైపు 'విశ్వంభర' వంటి గ్రాఫికల్ వండర్, మరోవైపు బాబీతో మాస్ ఎంటర్టైనర్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉండటంతో సోషల్ మీడియాలో మెగా నామస్మరణ మారుమోగిపోతోంది. బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ లాంటి సీనియర్ స్టార్ తోడైతే, ఈ సినిమా రేంజ్ పాన్ ఇండియా లెవల్లో ఉండే అవకాశం ఉంది.మరి ఈ కాంబినేషన్ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో, అనిల్ కపూర్ రోల్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.