హీరోయిజం పక్కన పెడితే.. కాసుల వర్షమే.. మారుతున్న టాలీవుడ్ ట్రెండ్.. ఆయనకు 5 కోట్లు..!

ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరో అనే ఇమేజ్ చట్రం దాటి బయటకు రావడానికి స్టార్స్ చాలా ఆలోచించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది..

Post Published By: dialnews
Updated : 3 February 2026, 5:36 PM IST

ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరో అనే ఇమేజ్ చట్రం దాటి బయటకు రావడానికి స్టార్స్ చాలా ఆలోచించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. దానికి తగ్గట్టే లెక్కలూ మారాయి. కేవలం హీరోగానే చేస్తానని భీష్మించుకుని కూర్చుంటే కెరీర్ గ్రాఫ్ పడిపోవడమే కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. అందుకే మన స్టార్స్ ఇప్పుడు తెలివిగా అడుగులేస్తున్నారు. హీరో అనే ట్యాగ్ పక్కన పెట్టి, కథలో ప్రాధాన్యమున్న సపోర్టింగ్ రోల్స్ లేదా విలన్ పాత్రలు చేయడానికి సై అంటున్నారు. అలా కాస్త కాంప్రమైజ్ అయితే చాలు, నిర్మాతలు హీరోగా ఇచ్చే దానికంటే భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా మన సీనియర్ స్టార్స్ ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు. ఉదాహరణకు డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్యారడైజ్ సినిమా కోసం ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. అదే ఇప్పుడు ఆయన సోలో హీరోగా సినిమా చేస్తే అందులో సగం కూడా వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు.

ఇక విక్టరీ వెంకటేష్ కూడా రానా నాయుడు తర్వాత రూట్ మార్చారు. మొన్న మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో 20 నిమిషాల కీలక పాత్ర కోసం ఆయన దాదాపు 20 కోట్లు తీసుకుంటున్నాడు. అటు కింగ్ నాగార్జున అయితే పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నాడు. రజినీకాంత్ కూలీ, ధనుష్ కుబేరా సినిమాల్లో నటిస్తున్నందుకు ఆయనకు ఒక్కో సినిమాకు 15 నుంచి 20 కోట్లకు పైనే పుచ్చుకున్నాడు. కేవలం సీనియర్లే కాదు.. మిడ్ రేంజ్ ప్లస్ యంగ్ హీరోలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు మాస్ మహారాజా రవితేజ 15 కోట్లకు పైగా తీసుకున్నాడని అప్పట్లో గట్టిగా వినిపించింది. అది సినిమాకు బాగా హెల్ప్ అయింది కూడా.

ఇక మంచు మనోజ్ కూడా మిరాయ్ సినిమా కోసం దాదాపు 4 కోట్ల వరకు ఛార్జ్ చేశాడు. చిన్న సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుహాస్ అయితే తమిళ సినిమా మందాడిలో విలన్ గా చేయడానికి తన రెగ్యులర్ పారితోషికం కంటే మూడు రెట్లు డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. దీన్ని బట్టి కేవలం హీరోగా నిరూపించుకోవడమే కాదు, నటుడిగా వెర్సటైాలిటీ చూపిస్తే నిర్మాతలు ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారని అర్థమవుతోంది.
నిజానికి ఈ ట్రెండ్ మన దగ్గర కంటే పక్క రాష్ట్రాల్లో ముందే మొదలైంది. తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో ఫహద్ ఫాజిల్, కన్నడలో కిచ్చా సుదీప్ లాంటి వారు స్టార్ హీరోలుగా వెలుగొందుతూనే.. కథ నచ్చితే పక్క భాషల్లో విలన్ గానో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో చేసి వావ్ అనిపిస్తున్నారు. విక్రమ్, పుష్ప, ఈగ లాంటి సినిమాలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. వాళ్ళ దారిలోనే ఇప్పుడు మన తెలుగు నటులు కూడా ప్రయాణిస్తూ.. ఇమేజ్ కంటే కంటెంట్ ముఖ్యమని, అది వర్కౌట్ అయితే రెమ్యునరేషన్ దానంతట అదే పెరుగుతుందని గ్రహించారు.

మొత్తానికి టాలీవుడ్ లో ఇదొక ఆరోగ్యకరమైన మార్పు అని చెప్పాలి. హీరో అనే ఒక్క పాయింట్ దగ్గరే ఆగిపోకుండా, మంచి పాత్రలు ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం వల్ల ప్రేక్షకులకు కొత్త కాంబినేషన్లు చూసే అవకాశం దొరుకుతుంది. అటు నటులకు నటన పరంగా సంతృప్తితో పాటు, ఆర్థికంగా కూడా భారీ లాభాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో స్టార్ హీరోల మల్టీస్టారర్లు, ఇలాంటి క్రేజీ క్యారెక్టర్ రోల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. తగ్గేదే లే అంటూ మన స్టార్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

Published : 
  • 3 February 2026, 5:36 PM IST