100 ఏళ్లలో బాగా నచ్చిన సినిమా.!

తెలుగు చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. 'స్టూడెంట్ నంబర్ 1' సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన రాజమౌళి, వరుస విజయాలను అందుకుంటూ సినీ పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు.

Post Published By: dialnews
Updated : 11 August 2026, 6:51 PM IST

తెలుగు చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. 'స్టూడెంట్ నంబర్ 1' సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన రాజమౌళి, వరుస విజయాలను అందుకుంటూ సినీ పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. తన అద్భుతమైన మేకింగ్, విజన్‌తో భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు.ముఖ్యంగా 'బాహుబలి' సిరీస్, 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా న భూతో న భవిష్యత్ అనే రీతిలో గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు ఓటమి అనేది ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్‌లో తిరుగులేని ముద్ర వేసుకున్న రాజమౌళిని చూసి ఎందరో వర్ధమాన దర్శకులు స్ఫూర్తి పొందుతుంటారు. అయితే, అంతటి దిగ్గజ దర్శకుడికి మానసికంగా మోటివేట్ చేసే సినిమా ఏది?

ఆయనకు అత్యంత ఇష్టమైన చిత్రం ఏది? అనే ప్రశ్నలకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళిని.. "గత శతాబ్దంలో మీకు అత్యంత నచ్చిన సినిమాలు ఏమిటి?" అని ప్రశ్నించగా, జక్కన్న చాలా స్పష్టంగా సమాధానమిచ్చారు.గత 100 ఏళ్ల భారతీయ చలనచిత్ర చరిత్రలో తనకు ఎన్నో సినిమాలు ఫేవరెట్‌గా ఉన్నాయని రాజమౌళి తెలిపారు. కానీ, వాటన్నింటిలోనూ తనకు బాగా నచ్చిన, ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ మాత్రం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన "మున్నాభాయ్ ఎంబీబీఎస్" అని వెల్లడించారు. దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ కథను ఆలోచించిన విధానం, అందులోని కాన్సెప్ట్ తనను నిరంతరం వెంటాడుతూ ఉంటాయని రాజమౌళి చెప్పారు.

తను కూడా ఎప్పటికప్పుడు అలా ఆలోచించి, ఆ తరహా వినూత్నమైన కాన్సెప్ట్స్ ఉన్న చిత్రాలను నిర్మించాలని అనుకుంటూ ఉంటానని తెలిపారు. భవిష్యత్తులో సమయం దొరికితే ఖచ్చితంగా అలాంటి భావోద్వేగమైన కథ, బలమైన కాన్సెప్ట్ ఉన్న సినిమాలను రూపొందిస్తానని జక్కన్న ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమౌళిని అంతగా ప్రభావితం చేసిన 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' విషయానికి వస్తే.. ఈ సినిమా 2003వ సంవత్సరంలో ప్రముఖ నిర్మాత విధూ వినోద్ చోప్రా నిర్మాణంలో రూపుదిద్దుకుంది. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్, అర్షద్ వార్సీ, ప్రముఖ సీనియర్ నటుడు సునీల్ దత్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. రోగిని ప్రేమించలేని డాక్టర్.. రోగితో సమానం" అనే ఒక అద్భుతమైన మానవీయ పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

హిలేరియస్ కామెడీతో పాటు గుండెలను పిండేసే హైలీ ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు రాజ్‌కుమార్ హిరాణీ. అప్పట్లో కేవలం 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఏకంగా 30 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. హిందీలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'శంకర్ దాదా ఎంబీబీఎస్' పేరిట రీమేక్ చేశారు.
తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించిన ఈ చిత్రం ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకులలో చాలామందికి 'ఆల్ టైమ్ ఫేవరెట్' చిత్రంగా నిలిచిపోయింది.ప్రపంచాన్ని తన చిత్రాలతో ఊపేస్తున్న రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడికే 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' సినిమా ప్రేరణగా నిలిచిందంటే.. ఆ కథలో ఉన్న బలం, రాజ్‌కుమార్ హిరాణీ విజన్ ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. జక్కన్న భవిష్యత్తులో తీయబోయే సినిమాల్లో అలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్స్ చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Published : 
  • 11 August 2026, 6:51 PM IST