'షేర్షా' సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ చూసి వెండితెర ప్రేమికులు ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో వారి ప్రేమ కథ విషాదాంతమైనా, నిజ జీవితంలో మాత్రం ఈ జంట ఒక్కటై అందరినీ మురిపించారు. ఇప్పుడు మరోసారి ఈ 'లవ్లీ కపుల్' వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ.. బాలీవుడ్లో మోస్ట్ అడోరబుల్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి మళ్ళీ ఎప్పుడు నటిస్తారా అని అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుందని తాజాగా వినిపిస్తున్న సమాచారం.
ఈ వార్తలకు బలం చేకూరుస్తూ సిద్ధార్థ్ మల్హోత్రా పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల సిద్ధార్థ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ఫోటోను పంచుకున్నారు. అందులో సిద్ధార్థ్ మరియు కియారా ఇద్దరూ వెనక్కి తిరిగి నిలబడి ఉన్నారు. ఈ ఫోటోకు సిద్ధార్థ్ ఇచ్చిన క్యాప్షన్ మరింత ఉత్కంఠను రేకెత్తించింది. "నేను ఎవరితో షూటింగ్ చేస్తున్నానో చెప్పండి చూద్దాం?" అంటూ నెటిజన్లకు ఒక చిక్కుముడి విసిరారు.
కియారాను గుర్తు పట్టడం పెద్ద కష్టమేమీ కాకపోయినా, వీరిద్దరూ కలిసి షూటింగ్లో ఉన్నారనే విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గత కొంతకాలంగా ఈ జంట ఒక రొమాంటిక్ డ్రామాలో నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తాజా పోస్ట్‌తో ఆ ప్రచారానికి దాదాపు అధికారిక ముద్ర పడినట్లయింది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే థియేటర్లలో ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. 'షేర్షా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ మరోసారి వెండితెరపై మెరిస్తే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు, అంటే దర్శకుడు ఎవరు? ఇది ఏ తరహా కథ? అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.