తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలి స్పీచ్‌లతో, మేనరిజమ్‌తో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే వ్యక్తి మల్లారెడ్డి. విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా అందరికీ సుపరిచితుడైన ఆయన, ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన మల్లారెడ్డి.. తన సినీ ప్రయాణం గురించి అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ పాత్ర కోసం మల్లారెడ్డిని సంప్రదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన చాలా హుందాగా, అంతే ఫన్నీగా స్పందించారు.
"విలన్ పాత్ర చేయమని అడిగారు, కానీ నేను వద్దని చెప్పాను. విలన్ అంటే ఫస్ట్ హాఫ్ లో హీరోని తిట్టాలి, సెకండ్ హాఫ్ లో హీరో దగ్గర దెబ్బలు తినాలి. ప్రజల్లో, నా స్టూడెంట్స్ ముందు అలా హీరోతో కొట్టించుకోవడం నాకు అస్సలు నచ్చదు. అందుకే ఆ పాత్రను రిజెక్ట్ చేశాను" అని తనదైన శైలిలో వివరించారు.సినిమాల్లోకి రావడం ఖాయమని చెబుతూనే, తన క్రేజీ అప్‌డేట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. నేను త్వరలోనే సినిమాల్లోకి వస్తా. నా జీవిత కథతో బయోపిక్ తీయాలని ఉంది. ఆ సినిమాను నేనే స్వయంగా నిర్మిస్తా. డైరెక్టర్ ఏ హీరో నా పాత్రకు సెట్ అవుతారని చెబితే వారినే పెడతాను. అలాగే ఆ సినిమాలో నేను కూడా ఒక పాత్రలో కనిపిస్తాను" అని మల్లారెడ్డి ప్రకటించి సినీ ప్రియులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు.
మల్లారెడ్డి బయోపిక్ అంటే ఖచ్చితంగా అందులో ఆయన మార్కు పంచ్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని నెటిజన్లు భావిస్తున్నారు.
పాలమ్మిన స్థాయి నుండి నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన జీవిత ప్రయాణం వెండితెరపై ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆయన కేవలం విలన్ గా వద్దన్నారు కానీ, నటనకు మాత్రం ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చేశారు. ఏదైనా మంచి క్యారెక్టర్ రోల్ వస్తే తప్పకుండా చేస్తానని ఆయన స్పష్టం చేయడంతో, వెండితెరపై ఆయనను ఎప్పుడు చూస్తామా అని అభిమానులు మరియు నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన బయోపిక్‌లో స్ట్రగుల్ మరియు సక్సెస్ రెండూ ఉంటాయి కాబట్టి అది మంచి కమర్షియల్ హిట్ అయ్యే అవకాశం ఉంది.మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మిస్ అయినా, మరే సినిమాలో మల్లారెడ్డి కనిపిస్తారో.. ఆయన బయోపిక్‌లో హీరోగా ఎవరు నటిస్తారో వేచి చూడాలి.