మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన ఎంతో ఇష్టంగా, అత్యంత ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క 'భగీర' కన్నుమూసింది. ఈ చేదు వార్తను తట్టుకోలేకపోయిన ఎన్టీఆర్, సోషల్ మీడియా వేదికగా తన పెట్ డాగ్‌ను గుర్తుచేసుకుంటూ ఎంతో హృదయవిదారకమైన పోస్ట్ షేర్ చేశారు.నాలుగేళ్ల పాటు తన జీవితంలో భాగమై ఎనలేని సంతోషాన్ని, అనుబంధాన్ని అందించిన భగీర ఇక లేదనే విషయాన్ని ఆయన అత్యంత తీవ్రమైన భావోద్వేగంతో వ్యక్తపరిచారు. నా ప్రపంచంలోకి ఒక తోడుగా అడుగుపెట్టి, ఎంతో నిశ్శబ్దంగా నా కుటుంబంలో ఒకడిగా మారిపోయావు.
ఈ నాలుగేళ్ల కాలంలో నీ ప్రేమ, నమ్మకం, అల్లరితో పాటు నువ్వు మాత్రమే ఇవ్వగలిగే ప్రశాంతతతో నా రోజులను నింపేశావు. నువ్వు లేని లోటు నా హృదయంలో చాలా పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. కానీ నువ్వు నాపై చూపించిన ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నన్ను ఎంచుకుని, నాతో పాటు నడిచి ఈ నాలుగేళ్ల ప్రయాణాన్ని ఎంతో అందంగా మార్చినందుకు చాలా థ్యాంక్స్ భగీర. నీ ఆత్మకు శాంతి కలగాలి మై లిటిల్ వన్.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం" అంటూ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తపరిచారు.
ఎన్టీఆర్ చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జంతువులపై ఎన్టీఆర్‌కు ఉన్న గాఢమైన ప్రేమను అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.ఇక తారక్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.
ఈ చిత్రం పూర్తి కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. మొదటి నుంచి ఈ సినిమాకు 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ, దీంతో పాటు 'దేవసేనాపతి' అనే మరో టైటిల్‌ను కూడా మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ 'కుమారస్వామి'గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ వరుస భారీ చిత్రాలతో తారక్ ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.