Top story: లండన్‌పై డెడ్లీ మిస్సైల్ లాక్ చేసిన పుతిన్.. ఉక్రెయిన్‌కు లక్షన్నర డ్రోన్లు ఇచ్చిన బ్రిటన్..!

ఉక్రెయిన్‌కు సాయం చేస్తే బ్రిటన్ అంతుచూస్తాం'. రష్యా ఎంత బెదిరించినా ఉక్రెయిన్‌కు వంద శాతం సాయం చేసి తీరుతాం'. రష్యా, బ్రిటన్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధమే ఇది. దీనికి రష్యా భూభాగంలో ఉక్రెయిన్‌ జరుపుతున్న డ్రోన్ దాడులే.

Post Published By: dialnews
Updated : 20 August 2026, 4:31 PM IST

'ఉక్రెయిన్‌కు సాయం చేస్తే బ్రిటన్ అంతుచూస్తాం'. రష్యా ఎంత బెదిరించినా ఉక్రెయిన్‌కు వంద శాతం సాయం చేసి తీరుతాం'. రష్యా, బ్రిటన్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధమే ఇది. దీనికి రష్యా భూభాగంలో ఉక్రెయిన్‌ జరుపుతున్న డ్రోన్ దాడులే. ఇప్పటివరకు కేవలం తన సరిహద్దులను కాపాడుకోవడానికే పరిమితమైన జెలెన్‌స్కీ సేనలు.. ఇప్పుడు మాస్కోతో సహా కీలక నగరాల్లోని చమురు శుద్ధి కేంద్రాలు, భారీ ఇంధన నిల్వలు, వ్యూహాత్మక గోడౌన్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. తమ భూభాగంపై విరుచుకుపడిన ఆ డ్రోన్ల శకలాలను పరిశీలించిన రష్యా ఇంటెలిజెన్స్ వర్గాలకు ఊహించని ఆధారాలు దొరికాయి. ఎందుకంటే ఆ డ్రోన్లు ఉక్రెయిన్‌వి కావు.. లండన్‌లో తయారైన బ్రిటన్ మేడ్ డ్రోన్లు. ఈ పరిణామమే రష్యాలో తీవ్ర ఆగ్రహజ్వాలలను రగిల్చింది. బ్రిటన్, రష్యా మధ్య మాటలు మిస్సైళ్లలా పేలేలా చేసింది.

తమ భూభాగంపై డ్రోన్ల దాడి వెనుక బ్రిటన్ ఉందని తెలియగానే. బ్రిటన్‌కు లండన్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని బ్రిటన్ కావాలనే తీవ్రతరం చేస్తోందని, ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలు, డ్రోన్లు అందిస్తూ రష్యాతో ప్రత్యక్ష ఘర్షణ దిశగా అడుగులేస్తోందని క్రెమ్లిన్ మండిపడింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ మాట్లాడుతూ.. బ్రిటన్ చేస్తున్న ఈ పనులకు తీవ్ర పరిణామాలు తప్పవని తేల్చిచెప్పారు. పాశ్చాత్య దేశాలు తమ ఆయుధాలతో రష్యా భూభాగంపై దాడి చేయిస్తే చూస్తూ ఊరుకునేది లేదని మాస్కో స్పష్టం చేసింది. అయితే, రష్యా నుంచి వచ్చిన తీవ్ర హెచ్చరికలకు లండన్ బెదరలేదు. తగ్గేదే లేదంటూ బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ మరింత దూకుడుగా స్పందించారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ ఇచ్చే మద్దతు 100 శాతం కొనసాగుతుందని క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య దేశమైన ఉక్రెయిన్ తనను తాను కాపాడుకునే సంపూర్ణ హక్కు కలిగి ఉందని, రష్యా బెదిరింపులకు లొంగి సాయాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉంటే రష్యా దూకుడు ఇతర దేశాలకూ విస్తరిస్తుందని, అందుకే కీవ్‌కు చివరిదాకా అండగా నిలుస్తామని బ్రిటన్ ప్రధాని తేల్చిచెప్పారు.

బ్రిటన్ కేవలం మాటలతో సరిపెట్టడం లేదు.. ఆచరణలో రష్యాకు చెక్ పెట్టేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. 2026 చివరి నాటికి ఉక్రెయిన్ సైన్యానికి ఏకంగా 1.5 లక్షల అత్యాధునిక డ్రోన్లను సరఫరా చేసేందుకు భారీ మిలిటరీ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో రిక్రూట్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే సర్వైలెన్స్, కామికాజే డ్రోన్లు ఉన్నాయి. అంటే.. రష్యాలోని వ్యూహాత్మక కేంద్రాలను ధ్వంసం చేసేలా ఉక్రెయిన్ డ్రోన్ వ్యవస్థను లండన్ స్వయంగా ఆధునీకరిస్తోంది. ఈ చర్య రష్యా సైనిక వ్యూహాలకు పెను సవాలుగా మారింది. ఈ పరిణామాలపైనే గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ సంపత్తి కలిగిన రష్యా భూభాగంపై పదేపదే భీకర దాడులు జరిగేలా చేయడం అంటే.. నిద్రపోతున్న సింహం కంట్లో పొడవడమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పుతిన్ నాయకత్వంలోని రష్యా తన ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లితే ఏ స్థాయికైనా తెగించే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో దూకుడు బ్రిటన్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందన్న చర్చ అంతర్జాతీయంగా ఊపందుకుంది.

నిజానికి.. రష్యా ఆగ్రహం వెనుక కేవలం డ్రోన్ల తయారీ మాత్రమే లేదు. పాశ్చాత్య దేశాలు కేవలం ఆయుధాలు ఇవ్వడమే కాకుండా.. శాటిలైట్ ట్రాకింగ్, రియల్-టైమ్ ఇంటెలిజెన్స్, టార్గెట్ లొకేషన్లను కీవ్ సైన్యానికి అందిస్తున్నాయని మాస్కో బలంగా నమ్ముతోంది. అంటే.. ఉక్రెయిన్ కేవలం ఫ్రంట్ లైన్ మాత్రమేనని, తెరవెనుక ఉండి యుద్ధాన్ని నడిపిస్తున్నది బ్రిటన్, నాటో శక్తులేనని క్రెమ్లిన్ భావిస్తోంది. ఇది రష్యా-ఉక్రెయిన్ పోరు కాదని, రష్యాను అంతర్గతంగా బలహీనపరిచేందుకు పాశ్చాత్య దేశాలు సాగిస్తున్న పూర్తి స్థాయి పరోక్ష యుద్ధమని రష్యా ఆరోపిస్తోంది. కానీ, రష్యా హెచ్చరించిన ఆ తీవ్ర పరిణామాలు ఏ రూపంలో ఉండబోతున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం.. రష్యా నేరుగా లండన్‌పై సాంప్రదాయ సైనిక దాడి చేయకపోవచ్చు, కానీ హైబ్రిడ్ వార్‌ఫేర్‌లో రష్యా ఎప్పుడో ఆరితేరింది. బ్రిటన్ బ్యాంకింగ్, పవర్ గ్రిడ్ వ్యవస్థలపై భారీ ఎత్తున వినాశకర సైబర్ దాడులు చేయడం, నార్త్ సీలోని సబ్‌సీ డేటా కేబుళ్లను దెబ్బతీయడం లేదా ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ వాణిజ్య నౌకలకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు మాస్కో దిగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ హైబ్రిడ్ వార్‌లో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను రష్యా చావుదెబ్బ కొట్టగలదని రక్షణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు.. పుతిన్ హెచ్చరికలను లెక్కచేయకుండా బ్రిటన్ ఇంత ధైర్యంగా అడుగులు వేయడం వెనుక ఒక స్పష్టమైన భౌగోళిక రాజకీయ వ్యూహం ఉంది. ఉక్రెయిన్ గనుక రష్యా చేతుల్లో ఓడిపోతే.. తదుపరి ముప్పు మొత్తం యూరోప్ ఖండానికే వాటిల్లుతుందని బ్రిటన్ భయపడుతోంది. రష్యాను ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే అడ్డుకోకపోతే, భవిష్యత్తులో నాటో సభ్య దేశాల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని లండన్ భావిస్తోంది. అందుకే ఎంతటి ముప్పునైనా ఎదుర్కొని ఉక్రెయిన్‌ను ఒక బలమైన రక్షణ గోడగా నిలబెట్టాలన్నదే బ్రిటన్ పట్టుదల. ఒకవైపు మాస్కో లక్ష్యాలపై డ్రోన్లతో విరుచుకుపడుతున్న కీవ్.. మరోవైపు 1.5 లక్షల డ్రోన్లతో వెనక్కి తగ్గేదే లేదంటున్న లండన్.. వెరసి తీవ్ర పరిణామాలు తప్పవు అంటూ తీవ్ర ప్రతీకారానికి సిద్ధమవుతున్న రష్యా! ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లు కేవలం దౌత్యపరమైన మాటల యుద్ధానికే పరిమితమవుతాయా? లేక ఒక చిన్న తప్పిదం వల్ల రెండు అగ్ర శక్తుల మధ్య ప్రత్యక్ష ఘర్షణ మొదలై.. అది మూడో ప్రపంచ యుద్ధ వినాశనానికి దారితీస్తుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

 

Published : 
  • 20 August 2026, 4:31 PM IST