పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, ప్రతిభావంతుడైన దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ అండ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఫౌజీ'. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. అనౌన్స్ మెంట్ రోజు నుంచే భారీ అంచనాలను నెలకొల్పుకున్న ఈ ప్రాజెక్ట్ నుంచి నిత్యం ఏదో ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా గురించి బయటకు వచ్చిన ఒక సంచలన ప్రచారం సినీ అభిమానుల్లో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రంలో ఇద్దరు చారిత్రక ప్రముఖుల పాత్రలు కనిపించబోతున్నాయని, భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ల పాత్రలు కూడా కథలో భాగం కానున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది.
'ఫౌజీ' కథ పూర్తిగా స్వాతంత్ర్య పోరాట కాలం నాటి పీరియాడిక్ నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన 'ఆజాద్ హింద్ ఫౌజ్' నేపథ్యంలోనే ఈ కథ సాగుతుందనే పుకార్లు విపరీతంగా వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.కేవలం దేశభక్తి మాత్రమే కాకుండా త్యాగం, యాక్షన్ మరియు బలమైన భావోద్వేగాలు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చారిత్రక నేపథ్యానికి అనుగుణంగానే కథలో గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి గొప్ప మహనీయుల పాత్రలను కూడా భాగం చేశారని, ఇది సినిమా కథను మరింత ఆసక్తికరంగా, ఉద్వేగభరితంగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ 'ఫౌజీ'లో మహాత్మా గాంధీ పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలో గాంధీజీ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, కథను మలుపు తిప్పే కీలక సన్నివేశాల్లో ఈ పాత్ర కనిపిస్తుందని సమాచారం.అనుపమ్ ఖేర్ ఇప్పటికే ఎన్నో విభిన్నమైన మరియు చారిత్రక పాత్రల్లో నటించి మెప్పించిన అనుభవం ఉన్న నటుడు. ఆయన గాంధీజీ పాత్రలో కనిపిస్తే అది సన్నివేశాలకు మరింత గాంభీర్యాన్ని, విశ్వసనీయతను తెచ్చిపెడుతుందని ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, సీనియర్ నటుడు అనీష్ కురువిల్లా రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. గాంధీజీతో పాటు ఠాగూర్ పాత్ర కూడా సినిమాలో ఉంటే, అది పీరియాడిక్ కథకు మరింత చారిత్రక బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. దర్శకుడు హను రాఘవపూడి ఈ ఇద్దరు మహనీయుల పాత్రలను ప్రధాన కథలోకి ఎలా ముడిపెట్టారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అనీష్ కురువిల్లా ఈ పాత్ర చేస్తున్నారా లేదా అనే విషయంపై కూడా మేకర్స్ నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
దర్శకుడు హను రాఘవపూడి సినిమాల్లో ప్రేమ, భావోద్వేగాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.
'సీతారామం' వంటి క్లాసిక్ చిత్రంతో తనదైన ముద్ర వేసిన ఆయన, ఇప్పుడు చారిత్రక నేపధ్యాన్ని ఎంచుకోవడం మూవీపై హైప్‌ను పెంచేసింది. ఈ చిత్రంలో దేశభక్తి, యాక్షన్ సన్నివేశాలతో పాటు తన మార్క్ ఎమోషన్‌ను కూడా బలంగా మిక్స్ చేసి తెరకెక్కిస్తున్నారని టాక్. ప్రభాస్ వంటి పాన్ ఇండియా సూపర్‌స్టార్‌తో ఇటువంటి చారిత్రక నేపధ్యం ఉన్న కథను చేయడం సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా పెంచేసింది.
ఇప్పటికే ఈ సినిమాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు రోజురోజుకూ బయటికొస్తున్న ఒక్కో అప్డేట్ చూస్తూ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.