తె లుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై, సింగర్ చిన్మయి లేవనెత్తిన ప్రశ్నలపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఇంతెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై, సింగర్ చిన్మయి లేవనెత్తిన ప్రశ్నలపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై ప్రభుత్వం నియమించిన కమిటీకి తాము రెండు నివేదికలను ఒకటి ప్రభుత్వ కమిటీ ద్వారా, మరొకటి ఉమెన్ వింగ్ ద్వారా సమర్పించామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ నివేదిక ఇచ్చిన వెంటనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం వంటి కారణాల వల్ల అది బయటకు రాలేదని, ఆ రిపోర్ట్‌ను తాము వ్యక్తిగతంగా బయటపెట్టలేమని తమ్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు. చిన్మయి అడిగినట్లుగా ఆ రిపోర్ట్ ఎందుకు బహిర్గతం కాలేదనేది తమకు కూడా తెలియదని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలో వేధింపుల గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో 100 శాతం వేధింపులు ఉన్నాయనేది వాస్తవమే కానీ, 100 శాతం మందీ అదే పనిలో ఉన్నారని కాదని తమ్మారెడ్డి విశ్లేషించారు. సినిమా పరిశ్రమ మొదలైన కొత్తలో జమీందార్లు, రాజులు కేవలం అమ్మాయిల కోసమే సినిమాలు తీసేవారని.. అప్పట్లో 15-20 శాతం మంది ఇలాంటి వారు ఉండేవారని గుర్తు చేశారు. అయితే తమ తరం వచ్చేసరికి అది 5-10 శాతానికి తగ్గిందని అన్నారు.
ప్రస్తుతం ఏడాదికి 200 సినిమాలు వస్తుంటే.. అందులో సుమారు 30-40 సినిమాలు కేవలం ఇలాంటి అవసరాల కోసమే తీస్తున్నారని, అక్కడే లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని సంచలన విషయాలను బయటపెట్టారు. సింగర్ చిన్మయి విషయంలో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ ఆమె పోరాటాన్ని తమ్మారెడ్డి కొనియాడారు. వేధింపులపై గళం విప్పినందుకే ఆమెను తమిళనాడులో బ్యాన్ చేశారని.. అది చాలా దుర్మార్గమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆమె ఎప్పుడూ లొంగలేదని, చిన్మయిని నేటి మహిళలు రోల్ మోడల్‌గా తీసుకోవాలని సూచించారు. గతంలో మేకప్ ఉమెన్ శోభకు కార్డు ఇవ్వకపోతే, ఆమె కోర్టు మెట్లు ఎక్కారని, అప్పుడు ఫెడరేషన్ తరఫున తామే కార్డు ఇచ్చామని గుర్తు చేసుకున్నారు. అన్యాయం జరిగినప్పుడు ఎదురుతిరిగిన వారిని ఇబ్బంది పెడతారని, అయినా ధైర్యంగా ఉండాలని ఆయన హితవు పలికారు.
ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఇద్దరి అంగీకారంతో జరిగే వ్యవహారాలను తప్పుపట్టలేని పరిస్థితి వచ్చిందని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. అవసరాలు తీర్చేవారికే కొందరు అవకాశాలు ఇస్తున్నారని.. పెద్ద డైరెక్టర్లు, నిర్మాతల్లోనూ ఒకరిద్దరు ఇలాంటి వారు ఉండొచ్చని అన్నారు. కేవలం మహిళలకే కాకుండా మగవారికి కూడా కమిట్మెంట్ కష్టాలు ఉన్నాయని.. వారిని డబ్బులు అడుగుతూ మోసం చేసేవారు ఉన్నారని తెలిపారు. ఇండస్ట్రీలో ప్రతిభ ఉంటే ఎవరూ తొక్కలేరని, టాలెంట్ లేనివారే ఇలాంటి వాటికి తలొగ్గుతారని ఆయన స్పష్టం చేశారు. చివరగా మహిళలను వస్తువుగా చూడటం అనేది కేవలం సినిమా రంగంలోనే కాకుండా ప్రభుత్వం, మిలిటరీ, పోలీస్ వంటి అన్ని వ్యవస్థల్లోనూ ఉందని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. చిరంజీవి చెప్పినట్లుగా మనం జాగ్రత్తగా ఉంటే, అవతలి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారని గుర్తు చేశారు. సమస్యలు ఉన్నాయని భయపెట్టడం కాకుండా, ధైర్యం చెప్పడానికే తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. గుచ్చి గుచ్చి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదని, ఎవరైనా వేధింపులకు గురై ఫిర్యాదు చేస్తే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని తమ్మారెడ్డి భరోసా ఇచ్చారు.