టాలీవుడ్ ‘ఎనర్జిటిక్ స్టార్’ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటివరకు నటుడిగా, గాయకుడిగా, గేయ రచయితగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న రామ్, ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే! రామ్ పోతినేని త్వరలో దర్శకుడిగా మారబోతున్నారు. తన 23వ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తుండటం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.ప్రస్తుతానికి #RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రామ్ ‘వీర’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో రామ్ లెదర్ జాకెట్ ధరించి వెనక్కి తిరిగి ఉన్న లుక్ స్టైలిష్‌గా ఉంటూనే, సినిమాలో ఏదో నిగూఢమైన విషయం ఉందనిపిస్తోంది. ఈ సినిమాకు ‘ఒంటరి తోడేలు కథ ఇది’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు.
విశేషం ఏమిటంటే, ఈ కథను రామ్ స్వయంగా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, డిసెంబర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రామ్ కేవలం నటుడిగానే కాకుండా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మరియు హిందీ మార్కెట్లో తిరుగులేని రికార్డులను సొంతం చేసుకున్నారు. రామ్ పోతినేని నటించిన సినిమాలు యూట్యూబ్‌లో హిందీ డబ్బింగ్ వెర్షన్ల ద్వారా నార్త్ ఇండియాలో భారీ పాపులారిటీని తెచ్చుకున్నాయి. ఆయన చిత్రాలకు అక్కడ బాలీవుడ్ స్టార్ హీరోల స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా 2 బిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరోగా రామ్ రికార్డు సృష్టించారు.
రామ్ నటించిన ‘కందిరీగ’, ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి దాదాపు 9కి పైగా సినిమాలు యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి రికార్డ్ క్లబ్లో చేరాయి. యూట్యూబ్‌లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ మార్కును అందుకున్న తొలి టాలీవుడ్ హీరోగా రామ్ గుర్తింపు పొందారు. సాధారణంగా నటులు కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు దర్శకత్వం వైపు వెళ్లడం ఒక సాహసమనే చెప్పాలి. కానీ, రామ్ పోతినేని తనలోని సృజనాత్మకతను నిరూపించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే ఆయన రాసిన కొన్ని పాటలు, డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఒక యాక్షన్ థ్రిల్లర్‌ను ఎలా తెరకెక్కిస్తారో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.