త్రివిక్రమ్ మ్యాజిక్ రీ-స్టార్ట్..!

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ‘రీ-రిలీజ్’ల ట్రెండ్ ఏ స్థాయిలో జోరుగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐకానిక్ హిట్స్, ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలు, మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లు మళ్లీ థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అల్లరి పట్టిస్తున్నాయి.

Post Published By: dialnews
Updated : 17 August 2026, 7:50 PM IST

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ‘రీ-రిలీజ్’ల ట్రెండ్ ఏ స్థాయిలో జోరుగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐకానిక్ హిట్స్, ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలు, మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లు మళ్లీ థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అల్లరి పట్టిస్తున్నాయి. పాత జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్ పై బిగ్ సౌండింగ్‌తో ఎంజాయ్ చేసేందుకు సినీ ప్రియులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ వరుసలో ఇప్పుడు మరో క్లాసిక్ లవ్ స్టోరీ చేరింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ ప్రతిభకు పునాది వేసిన అద్భుతమైన ప్రేమకావ్యం ‘నువ్వే నువ్వే’ ఇప్పుడు భారీ స్థాయిలో రీ-రిలీజ్‌కు సిద్ధమైంది.

‘నువ్వే నువ్వే’ చిత్రానికి ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా ఎన్నో హిట్ సినిమాలకు అద్భుతమైన కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ‘స్వయంవరం’, ‘నువ్వు కావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి సినిమాలతో మాటల మాంత్రికుడిగా తనదైన మార్కును సుస్థిరం చేసుకున్నారు. అయితే, దర్శకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది మాత్రం 2002లో వచ్చిన ‘నువ్వే నువ్వే’ చిత్రంతోనే!మొదటి సినిమాతోనే తనలోని పూర్తిస్థాయి దర్శకుడిని నిరూపించుకున్నారు త్రివిక్రమ్. ప్రేమలోని స్వచ్ఛతను, తండ్రీ-కూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగాలను, యువత ఆలోచనా విధానాన్ని ఎంతో సున్నితంగా, వినోదాత్మకంగా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించారు. ఈ చిత్రంలో లవర్ బాయ్ తరుణ్, అందాల భామ శ్రియ జంటగా నటించారు.

రిషి, అంజలి పాత్రల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు అప్పట్లో యూత్‌ను కట్టిపడేసాయి. ఈ సినిమాతో తరుణ్, శ్రియ మరియు త్రివిక్రమ్‌లకు సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు లభించింది. ‘నువ్వే నువ్వే’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ అద్భుత నటనా విశ్వరూపం. కూతురిపై విపరీతమైన ప్రేమను చూపిస్తూనే, తన హోదాకు తగిన అల్లుడిని తేవాలనుకునే తండ్రిగా ఆయన పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రధాన బలం. తరుణ్, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే డైలాగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్.

ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కోటి అందించిన స్వరాలు మ్యాజికల్ అని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే.. 'నువ్వే నువ్వే' చిత్రాన్ని రాబోయే సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.
డిజిటల్ రీ-మాస్టరింగ్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో ఈ క్లాసిక్ మూవీని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 2002 నాటి జ్ఞాపకాలను 4K క్వాలిటీతో థియేటర్లలో చూడడం ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా కానుంది. మరి సెప్టెంబర్ 4న రీ-రిలీజ్‌లో భాగంగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.నవతరం ప్రేక్షకులు, త్రివిక్రమ్ అభిమానులు మరియు లవర్ బాయ్ తరుణ్ ఫ్యాన్స్ సెప్టెంబర్ 4 కోసం కౌంట్‌డౌన్ షురూ చేశారు.

Published : 
  • 17 August 2026, 7:50 PM IST