తెలుగు చిత్రసీమలో 'మాస్' అనే పదానికి నిలువెత్తు రూపం దర్శకుడు వి.వి. వినాయక్. 'ఆది', 'ఠాగూర్', 'బన్నీ', 'ఖైదీ నంబర్ 150' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆయన, గత కొంతకాలంగా మెగా ఫోన్ పట్టలేదు. అయితే, తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కెరీర్, ప్రస్తుతం మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల గురించి ఆయన చాలా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. వినాయక్ మాట్లాడుతూ, "మన దగ్గర కొత్త ఐడియాలు లేనప్పుడు సైలెంట్‌గా కూర్చోవడమే బెటర్. అంతేకానీ, ఎప్పుడో పదేళ్ల కిందట సుమోలు ఎగరేశాం కదా అని, ఇప్పుడు కూడా అవే పాత కథలు రాసి సినిమాలు తీస్తే జనాలకి చిరాకు వస్తుంది," అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ నేపథ్యం, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను అలరించాయి.
కానీ నేటి తరం ప్రేక్షకులు వైవిధ్యమైన కంటెంట్‌ను కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించి వినాయక్ గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన పరిణతిని చూపిస్తున్నాయి. సాధారణంగా ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌కు హీరోలు కాల్షీట్లు ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. దీనిపై స్పందిస్తూ ఆయన ఇలా అన్నారు: "నేను గతంలో పని చేసిన పెద్ద హీరోల దగ్గరికి వెళ్లి సినిమా చేద్దాం అంటే మొహమాటానికి ఒప్పుకుంటారు. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు. బలమైన కథ లేకుండా కేవలం మొహమాటంతో సినిమా తీస్తే అది ఇటు డైరెక్టర్‌కు, అటు హీరోకు ఇబ్బందికరంగా మారుతుంది."
స్టార్ హీరోల అండ ఉంది కదా అని ఏదో ఒక సినిమా చేసేద్దాం అనే ధోరణికి ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇది ఇతర దర్శకులకు కూడా ఒక పాఠం లాంటిది. ఈ వ్యాఖ్యలు చూసిన సినీ అభిమానులు వినాయక్‌ను అభినందిస్తున్నారు. "అందరూ హిట్లలో ఉన్నప్పుడు గొప్పలు చెప్పుకుంటారు, కానీ తన తప్పులను లేదా తన మార్కెట్ స్థితిని ఇంత బహిరంగంగా ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ అయిన వినాయక్ నుండి మళ్ళీ ఒక పవర్‌ఫుల్ అండ్ కొత్త తరహా సినిమా రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.