టాలీవుడ్లో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్ల ఎంట్రీ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. కొందరు భామలు తమ తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రస్తుతం అలాంటి అందాల భామల జాబితాలో చేరిపోతున్నారు వాసవి గణేష్.
యంగ్ అండ్ ఎనర్జెటిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న 'హుషారు పిట్టలు' సినిమా ద్వారా వాసవి టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, రీసెంట్గా ప్రమోషనల్ ఈవెంట్లలో తన బోల్డ్ అండ్ క్లియర్ కామెంట్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. ముఖ్యంగా నెటిజన్ల నుంచి వస్తున్న ట్రోల్స్‌పై ఆమె స్పందించిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ సినిమాను లవ్, కామెడీ, ఎమోషనల్ అంశాల కలబోతగా పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దారు. ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
అయితే సినిమా విడుదల ముందే ప్రమోషన్ల రూపంలో ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. ఇటీవల విడుదలైన టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీశాయి. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకు సంబంధించిన ఒక సీన్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టారు.టీజర్‌లోని ఆ వివాదాస్పద సీన్ వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ తన ప్రియుడితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో అనుకోకుండా ఆమె తండ్రి ఎంట్రీ ఇస్తాడు. దాంతో కంగారు పడిన హీరోయిన్‌కు ఒళ్లంతా చెమటలు పడతాయి. తండ్రి ఏమైంది తల్లి అని ప్రశ్నించగా, వాతావరణం చాలా వేడిగా ఉందని, ఉక్కపోస్తోందని ఆమె చెబుతుంది. గదిలో ఏసీ లేకపోవడంతో తండ్రి వెంటనే ఏసీ పెట్టిస్తానని అంటాడు.
ఈ సన్నివేశాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో మీమ్స్ తయారు చేసిన నెటిజన్లు.. వాసవిని ట్యాగ్ చేస్తూ "మీ నాన్న ఇంట్లో ఏసీ పెట్టించాడా?" అంటూ విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తనపై వస్తున్న ఈ ట్రోల్స్‌పై వాసవి గణేష్ తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్లో అత్యంత ధైర్యంగా స్పందించారు.
ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా నేను తగ్గేదే లేదు. సినిమా గురించి పూర్తిగా తెలియకుండా, కేవలం ఒక్క టీజర్ ఆధారంగా కామెంట్స్ చేయడం ఎంతమాత్రం సరికాదు. మీరు చూసింది కేవలం ఒక్క టీజర్ మాత్రమే, కానీ నేను పూర్తి సినిమా చూశాను. సినిమా కథేంటో నాకు పూర్తిగా తెలుసు. ఆగస్టు 15న మీరు కూడా థియేటర్లో సినిమా చూస్తారు, అప్పుడు మీకే అసలు విషయం అర్థమవుతుంది."టీజర్లో కనిపించిన ఒక చిన్న సన్నివేశాన్ని చూసి సినిమాపై లేదా నా పాత్రపై ఒక అభిప్రాయానికి రావద్దని, పూర్తి సినిమా చూసిన తర్వాతే మాట్లాడాలని ఆమె సూచించారు. ట్రోలింగ్‌ను తాను అస్సలు పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు. ఒకవైపు ట్రోల్స్ వస్తున్నప్పటికీ, వాసవికి సోషల్ మీడియాలో మద్దతు కూడా లభిస్తోంది.
ప్రమోషనల్ ఈవెంట్లలో ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్, గ్లామర్‌తో పాటు స్పష్టమైన మాట తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తొలి సినిమాతోనే వైవిధ్యమైన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు వాసవి.కథలో తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని, కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథను మలుపు తిప్పే పాత్ర తనదని ఆమె చెబుతున్నారు. హీరోయిన్ ధైర్యాన్ని చూస్తుంటే ఈ సినిమాలో ఏదో బలమైన కథాంశమే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా ట్రోల్స్‌ను సైతం పాజిటివ్‌గా మార్చుకుంటూ ముందుకు సాగుతున్న ఈ యంగ్ బ్యూటీ.. వెండితెరపై ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.