తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో, సినిమా డ్రామాలను మించిపోయేలా సాగుతుంటాయి. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఒక పొలిటికల్ రచ్చ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం.. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. అవును.. మీరు విన్నది నిజమే. "నటి త్రిషను డిప్యూటీ సీఎం ఎప్పుడు చేస్తారు?" అంటూ అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.బి. ఉదయ్‌కుమార్ చేసిన ఒకే ఒక్క కామెంట్ ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా దావానలంలా మండుతోంది. అసలు త్రిషకు, డిప్యూటీ సీఎం పదవికి సంబంధం ఏంటి? ముఖ్యమంత్రి విజయ్‌ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు త్రిష పేరును ఎందుకు రోడ్డుకు లాగుతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు పొలిటికల్ గేమ్ ఏంటి?
విషయంలోకి వెళ్తే.. తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత, నటుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయన సీఎం అయ్యాక ప్రభుత్వంలోని పలు కీలక పదవుల్లో.. గతంలో తన సినిమాలకు పనిచేసిన ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్లు మరియు తన అత్యంత సన్నిహితులను నియమిస్తూ వస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష అన్నాడీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవల తూత్తుకుడిలో జరిగిన ఒక పార్టీ బహిరంగ సభలో ఆర్.బి. ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ.. విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
విజయ్ తన సినిమా సర్కిల్లోని వారికే ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా, టెంపుల్ ట్రస్టీగా, సీఎం పర్సనల్ సెక్రటరీగా, అలాగే స్టేట్ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హెడ్‌గా కీలక పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ లిస్ట్ అంతా చదివిన ఉదయ్‌కుమార్.. చివర్లో సంచలన వ్యంగ్యాస్త్రం విసిరారు. "విజయ్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన 'ప్రియమైన' త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తారో అని తమిళనాడు ప్రజలంతా షాక్ తో, ఆశ్చర్యంతో ఎదురుచూస్తున్నారు" అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఆలస్యం.. తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్ పేరును, నటి త్రిష పేరును ఇలా పదే పదే వ్యక్తిగత విమర్శల్లోకి లాగడంపై విజయ్ నేతృత్వంలోని టీవీకే శ్రేణులు మరియు త్రిష అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా విమర్శలు చేసుకోలేక, ఇలా ఒక మహిళా నటి గౌరవాన్ని, శీలాన్ని శంకించేలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ సోషల్ మీడియాలో అన్నాడీఎంకేపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే టీవీకే పార్టీ ముఖ్య నేతలు, మహిళా విభాగాలు రంగంలోకి దిగాయి. నటి త్రిషను, సీఎం విజయ్ను కించపరిచేలా.. వారి వ్యక్తిగత జీవితాలపై బురదజల్లేలా మాట్లాడిన ఆర్.బి. ఉదయ్‌కుమార్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. మహిళల హక్కులను, గౌరవాన్ని భంగపరిచేలా మాట్లాడే ఇలాంటి నేతలను వదిలిపెట్టేది లేదని టీవీకే శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. నిజానికి తమిళనాడు రాజకీయాల్లో విపక్షాలు సీఎం విజయ్‌ని ఇరుకున పెట్టేందుకు త్రిష అనే ఒక 'సెన్సిటివ్ నరాన్ని' పట్టుకున్నట్లు కనిపిస్తోంది.
విజయ్, త్రిషల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ దశాబ్దాలుగా సూపర్ హిట్. అయితే విజయ్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి త్రిష హాజరై, ఆయన స్పీచ్ వింటూ ఎమోషనల్ అయిన వీడియోలు గతంలో బాగా వైరల్ అయ్యాయి. అప్పటి నుండి వీరిద్దరిపై రూమర్స్ క్రియేట్ చేస్తూ పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని విపక్షాలు చూస్తున్నాయి. కేవలం అన్నాడీఎంకే మాత్రమే కాదు.. గత వారమే డీఎంకే నేత, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సైతం కావేరి జలాల నిరసన సభలో త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.
ఆ వివాదంలో ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఆ వివాదం తాలూకు వేడి తగ్గకముందే.. ఇప్పుడు అన్నాడీఎంకే నేత ఉదయ్‌కుమార్ కూడా అదే లైన్ లో త్రిష పేరును లాగడం గమనార్హం. దీనిపై త్రిష సైతం గతంలో స్పందిస్తూ.. "ఈ వయసులో ఇలాంటి డ్రామాలు చేయడం నిజంగా ఎంబరాసింగ్‌గా ఉందంటూ" సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ గా గట్టి కౌంటరే ఇచ్చారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం. ప్రభుత్వ నిర్ణయాలను, అపాయింట్మెంట్లను తప్పుబట్టే హక్కు ప్రతిపక్షాలకు ఖచ్చితంగా ఉంటుంది. కానీ, ఒక ముఖ్యమంత్రిని విమర్శించే క్రమంలో.. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని, కేవలం తన సినిమా క్రాఫ్ట్ నమ్ముకుని బతుకుతున్న ఒక స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని, ఆమె గౌరవాన్ని ఇలా బజారుకు లాగడం ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.