ఎప్స్టీన్తో తనకు ఉన్న సంబంధంపై ఎట్టకేలకు నోరు విప్పారు బిల్‌గేట్స్. తాను పలుమార్లు ఎప్స్టీన్ను కలిసినట్టు, ఇద్దరు రష్యన్ అమ్మాయిలతో తనకు సంబంధాలు ఉన్నట్టు ఒప్పుకున్నారు. తన వల్ల గేట్స్ సంస్థకు చెడ్డపేరు వచ్చిందని.. అంతా తనను క్షమించాలంటూ పేరుపేరునా క్షమాపణ చెప్పారు. మొన్నటి వరకూ జస్ట్ బిల్‌గేట్స్ పేరు మాత్రమే వినిపించినా.. ఇప్పుడు నేరుగా ఆయన అది నిజమేనని ఒప్పుకోవడంతో ఈ ఇష్యూ సంచలనంగా మారింది.
సెక్స్ కుంభకోణం సూత్రధారి జెఫ్రీ ఎప్స్టీన్తో తనకు సంబంధాలున్న మాట నిజమేనని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలు కొనసాగించినట్లు చెప్పారు. కానీ చట్టవిరుద్ధమైన పనులేవీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఎప్స్టీన్ నేరాల్లో తాను పాలుపంచుకోలేదని స్పష్టంచేశారు. అయినప్పటికీ తన వల్ల ‘గేట్స్ ఫౌండేషన్’కు చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎప్స్టీన్ను కలవడం తప్పేనని, తనను పెద్ద మనసుతో క్షమించాలని ఫౌండేషన్ సిబ్బందికి విజ్ఞప్తిచేశారు.
తనపై వచ్చిన ఆరోపణలపై టౌన్‌హాల్ సమావేశంలో బిల్ గేట్స్ వివరణ ఇచ్చినట్టు సమాచారం. ‘‘ఎప్స్టీన్ ఫైల్స్‌లో భాగంగా విడుదల చేసిన ఫొటోల్లో మహిళలతో నేను ఉన్నట్లు చూపించారు. ఆ ఫొటోల్లో మహిళల ముఖాలను తారుమారు చేశారు. నిజానికి ఎప్స్టీన్ సహాయకులతో ఫొటో దిగాను. ఎప్స్టీన్ వినతి వల్లే దిగాల్సి వచ్చింది. అతడి చుట్టూ ఉన్న మహిళలతో ఏనాడూ నేను కాలం గడపలేదు. ఎప్స్టీన్ బారిన పడిన బాధిత మహిళలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎప్స్టీన్ను కలవడం ద్వారా పెద్ద తప్పు చేశా. మైనర్లతో వ్యభిచారం కేసులో ఎప్స్టీన్ 2008లో దోషిగా తేలాడు. మూడేళ్ల తర్వాత.. 2011లో అతడిని కలిశా. అతడి నేపథ్యం గురించి సరిగ్గా తనిఖీ చేసుకోలేదు అందుకే తప్పు జరిగింది'' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు బిల్‌గేట్స్.
ఎప్స్టీన్తో స్నేహం విషయంలో తన మాజీ భార్యతో జరిగిన వివాదం మీద కూడా బిల్‌గేట్స్ స్పందించారు. ''ఎప్స్టీన్తో సంబంధాల గురించి 2013లో నా భార్య మెలిండా ఆందోళన వ్యక్తంచేసింది. అయినప్పటికీ 2014 దాకా అతడిని పలుమార్లు కలిశా. ఎప్స్టీన్తో కలిసి ప్రైవేట్ జెట్ విమానాల్లో ప్రయాణించా. కానీ, ఎప్స్టీన్ ఐలాండ్‌లో ఏనాడూ ఒక్కరాత్రి కూడా గడపలేదు. నా వల్ల గేట్స్ ఫౌండేషన్‌కు మచ్చ రావడం బాధగా ఉంది. నా వ్యవహార శైలి, ప్రవర్తన ఫౌండేషన్ విలువలకు, లక్ష్యాలకు విరుద్ధంగానే ఉన్నాయి. చివరిసారిగా 2014లో ఎప్స్టీన్ను కలిశా. ఎప్స్టీన్ విషయంలో మెలిండాకు మొదటినుంచీ అనుమానాలున్నాయి. ఎప్స్టీన్తో సంబంధాల వల్ల నా పేరు ప్రతిష్టలు మంట గలుస్తున్నాయని చివరికి గ్రహించానని చెప్పారు.
ఇద్దరు రష్యా మహిళలతో ఉన్న సంబంధాలపై కూడా క్లారిటీ ఇచ్చారు బిల్‌గేట్స్. ''ఆ మ్మాయిలతో సంబంధాలు కొనసాగించిన సంగతి నిజమే. వారిలో ఒకరు బ్రిడ్స్ ప్లేయర్. బ్రిడ్స్ ఈవెంట్లలో ఆమె నన్ను కలిశారు. మరొకరు న్యూక్లియర్ ఫిజిసిస్ట్. బిజినెస్ కార్యక్రమాల్లో భాగంగా మేము కలుసుకున్నాం. ఎప్స్టీన్తో ఉండే మహిళలతో కానీ.. అతని అసాంఘిక కార్యకలాపాలతో గానీ నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కామెంట్స్ చేశారు బిల్‌గేట్స్.
ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో బిల్‌గేట్స్ పేరు చాలా కాలం నుంచి వినిపిస్తూనే ఉంది. ఈ మచ్చ కారణంగానే రీసెంట్గా ఇండియా వచ్చిన సమయంలో బిల్‌గేట్స్ తన స్పీచ్‌ను క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయారు. కేవలం బిల్‌గేట్స్ మాత్రమే కాదు చాలా మంది ప్రముఖుల పేర్లు ఈ ఎప్స్టీన్ ఫైల్స్‌లో బయటపడ్డాయి. కానీ వీళ్లందరిలో బిల్‌గేట్స్ పేరు రావడం. అది నిజమేనని ఆయన కూడా ఇప్పుడు ఒప్పుకోవడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇది నిజమే అయితే ఆ ఫైల్స్‌లో పేర్లు ఉన్నవాళ్లు అందరూ నిజంగానే ఎప్స్టీన్తో నిజంగానే సంబంధాలు కొనసాగించారన్న వాదన మొదలైంది.