Top story: పైలెట్ సోదరుల ‘డ్రగ్స్’ దందా? ఫామ్‌హౌస్ పార్టీ వెనుక అండర్ వరల్డ్ మాఫియా…?

మొయినాబాద్‌లోని పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగింది కేవలం సరదా పార్టీ కాదా..? దీని వెనుక డ్రగ్స్ మాఫియా ఉందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆ పార్టీ ఒక "డ్రగ్స్ డీలింగ్ సెంటర్" గా పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 17 March 2026, 9:00 PM IST

మొయినాబాద్‌లోని పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగింది కేవలం సరదా పార్టీ కాదా..? దీని వెనుక డ్రగ్స్ మాఫియా ఉందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆ పార్టీ ఒక "డ్రగ్స్ డీలింగ్ సెంటర్" గా పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డిలపై పోలీసులు కేవలం డ్రగ్స్ సేవించారనే అభియోగం మాత్రమే కాకుండా, డ్రగ్స్ సరఫరా మరియు వ్యాపారం చేస్తున్నారనే కోణంలో నమ్మశక్యం కాని నిజాలను బయటకు తీస్తున్నారు.

పోలీసుల దర్యాప్తులో తేలిన అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ ఫామ్‌హౌస్ ఒక ట్రాన్సాక్షన్ హబ్ గా గుర్తించారు. దాడుల సమయంలో కేవలం డ్రగ్స్ మాత్రమే కాదు, వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా విడగొట్టడానికి ఉపయోగించే పరికరాలు, తూకం వేసే మిషన్లు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ రెడ్డి పీఏ శరత్ కుమార్ వద్ద కొకైన్ ప్యాకెట్లు దొరకడం గమనార్హం. ఒక పీఏ దగ్గర డ్రగ్స్ ఉండటం అంటే, అది బాస్ ఆదేశాల మేరకు ఇతరులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన స్టాక్ అని పోలీసులు భావిస్తున్నారు.

దాడుల సమయంలో కేవలం కొద్దిపాటి డ్రగ్స్ మాత్రమే కాకుండా, ప్యాక్ చేయడానికి సిద్ధంగా ఉన్న.. మరికొన్ని ఆధారాలు దొరకడం పోలీసుల అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. నిందితులు చెబుతున్న 'సిమ్లా' స్టోరీ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. "సిమ్లాలో గుర్తుతెలియని వ్యక్తి దగ్గర కొన్నాం" అని వారు చెబుతున్న మాటలు కేవలం తప్పించుకోవడానికే అని తేలిపోయిందని పోలీసు వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి, వీరు ఢిల్లీ, బెంగళూరు, నైజీరియన్ డ్రగ్ మాఫియాతో టచ్‌లో ఉన్నట్లు కాల్ డేటాలో బయటపడుతోంది.

అక్కడ తక్కువ ధరకు కొని, హైదరాబాద్‌లోని ధనికులకు, ఐటీ ఉద్యోగులకు మరియు సెలబ్రిటీలకు భారీ ధరలకు అమ్ముతున్నారనేది ప్రధాన ఆరోపణ. పార్టీలో గాలిలోకి కాల్పులు జరపడం అనేది కేవలం యాదృచ్ఛికం కాదని పోలీసులు భావిస్తున్నారు. రితేష్ రెడ్డి తన లైసెన్స్‌డ్ గన్‌ను ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మకు ఎందుకు ఇచ్చారు? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేసారు. డ్రగ్స్ డీలింగ్స్ జరుగుతున్నప్పుడు అవతలి వ్యక్తులను భయపెట్టడానికి లేదా తమ పవర్ చూపించడానికి ఈ ఆయుధాన్ని వాడారా? అనే యాంగిల్ లో ఈ కేసు విచారణ జరుగుతోంది.

లైసెన్స్‌డ్ గన్‌ను ఒక డ్రగ్స్ పార్టీలో మరొక వ్యక్తికి ఇవ్వడం వెనుక ఉన్న "క్రిమినల్ ఇంటెంట్" పై పోలీసులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీని వెనుక ఒక అండర్‌వరల్డ్ తరహా నెట్‌వర్క్ నడుస్తోందని పోలీసు వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి ఈ నెట్‌వర్క్‌లో కీలక సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఏపీకి చెందిన ఓ ఎంపీ, ఢిల్లీ వ్యాపారులు ఉండటం చూస్తుంటే.. ఇది అంతర్రాష్ట్ర డ్రగ్స్ మాఫియాతో లింక్ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

దాడులు జరిగిన వెంటనే నిందితులు తమ ఐఫోన్లను లాక్ చేయడం, కొన్ని డేటాను డిలీట్ చేయడం వెనుక ఉన్న కారణం.. వారి కస్టమర్ లిస్ట్ బయటపడకూడదనే భయంతోనే అని పోలీసులు భావిస్తున్నారు. వీరు ఎవరెవరికి డ్రగ్స్ అమ్మారు? ఏ ఏ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వీరి దగ్గర రెగ్యులర్‌గా డ్రగ్స్ కొంటున్నారు? అనే వివరాలు ఆ ఫోన్లలో ఉన్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సాయంతో పోలీసులు ఈ డేటాను రికవరీ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది 'హై-ప్రొఫైల్' కస్టమర్ల పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ డ్రగ్స్ వ్యాపారం కోసం డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? కేవలం సొంత డబ్బులేనా లేక ఎవరైనా బిగ్ షాట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారా? నగదు రూపంలో కాకుండా హవాలా మార్గాల్లో చెల్లింపులు జరుగుతున్నాయా? అనే కోణంలో రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఫామ్‌హౌస్‌కు వచ్చే విదేశీయుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. పైలెట్ సోదరుల చుట్టూ బిగుస్తున్న ఈ ఉచ్చు చూస్తుంటే, ఇది కేవలం ఒక డ్రగ్స్ పార్టీ కేసు మాత్రమే కాదు.. ఒక భారీ అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ అని అర్థమవుతోంది.

నిందితుల ఫోన్లలో ఉన్న డేటా బయటపడితే మాత్రం, హైదరాబాద్‌లోని మరిన్ని డ్రగ్స్ అడ్డాల గుట్టు రట్టవ్వడం ఖాయం. ఈ ఫోన్లలో ఎవరెవరి నంబర్లు ఉన్నాయి? ఎవరికి ఎంత మొత్తంలో డ్రగ్స్ డెలివరీ అయ్యాయి? అనే వివరాలు ఉండే అవకాశం ఉంది. పైలెట్ సోదరుల చుట్టూ బిగుస్తున్న ఈ ఉచ్చు చూస్తుంటే, రాబోయే రోజుల్లో మరికొంతమంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల పేర్లు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక పార్టీ కాదు.. ఒక వ్యవస్థీకృత నేరంగా పోలీసులు భావిస్తున్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ ను కూడా అధికారులు సీజ్ చేసే అవకాశం కనపడుతోంది.

Published : 
  • 17 March 2026, 9:00 PM IST