భారత్ లో మేము ఆడము, వరల్డ్ కప్ బహిష్కరించిన బంగ్లాదేశ్

ఊహించిందే జరిగింది.. భారత్, శ్రీలంక వేదికలుగా వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది. భారత్ లో మ్యాచ్ లు ఆడేది లేదంటూ ప్రపంచకప్ ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 22, 2026 | 05:44 PMLast Updated on: Jan 22, 2026 | 5:44 PM

We Will Not Play In India Bangladesh Boycotts The World Cup

ఊహించిందే జరిగింది.. భారత్, శ్రీలంక వేదికలుగా వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది. భారత్ లో మ్యాచ్ లు ఆడేది లేదంటూ ప్రపంచకప్ ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. 24 గంటల్లోగా తేల్చుకోవాలంటూ ఐసీసీ బుధవారం విధించిన డెడ్ లైన్ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తర్జన భర్జన పడింది. తమ ప్రభుత్వంతో సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం తమ ప్లేయర్ల అభిప్రాయాలను తీసుకుంది. చివరికి ప్రభుత్వం మాటకే తలొగ్గుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. బంగ్లాలో హిందులపై దాడులు, హత్యల సంఘటనలతోనే అసలు ఈ వివాదం మొదలైంది. దీనికి నిరసనగా ఐపీఎల్ లో బంగ్లా ప్లేయర్స్ ను ఆడనివ్వొద్దంటూ డిమాండ్ రావడంతో బీసీసీఐ ముస్తాఫిజుర్ రహమాన్ ను తప్పించింది. దీనిని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది. బీసీబీ పేరుతో తెరవెనుక డ్రామా అంతా బంగ్లా ప్రభుత్వమే క్రియేట్ చేసింది. అటు సామరస్యంగా సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో రంగంలోకి దిగిన ఐసీసీ బంగ్లా బోర్డుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి విఫలమైంది.

భారత్‌లో భద్రతా ఇబ్బందులు ఉన్నాయంటూ తమ వరల్డ్ కప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బీసీబీ, ఐసీసీకి రిక్వెస్ట్ పెట్టింది. దీనిపై ఐసీసీ అత్యవసరంగా సమావేశమై భద్రతా పరమైన సమస్యలు లేవని తేల్చిచెప్పింది.ఎట్టి పరిస్థితుల్లోనూ వేదిక మార్చే సమస్యే లేదని స్పష్టం చేసింది. షెడ్యూల్ పరంగా, లాజిస్టిక్స్ పరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. దీంతో పునరాలోచనలో పడిన బంగ్లాదేశ్ క్రికెట్ తమ గ్రూప్ నైనా మార్చమని కోరింది. ఐర్లాండ్ తో గ్రూప్ మార్చుకుంటే బంగ్లా తన లీగ్ మ్యాచ్ లన్నింటినీ శ్రీలంకలో ఆడేది. అయితే ఇటు ఐసీసీ, అటు ఐర్లాండ్ కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిని నిర్మొహమాటంగా తిరస్కరించింది. ఈ పరిణామలతో విసుగెత్తిన ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు 24 గంటల గడువు విధించింది. దీనితో హడావుడిగా ప్రభుత్వం, ఆటగాళ్లతో సమావేశమై తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పుడు మెగాటోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో మరో జట్టుగా స్కాట్లాండ్ ను తీసుకోనున్నట్టు సమాచారం. ర్యాంకింగ్స్ ఆధారంగా ఆ జట్టుకు గ్రూప్ సీలో బంగ్లాదేశ్ స్థానంలో చోటు దక్కుతుంది. దీనిపై ఐసీసీ త్వరలోనే నిర్ణయం ప్రకటించనుంది. ఇదిలా ఉంటే ఈ వివాదంలోకి పాకిస్తాన్ కూడా దూరింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మద్ధతు పలికి హడావుడి చేసింది. టీ20 ప్రపంచకప్ వచ్చే నెలలో ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతుంది.