దక్షిణ చైనా సముద్రం.. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉన్న కీలక ప్రాంతం. దీని చుట్టూ చైనా, తైవాన్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాలు ఉంటాయి. దాదాపు అన్ని దేశాలూ అక్కడ తమకి కూడా వాటా ఉందని ప్రకటించుకున్నాయి. వాస్తవానికి.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతం 1939 నుండి 1945 వరకు జపాన్ ఆక్రమణలో ఉంది. యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత దానిని స్వాధీనం చేసుకోవడానికి చైనా నౌకలను పంపింది. యుద్ధం తర్వాత చైనా ప్రభుత్వం 30లక్షల చదరపు కిలోమీటర్లలో ఎక్కువ భాగం తనదిగా, అన్ని ద్వీపాలను ఒకే రేఖమీద చూపిస్తూ ఓ మ్యాప్ విడుదల చేసింది. అప్పటి నుంచీ దక్షిణ చైనా సముద్రంలోకి ఇతర దేశాలను అడుగు కూడా పెట్టనీయడం లేదు. తాజాగా ఆ కుట్రలకే చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతోంది. అమెరికా సహా 14 దేశాల సంయుక్త ప్రకటన అందులో భాగమే.
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రాదేశిక విస్తరణ ప్రయత్నాలు అంతర్జాతీయ న్యాయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని అమెరికా, బ్రిటన్, మరో 12 దేశాలు పేర్కొన్నాయి. చైనా వ్యవహరిస్తున్న తీరు ప్రాంతీయ సుస్థిరతకు విఘాతం కలిగిస్తోందని తెలిపాయి. బీజింగ్ చర్యలను సంయుక్త ప్రకటనలో ఖండించాయి. ఐక్యరాజ్య సమితి సముద్ర చట్ట ఒప్పందం ప్రకారం.. ద హేగ్‌లో ఏర్పాటైన వివాద పరిష్కార న్యాయస్థానం ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ 2016 జులై 12న వెలువరించిన తీర్పును ఆ ప్రకటన గుర్తు చేసింది. గుర్తించిన చైనా ప్రాదేశిక ప్రాంతాలకు వెలుపల, దక్షిణ చైనా సముద్ర జలాల్లోని వనరులపై చైనాకు ఎలాంటి హక్కులు లేవని పదేళ్ల నాటి ఆ తీర్పు పేర్కొంది. ఆ జలాల్లో ఫిలిప్పీన్స్‌ను అడ్డుకోవడాన్ని తప్పుబట్టింది. 2026 జులై 12 నాటికి ఈ తీర్పు వచ్చి సరిగ్గా పదేళ్లు పూర్తైంది. ఈ దశాబ్ది సందర్భాన్ని పురస్కరించుకుని, చైనాకు దాని అంతర్జాతీయ బాధ్యతలను గుర్తు చేయడానికి ఈ ప్రకటనను విడుదల చేశారు. ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌కు చెందిన కోస్ట్‌గార్డ్ నౌకలపై, మత్స్యకారులపై చైనా తన సైనిక బలగాలతో భౌతిక దాడులకు దిగడం, వాటర్ కెనాన్స్ ప్రయోగించడం వంటి చర్యలు ఎక్కువయ్యాయి. ఈ ఘర్షణ వాతావరణం ఏ క్షణమైనా పెద్ద యుద్ధానికి దారితీసేలా ఉండటంతో ఈ ప్రకటన వెలువడింది. వీటితో పాటు 27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ విడిగా ప్రకటన విడుదల చేసింది. ఈ పరిణామం చైనాకు ఒక పెద్ద దౌత్యపరమైన దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు.. ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పును చైనా మొదటి నుంచీ అంగీకరించడం లేదు, ఇప్పుడు కూడా అదే మాటను పునరుద్ఘాటించింది. ఆ తీర్పును తాము ఆమోదించడం లేదని, గుర్తించడం లేదని పునరుద్ఘాటించింది. దక్షిణ చైనా సముద్ర జలాలపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంపై తమకు వేల సంవత్సరాల నాటి చారిత్రక హక్కులు ఉన్నాయని చైనా వాదిస్తుంది. అంతర్జాతీయ కోర్టులకు తమ భూభాగాలపై తీర్పులు చెప్పే అధికారం లేదని భీష్మించుకు కూర్చుంది. చైనా కేవలం మాటలతోనే కాకుండా, ఆ సముద్రంలో కొన్ని చిన్న చిన్న ఇసుక తిన్నెలను, పగడపు దీవులను మిలిటరీ స్థావరాలుగా మార్చేసింది. ఇప్పుడు ఆ తీర్పును ఒప్పుకుంటే ఆ సైనిక స్థావరాలన్నింటినీ చైనా కోల్పోవాల్సి వస్తుంది. ఈ సముద్ర గర్భంలో బిలియన్ల కొద్దీ బ్యారెళ్ల చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే అత్యధికంగా చేపల వేట సాగే ప్రాంతం ఇది. ఇదే సమయంలో ఇక్కడ ముప్పై వేల రకాల చేపలున్నట్టు నివేదికలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 15 శాతం దక్షిణ చైనా సముద్రంలోనే జరుగుతుంది. ఈ ఆర్థిక లాభాలను వదులుకోవడం చైనాకు ఇష్టం లేదు. అందులో భాగంగానే ఫిలిప్పీన్స్‌తో నిత్యం ఘర్షణలు పడుతోంది. నడి సముద్రంలో ఫ్లోటింగ్ బారియర్లు ఏర్పాటు చేస్తూ, ఫిలిప్పీన్స్ నౌకలపై దాడులు చేస్తూ రెచ్చిపోతోంది.
దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ విస్తరణవాదానికి బ్రేకులు వేసే ఈ అంతర్జాతీయ గేమ్‌లో.. ఇండియా ఎప్పుడో వ్యూహాత్మకంగా రంగంలోకి దిగింది. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో శాంతి భద్రతలే లక్ష్యంగా, ఫిలిప్పీన్స్ దేశానికి భారత్ అత్యంత శక్తివంతమైన 'బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను సరఫరా చేసింది. నేరుగా చైనా కళ్లెదుటే ఫిలిప్పీన్స్ ఈ క్షిపణి వ్యవస్థలను దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో మోహరిస్తోంది. దీనికి తోడు, దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానం కోసం భారత నౌకాదళానికి చెందిన అత్యాధునిక యుద్ధనౌకలు నిరంతరం ఆ జలాల్లో గస్తీ తిరుగుతున్నాయి. క్వాడ్ కూటమి ద్వారా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి చైనా దూకుడుకు భారత్ కౌంటర్ ఇస్తోంది. ఇండోనేషియాతో కలిసి హిందూ మహాసముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రానికి వెళ్లే మలక్కా జలసంధిపై భారత్ పూర్తి నిఘా పెట్టింది. ఒకవేళ చైనా గనుక ఫిలిప్పీన్స్ లేదా తైవాన్‌పై యుద్ధానికి దిగితే.. చైనా వాణిజ్య రక్తాధార అయిన ఈ సముద్ర మార్గాన్ని దిగ్బంధించే వ్యూహాన్ని భారత్ సిద్ధం చేసింది. 14 దేశాల ఉమ్మడి ప్రకటన, యూరోపియన్ దేశాల మద్దతు, దానికితోడు క్షేత్రస్థాయిలో భారత్-ఫిలిప్పీన్స్ రక్షణ బంధం.. వెరసి దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏకపక్ష ఆధిపత్యానికి కాలం చెల్లిందనే సంకేతాలు ఇస్తున్నాయి. చైనా తగ్గేదే లేదంటే.. ప్రపంచ దేశాలు కూడా మునుపెన్నడూ లేనంతగా డ్రాగన్‌ను చుట్టుముట్టేందుకు సై అంటున్నాయి. మరి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.