Top story: దక్షిణాదికి దగా…ఉత్తరాదికి అగ్రపీఠం నియోజకవర్గాల పెంపులో సౌత్‌కి అన్యాయం…!

దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఎన్నో అంశాల్లో పడదు. రాజకీయంగా, సాంస్కృతికంగా సౌత్, నార్త్‌ భిన్న ధృవాలు. ఇప్పుడు కేంద్రం చేపడుతున్న లోక్‌సభ సీట్ల పెంపు...ప్రాంతీయ విద్వేషాలను మరింత రెచ్చగొడుతోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల సీఎంలు

Post Published By: dialnews
Updated : 17 April 2026, 10:39 AM IST

దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఎన్నో అంశాల్లో పడదు. రాజకీయంగా, సాంస్కృతికంగా సౌత్, నార్త్‌ భిన్న ధృవాలు. ఇప్పుడు కేంద్రం చేపడుతున్న లోక్‌సభ సీట్ల పెంపు...ప్రాంతీయ విద్వేషాలను మరింత రెచ్చగొడుతోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల సీఎంలు...తమకు జరుగుతున్న అన్యాయంపై విరుచుకుపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ తీరును ఎండగడుతున్నారు. లోక్‌సభ సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టమేంటి ?ఏ రంగంలో చూసినా...దక్షిణాది రాష్ట్రాలకు అడుగడుగునా అన్యాయం జరుగుతూనే ఉంది. పాలకులు మారుతున్నా...న్యాయం మాత్రం జరగడం లేదు. గతంలో జీఎస్‌టీ విషయంలో...దక్షిణాది రాష్ట్రాలు జరుగుతున్న అన్యాయాన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి. జీఎస్టీ రూపంలో సౌత్ రాష్ట్రాలు కొండంత ఇస్తుంటే...కేంద్రం నుంచి గోరంత మాత్రమే వస్తోందని ఆరోపించాయి.

అదే ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం గోరంత కేంద్రానికి ఇచ్చిం...కొండంత తీసుకెళ్తున్నాయని లెక్కలతో సహా పలువురు బయటపెట్టారు. తాజాగా లోక్‌సభ సీట్ల పెంపులోనూ అదే రకమైన అన్యాయం జరుగుతోంది. జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేశాయి. నార్త్‌ స్టేట్స్‌ ఒక్కటి కూడా జనాభా నియంత్రణను పాటించలేదు. దాన్ని పక్కాగా అమలు చేసిన పాపానికి...ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం...నియోజకవర్గాల పునర్విభజన జరిపితే...ఉత్తరాది రాష్ట్రాలకు లాభం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్‌ లబ్దిపొందుతోంది. బిహార్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌కు అనుకున్న దాని కంటే ఎక్కువ సీట్లు పెరుగుతుంటే... దక్షిణాది రాష్ట్రాలకు పెరగాల్సిన సీట్లలోనే కోత పడుతోంది.

ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న 543 సీట్లు ఉన్నాయి. పెంపుతో అవి 850కి చేరనున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే...ఏపీకి ప్రస్తుత దామాషా ప్రకారమే సీట్లు పెరిగితే 39 స్థానాలు వస్తాయి. అదే 50 శాతం మేర పెంచితే 38 వస్తాయి. 2011 జనాభా లెక్కల ప్రకారమైతే 35 మాత్రమే వస్తాయి. తెలంగాణకు ప్రస్తుత దామాషా ప్రకారమైతే 27 సీట్లు రావాలి. కానీ.. 50 శాతం పెంపుతో 26 సీట్లు, అదే 2011 జనాభాలెక్కల ప్రకారమైతే 25 సీట్లే వస్తాయి. అంటే.. జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే అది తెలుగు రాష్ట్రాలకు నష్టమే. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే...కేరళం పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది.

ప్రస్తుత దామాషా ప్రకారం ఆ రాష్ట్ర స్థానాలు పెరగాలంటే.. 20 నుంచి 31 కావాలి. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం పెంచితే కేవలం 23 సీట్లే వస్తాయి. అదే 50 శాతం పెంపు అయితే.. 30 సీట్లు వస్తాయి. తమిళనాడుకు ప్రస్తుతం 39 ఎంపీ సీట్లున్నాయి. 543 సీట్లకుగాను 39 సీట్లు అంటే.. 7.18 శాతం ప్రాతినిధ్యం ఉన్నట్లు లెక్క. పెరగనున్న 850 సీట్లకు అదే 7.18 శాతం దామాషాలో సీట్లు రావాలంటే.. తమిళనాడులో లోక్‌సభ స్థానాల సంఖ్య 61 కావాలి. కానీ.. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్‌ జరిపితే తమిళనాడు సీట్ల సంఖ్య 51కి చేరుతుంది. అంటే.. 10 సీట్లు తక్కువ వస్తాయి. అందుకే డీఎంకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదే 50 శాతం మేర పెంచితే మాత్రం.. 59 సీట్లు వస్తాయి. అంటే.. ప్రస్తుత దామాషా ప్రకారం చూసుకుంటే 2 సీట్లు మాత్రమే తగ్గుతాయి. అప్పటికి కూడా నష్టమేగానీ.. జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్‌తో పోలిస్తే చాలా తక్కువ నష్టం.

2011 జనాభా లెక్కల ప్రకారం పెరిగే సీట్లను బేరీజు వేస్తే...యూపీ, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌కు భారీగా లబ్ధి పొందుతాయి. జనాభా ప్రాతిపదికనే పునర్విభజన జరిగితే ఈ 4 రాష్ట్రాలకూ ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న ప్రాతినిధ్యంకన్నాఅధికంగా35సీట్లుపెరుగుతాయి.అదేసమయంలో..తమిళనాడు గరిష్టంగా 11, కేరళ 8, ఆంధ్రప్రదేశ్‌ 5, తెలంగాణ 3, కర్ణాటక 2 సీట్లు నష్టపోనున్నాయి. ప్రస్తుత వాటా ప్రకారం సీట్ల పెంపు జరగకపోవడంతో ఈ రాష్ట్రాలు 29 సీట్లు కోల్పోతున్నాయి. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే ఒడిశా కూడా 4 సీట్ల మేర నష్టపోతుంది. అదే ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం.. జనాభా లెక్కల ప్రకారం జరిగితేనే లాభం. యూపీకి 50 శాతం చొప్పున పెరిగితే 120 సీట్లే వస్తాయి. 2011 లెక్కల ప్రకారమైతే.. 140 వస్తాయి. ఉత్తరాదిన మిగతా రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి.

అన్ని రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్‌ అత్యధికంగా లాభపడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారమే లోక్‌సభ సీట్ల పెంచాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. ఆ గణాంకాల ప్రకారమే SC, ST, మహిళా రిజర్వేషన్లు ఖరారు అవుతాయన్న కేంద్రం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశాన్ని కూడా బిల్లులో చేర్చింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో వీలైనంత మేరకు మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించేలా కమిషన్ చర్యలు తీసుకుంటుందని కేంద్రం తెలిపింది. ఈ సీట్లలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉంటాయని స్పష్టం చేసింది. రొటేషన్ విధానంలోనే రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొంది. మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లను ఆయా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తారని తెలిపింది. నియోజకవర్గాల పునర్విభజనలో భౌగోళిక సమగ్రత, పరిపాలనా సరిహద్దులు, రవాణా సౌకర్యాలు వంటి అంశాలను డీలిమిటేషన్‌ కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందని కేంద్రం వెల్లడించింది.

 

Published : 
  • 17 April 2026, 10:39 AM IST