Top Story: సుదీర్గ యుద్ధంతో అమెరికాకు నష్టమే… ఆయుధ నిల్వలపై పెంటగాన్‌ సంచలన నివేదిక…!

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రెండు దేశాలు పరస్పర మిస్సైళ్లు, బాంబర్లతో దాడులు చేసుకుంటున్నాయి.

Post Published By: dialnews
Updated : 6 March 2026, 11:50 AM IST

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రెండు దేశాలు పరస్పర మిస్సైళ్లు, బాంబర్లతో దాడులు చేసుకుంటున్నాయి. యుద్ధంలో ఇరాన్‌ కంటే అమెరికాకే ఎక్కువ నష్టం జరుగుతుందా ? సుదీర్ఘకాలం యుద్ధం చేయడానికి అగ్రరాజ్యం వద్ద ఆయుధాలు లేవా ? నెల రోజుల కంటే ముందే యూఎస్‌ చేతులెత్తేస్తుందా ? పెంటగాన్‌ నివేదికలో ఏముంది ?ఇరాన్‌తో యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు...భంగపాటు తప్పేలా లేదు. స్వయంగా ఆ దేశ రక్షణ శాఖ అధికారులే బాంబు పేల్చారు. ఇరాన్‌తో ఎక్కువ కాలం వార్‌ కొనసాగితే...భారీగా ఆయుధ సామగ్రిని కోల్పోయే అవకాశం ఉందని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను పెంటగాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులకుపైగా కొనసాగితే అమెరికా మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతాయని తెలుస్తోంది. అమెరికా ఇప్పటికే టోమాహాక్ ల్యాండ్ ఎటాక్ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థల్లో వినియోగించే ఎస్ఎం-3 ఇంటర్‌సెప్టర్ల కొరతను ఎదుర్కొంటున్నట్లు పెంటగాన్‌ సీనియర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడులకు అమెరికా పెద్ద సంఖ్యలో మిస్సైళ్లు, ఇంటర్‌ సెప్టర్లను వినియోగించే అవకాశం ఉంది. దీంతో అమెరికా సైన్యం వద్దనున్న ఆయుధ నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. మరో నాలుగైదు వారాల పాటు ఈ యుద్ధం కొనసాగితే...ఇక అంతే సంగతులని పెంటగాన్‌ నివేదిక వెల్లడించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ పైకి గంభీరంగా ఉన్నప్పటికీ...పెంటగాన్‌ నివేదికతో ఇరాన్‌ మరింత విజృంభించే అవకాశం ఉంది.

టెహ్రాన్‌తో అమెరికా యుద్ధం కొనసాగిస్తే...అగ్రరాజ్యం చేజేతులా ఓటమిని కొని తెచ్చుకోవడం ఖాయమని అంతర్జాతీయ మీడియా హెచ్చరిస్తోంది. ఆయుధ నిల్వలు తగ్గిపోతే...అది అమెరికాకే అవమానమని...యుద్దంలో పరాభవం తప్పదని సంకేతాలు ఇస్తున్నాయి. ట్రంప్‌ చెబుతున్నట్లుగా అత్యాధునిక ఆయుధాలేమీ లేవని తెలుస్తోంది. రష్యాపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్‌కు...గాజాపై అటాక్‌ కోసం ఇజ్రాయెల్‌కు...భారీగా ఆయుధాలను సరఫరా చేసింది అమెరికా. ఈ కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు భారీగా తగ్గిపోయినట్లు సమాచారం.2025 జూన్‌లో ఇరాన్-ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ వేళ...అమెరికా తన దగ్గరున్న థాడ్ గగనతల రక్షణ వ్యవస్థ ఇంటర్‌సెప్టర్లలో 25 శాతాన్ని వాడేసింది. ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ సంధించిన డ్రోన్లు, మిస్సైళ్లను అడ్డుకొని నిర్వీర్యం చేయడానికి దాదాపు 150 థాడ్ ఇంటర్‌సెప్టర్లను అమెరికా వినియోగించినట్లు తెలుస్తోంది. యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే ఇంటర్‌సెప్టర్ల కొరతను కూడా అమెరికా ఎదుర్కొంటోంది. అత్యంత కచ్చితత్వంతో భూతల లక్ష్యాలపై దాడులు చేసేందుకు వినియోగించే జేడీఏఎం వంటి ఆయుధాల కొరతను కూడా అమెరికా ఎదుర్కొనే అవకాశం ఉంది.

మరోవైపు అమెరికా తయారు చేస్తున్న ఇంటర్‌సెప్టర్ల సంఖ్య కంటే...ఇరాన్ తయారుచేస్తున్న మిస్సైళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇరాన్ ప్రతినెలా 100కుపైగా మిస్సైళ్లను తయారు చేస్తోంది. అమెరికా మాత్రం ప్రతినెలా కేవలం ఆరు నుంచి ఏడు ఇంటర్ సెప్టర్లు మాత్రమే తయారు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఇరాన్‌తో సైనిక ఘర్షణ నాలుగైదు వారాల పాటు కొనసాగితే...అమెరికా యుద్ధం మొత్తం ఖర్చు రూ.19.37 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. 2023 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌కు 2 లక్షల కోట్ల సైనిక సహాయాన్ని అమెరికా అందించింది. అదే సమయంలో యెమన్, ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను కాపాడటానికి...అమెరికా సొంతంగా దాదాపు 1 లక్ష కోట్ల సైనిక వ్యయాన్ని చేసింది. అంటే గత రెండున్నర ఏళ్లలో ఇజ్రాయెల్ రక్షణ కోసం అమెరికా దాదాపు రూ.3 లక్షల కోట్ల దాకా ఖర్చు పెట్టింది. యుద్ధంలో మొదటి రోజే అమెరికాకు..7వేల కోట్లకుపైగా ఖర్చయింది. అటు సైనిక స్థావరాల కోసం 6వేల కోట్లపైగా వ్యయం చేసింది.

Published : 
  • 6 March 2026, 11:50 AM IST