Top story: ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడి… మళ్లీ యుద్ధం మొదలు ?

యుద్ధం ముగిసింది అంతా కూల్‌ అనుకుంటున్న సమయంలో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దక్షిణ ఇరాన్‌లోని మిస్సైల్‌ లాంచింగ్‌ సెంటర్లు, ఇరానియన్ నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసింది

Post Published By: dialnews
Updated : 27 May 2026, 9:29 AM IST

యుద్ధం ముగిసింది అంతా కూల్‌ అనుకుంటున్న సమయంలో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దక్షిణ ఇరాన్‌లోని మిస్సైల్‌ లాంచింగ్‌ సెంటర్లు, ఇరానియన్ నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసింది. ఆత్మరక్షణ కోసం ఈ వ్యూహాత్మక దాడులు చేశామంఊటూ అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దీంతో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.దక్షిణ ఇరాన్‌లో సోమవారం భారీ పేలుళ్లు సంభవించాయి. వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ తీర ప్రాంత నగరాల్లో ఈ పేలుళ్ల శబ్దాలు దద్దరిల్లాయి. తమ బలగాలకు పొంచి ఉన్న ముప్పును తిప్పికొట్టే చర్యల్లో భాగంగా తామే ఈ దాడులు చేసినట్లు అమెరికా సైనిక విభాగం 'యూఎస్ సెంట్రల్ కమాండ్' అధికారికంగా ప్రకటించింది.

ఇరాన్ నావికా దళాలకు చెందిన పడవలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలే లక్ష్యంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ దాడులు జరిపినట్లు అమెరికా బలగాలు స్పష్టం చేశాయి.యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఈ దాడులపై కీలక వివరాలు వెల్లడించారు. "ఇరాన్ దళాల నుంచి ఎదురవుతున్న ముప్పుల నుంచి మా బలగాలను రక్షించుకోవడానికి దక్షిణ ఇరాన్‌లో ఈ ఆత్మరక్షణ దాడులు చేశాం. సముద్ర మార్గంలో మందుపాతరలు అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ పడవలతో పాటు, క్షిపణి ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేశాం" అని పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధిలో మందుపాతరలు పెడుతున్న రెండు IRGC పడవలను, బందర్ అబ్బాస్ లోని సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి కేంద్రాన్ని అమెరికా దళాలు నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, తమ దళాల రక్షణ కోసం సంయమనం పాటిస్తూనే ఈ చర్యలు చేపట్టక తప్పలేదని సెంట్రల్ కమాండ్ వివరించింది.అమెరికా దాడుల నేపథ్యంలో దక్షిణ ఇరాన్‌లోని పోర్ట్ సిటీ బందర్ అబ్బాస్‌తో పాటు సిరిక్, జాస్క్ పట్టణాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థలు 'ఫార్స్ న్యూస్', 'తస్నిమ్' వెల్లడించాయి. ఈ ప్రాంతం హార్ముజ్ జలసంధికి అత్యంత కీలకం కావడం, ఇక్కడే ఇరాన్ ప్రధాన నావికా, వైమానిక స్థావరాలు ఉండటంతో ఈ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. అయితే, బందర్ అబ్బాస్ తూర్పు ప్రాంతంలో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇరాన్ స్థానిక మీడియా పేర్కొంది.

ఇరు దేశాల మధ్య ఏప్రిల్ లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తరువాత శాంతి చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ఇరాన్ అణు కార్యక్రమం నియంత్రణ, హార్ముజ్ జలసంధి గుండా సురక్షిత వ్యాపార లావాదేవీలను పునరుద్ధరించడం లాంటి అంశాలపై అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య ప్రస్తుతం ఖతార్‌లో కీలక చర్చలు జరుగుతున్నాయి. ఈ శాంతి చర్చలు సజావుగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు చోటుచేసుకోవడం పశ్చిమాసియాలో కలకలం రేపుతోంది.అయితే, ఈ పరిమిత ఆత్మరక్షణ దాడుల వల్ల ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం రద్దయినట్లు కాదని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు. శాంతి చర్చలు ఒకవైపు కొనసాగుతుండగానే, మరోవైపు సముద్ర జలాల్లో ఆధిపత్యం కోసం ఇరు దేశాల నావికా దళాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు అంతర్జాతీయంగా ఆందోళనను పెంచుతున్నాయి. ఎందుకంటే ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా కలిగిన హార్ముజ్ జలసంధి వద్ద శాంతి నెలకొనడం ఇరు దేశాలతో పాటు ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకం.

 

Published : 
  • 27 May 2026, 9:29 AM IST