ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ ప్రకంపన ఇది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటివరకు కేవలం ఒక వర్గానికే పరిమితం అనుకున్న ఈ కేసు.. ఇప్పుడు అధికార కూటమికి చెందిన ఒక కీలక ఎంపీ ఇంటి తలుపు తట్టింది. అవును, విజయవాడ టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని భార్య జానకిలక్ష్మికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సంచలన నోటీసులు జారీ చేశారు.ఈ నెల 27వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. అసలు ఈ కేసులో ఒక ఎంపీ భార్య పేరు ఎందుకు వచ్చింది? ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ అనే కంపెనీకి, ఈ కేసులో కింగ్ పిన్‌గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఉన్న ఆ టెక్నికల్ లింక్ ఏంటి? 2019-2024 మధ్య మునుపటి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని సిట్, ఈడీ గుర్తించాయి.
డిజిటల్ పేమెంట్లను కావాలనే నిలిపివేసి, కేవలం 'క్యాష్ ఓన్లీ' పద్ధతిని తెచ్చారు. దీనివల్ల ప్రతిరోజూ కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ సిస్టమ్ వెలుపల తిరిగింది. పాపులర్ ఇంటర్నేషనల్ బ్రాండ్లను బ్యాన్ చేసి, అర్హత లేని స్థానిక 'షెల్ డిస్టిలరీస్' కి తప్పుడు పత్రాలతో సప్లై ఆర్డర్లు ఇచ్చారు. దాదాపు రూ.10,835 కోట్ల విలువైన కాంట్రాక్టులను కేవలం 16 కంపెనీలకు కట్టబెట్టారు. అందులో ఒక్కో కేసుపై 15% నుండి 20% వరకు 'కిక్బ్యాక్స్' వసూలు చేశారనేది ఈడీ రికార్డులలో ఉన్న ప్రధాన ఆరోపణ.ఇప్పుడు కేశినేని జానకిలక్ష్మికి నోటీసులు రావడానికి దారితీసిన అసలు టెక్నికల్ మలుపు ఇక్కడే ఉంది. ఈడీ అధికారులు ప్రైడ్ ఇన్ ఫ్రాకాన్ ఎల్ఎల్పీ అనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కార్పొరేట్ డేటాను విశ్లేషించారు. ఈ కంపెనీలో కేశినేని చిన్ని భార్య జానకిలక్ష్మి వన్ ఆఫ్ ది కీ పార్ట్నర్గా ఉన్నారు. అయితే, ఈ కేసులో 'A-1' నిందితుడిగా ఉండి, సుప్రీంకోర్టు వరకు బెయిల్ రాకుండా రీసెంట్గా హైకోర్టు ద్వారా బయటకొచ్చిన వైఎస్సార్సీపీ మాజీ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డికి ఈ కంపెనీతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. రాజ్ కేసిరెడ్డికి చెందిన కొన్ని అనుబంధ కంపెనీల రిజిస్టర్డ్ అడ్రస్ మరియు జానకిలక్ష్మి పార్ట్నర్గా ఉన్న ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఆఫీస్ అడ్రస్.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్లాట్ నంబర్ 502, ఒకటే కావడం గమనార్హం. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును వైట్ మనీగా మార్చడానికి, అంటే 'మనీ లాండరింగ్' చేయడానికి ఈ ఇన్ఫ్రా కంపెనీ లావాదేవీలను ఒక రూట్‌గా వాడుకున్నారా? అనే కోణంలో ఈడీ టెక్నికల్ ఆడిట్ చేస్తోంది.ఈ కేసుకు సంబంధించి బెజవాడ రాజకీయాల్లో ఉన్న ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా మనం మాట్లాడాలి. మాజీ ఎంపీ కేశినేని నాని స్వయంగా ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖకు మరియు ఈడీ డైరెక్టరేట్‌కు లేఖలు రాశారు.
తన తమ్ముడైన కేశినేని చిన్ని, ఆయన భార్య జానకిలక్ష్మి.. రాజ్ కేసిరెడ్డితో కలిసి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆ లేఖల్లో టెక్నికల్ ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనికి కౌంటర్‌గా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ అనేది కేవలం ఒక నిర్దిష్ట ల్యాండ్ డెవలప్మెంట్ కోసం వేసిన ప్రాజెక్ట్ మాత్రమేనని, రాజ్ కేసిరెడ్డితో గతంలో వ్యాపార సంబంధాలు ఉన్న మాట వాస్తవమే అయినా ఈ మద్యం స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.అంతేకాదు, తానే స్వయంగా ఈ కేసుపై సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాశానని గుర్తుచేశారు. ఈడీ ఇప్పటికే ఈ కేసులో సిగ్నల్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్స్ డేటాను, వీఓఐపీ కాల్ డేటా రికార్డులను కూడా సాంకేతికంగా విశ్లేషించింది. గతంలో కూడా ఒకసారి జానకిలక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు మే 27న జరగబోయే విచారణలో ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేయబోతోంది? ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ముందర పెట్టి ఎలాంటి సమాధానాలు రాబట్టబోతోంది అనేది అత్యంత ఉత్కంఠగా మారింది.