చంపినోడు , చచ్చినవాడు ఇద్దరూ కాపులే . ఇప్పుడు వాళ్ళిద్దరు చుట్టూ ఏపీలో కుల రాజకీయం నడుస్తుంది. కాపుల ఓట్ల కోసం.... వైసిపి టిడిపిలు రెండు కులాల కుంపటి రాజేసి అందులో చలికాచుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజేసిన ఈ కులకుంపటినీ వైసీపీ లీడర్లు మంటగా చేసి దాన్ని మరింత రాజేశారు. ఎవరి టార్గెట్ అయినా ఫైనల్ గా ఒక్కటే, కాపుల ఓట్లను కైవసం చేసుకుని... ఏపీలో అధికారం దక్కించుకోవడమే.నాకు కాపులతో పని లేదు.... నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు.అసలు కులభావన వల్లే ఏపీ ఎదగడం లేదు. కులం ఏంటి నాన్సెన్స్....? మనందరిలోనూ జాతి భావాలు ఉండాలి... అంటూ పవన్ కళ్యాణ్ కాపు లందరి కి సుద్దులు చెబుతూ ఒక ఆట ఆడుకున్నారు.
పవన్ మాటలతో ఏపీలో కాపులందరూ రగిలిపోయారు. పవన్ ఇంత దారుణంగా యూటర్న్ తీసుకుంటాడని... కాపులు ఊహించలేకపోయారు. కాపులందరూ కలిసి తనను సీఎంని చేయాలని అన్నవాడు, నిత్యం కాపు కుల భజన చేసిన వాడు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని రికార్డుగా చెప్పినవాడు ఇలా అడ్డం తిరిగిపోవడం.... కాపులకి షాక్ ఇచ్చి నట్లయింది.ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న వైసిపి... కాపులు పవన్ కళ్యాణ్ నీ వదిలేసారు కనుక, వాళ్ళని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇదే సమయంలో విజయవాడ కృష్ణలంకలో... రౌడీ షీటర్ సాయి కృష్ణ లాకప్ డెత్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. సాయి కృష్ణ కాపు కావడంతో.... వైసిపి వెంటనే కాపు నినాదం ఎత్తుకుంది. కాపులను చంపేస్తారా... దీనిపై ఎవరూ మాట్లాడరా అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది వైసిపి.
దీనిపై పవన్ కళ్యాణ్ కూడా రగిలిపోయాడు. వాడెవడో చస్తే నన్ను అడుగుతారేంటి అని సభా ముఖంగా తిట్టిపోశాడు. క్రిమినల్స్ కి కులం అంటిస్తారా అంటూ నిలదీశాడు.అదే సమయంలో వైసీపీ లో కాపు నాయకులంతా కలిసి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం లో మీటింగ్ పెట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వైసీపీ కాపు ప్రముఖులంతా ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఇదేదో సాదాసీదా మీటింగుగా తీసిపడేలేము. కాపుల సమస్యలు అని పైకి చెప్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లను ఎలా కైవసం చేసుకోవాలన్న దానిపైనే ఈ సమావేశం దృష్టి పెట్టింది.పవన్ కళ్యాణ్ టెంపరితనం, రౌడీ షీటర్ సాయి కృష్ణ లాకప్ డెత్ మొత్తంగా టిడిపికి కాపులను దూరం చేసే పరిస్థితిని తీసుకొచ్చాయి అనే విషయాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆలస్యంగా గుర్తించారు. వైసిపి కాపులను ఎదుర్కోవడానికి.... టిడిపి కాపుల్ని రంగంలోకి దింపారు. తామే అసలైన కాపు రక్షకులమని టిడిపి కాపులు చెప్పుకుంటూ వచ్చారు.
రౌడీ షీటర్ సాయి కృష్ణను హత్య చేసిన సీఐ నాగరాజు కూడా కాపు కులస్తుడే. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్లో కాపులను చంపారు అనే వాదనను వైసీపీ బలంగా ఆ సామాజిక వర్గంలోకి తీసుకెళ్లగలిగింది. అసలే పవన్ కళ్యాణ్ పై అసంతృప్తితో రగిలిపోతున్న కాపులు ఈ లాకప్ డెత్ తో మరింత అసహనానికి గురయ్యారు. చివరికి చంద్రబాబు రంగంలోకి దిగి ఈ వివాదాన్ని తాను కూడా స్వయంగా ప్రస్తావించాల్సి వచ్చింది.ఏది ఏమైనా ఏపీ ఇప్పుడు కుల రాజకీయాలతో తగలబడిపోతుంది. లేదు లేదంటూ నే రెండు పార్టీలు కుల రాజకీయమే చేస్తున్నాయి. ముఖ్యంగా అత్యధిక సంఖ్యాకులు ఉన్న కాపు ,బలిజ ,ఒంటరి కులాల ఓట్ల కోసం ఏ వివాదాన్ని వైసీపీ ,టీడీపీ పార్టీలు వదిలిపెట్టడం లేదు. ఈ కుల రాజకీయాలు చూసి జనానికి అసహ్యం వస్తుంది గాని పార్టీలు మాత్రం నిత్యం అదే పని మీద ఉన్నాయి.