Top story: బండి వర్సెస్ ధర్మపురి.. తెలంగాణ బీజేపీలో రచ్చకెక్కిన లొల్లి.. ఆధిపత్య పోరు వెనుక అసలు నిజాలివే..!

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే క్రమశిక్షణ పార్టీ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి తీవ్రస్థాయిలో రచ్చకెక్కాయి. పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు, రెండోసారి ఎంపీలుగా గెలిచిన బలమైన లీడర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

Post Published By: dialnews
Updated : 3 September 2026, 12:17 PM IST

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే క్రమశిక్షణ పార్టీ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి తీవ్రస్థాయిలో రచ్చకెక్కాయి. పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు, రెండోసారి ఎంపీలుగా గెలిచిన బలమైన లీడర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్‌ల మధ్య వివాదం ఇప్పుడు పీక్స్‌కి చేరింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు కొనసాగుతున్నాయి. సందు దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకోవడం నిత్యకృత్యంగా మారింది. అసలు ఈ ఇద్దరు ఎంపీల మధ్య ఈ స్థాయి లొల్లి నడవడానికి గల అంతర్గత కారణాలు ఏంటి? తాజాగా జరిగిన డిజిటల్ మీడియా వివాదం ఏంటి?

బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మధ్య విబేధాలు ఈరోజు నిన్న మొదలైనవి కావు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుకు చాలా కారణాలు ఉన్నాయని వారి అనుచరులు చెప్తుంటారు. గతంలో బండి సంజయ్ తనయుడి చుట్టూ తిరిగిన ఒక పోక్సో కేసు వివాదం ఈ గొడవను మరింత పెంచింది. తన కొడుకును టార్గెట్ చేస్తూ వచ్చిన ఆ కేసు వెనుక పరోక్షంగా ఎంపీ అరవింద్ హస్తం ఉందంటూ బండి సంజయ్ వర్గం గట్టిగా ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ తీవ్రమైంది. కేవలం వ్యక్తిగత విమర్శలే కాకుండా, రాజకీయంగా కూడా ఒకరినొకరు తొక్కేయాలనే చూస్తున్నారనే టాక్ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ఇక ఈ వివాదానికి ప్రధాన రాజకీయ కేంద్రం జగిత్యాల జిల్లాగా మారింది. నియోజకవర్గాల పరంగా చూస్తే, జగిత్యాల ప్రాంతంపై ఇద్దరు నేతలకు పట్టు సాధించాలనే పంతం పెరిగింది. ముఖ్యంగా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వ్యవహారాలలో బండి సంజయ్ జోక్యం చేసుకోవడాన్ని ధర్మపురి అరవింద్ అస్సలు సహించడం లేదు. నా నియోజకవర్గంలోకి నువ్వు రావడం ఏంటి, ఇక్కడి కేడర్‌ను నీ వైపు తిప్పుకోవడం ఏంటి అంటూ అరవింద్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బయటకు ఇది చిన్న విషయంగా కనిపిస్తున్నా, అంతర్గతంగా మాత్రం జగిత్యాలలో లీడర్ షిప్ కోసం ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.

ఈ అంతర్గత గొడవలు తాజాగా ఒక డిజిటల్ మీడియా కథనంతో మళ్లీ రోడ్డుకెక్కాయి. ఇటీవల ఒక ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థలో ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై అరవింద్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఒత్తిడితో సదరు మీడియా సంస్థ ఆ కథనాన్ని ఆన్‌లైన్ నుండి తొలగించింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఓ యూట్యూబర్ ముఖాముఖి ఇంటర్వ్యూలో అరవింద్ మాట్లాడుతూ.. ఆ కథనం రాసిన మహిళా జర్నలిస్ట్ ఎవరో తనకు తెలుసని, మన సొంత పార్టీ వాళ్లే డబ్బులు ఇచ్చి ఆ కథనాన్ని రాయించారని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరపాలని ఆయన ఓపెన్‌గా అనడం ఇప్పుడు బీజేపీలో పెద్ద దుమారం రేపింది.

అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ వర్గం కూడా ఊరికే కూర్చోలేదు. తమకు సన్నిహితంగా ఉండే ఒక యూట్యూబర్‌ ద్వారా అరవింద్ కావాలనే బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తున్నారని, ఈ రకమైన ఇంటర్వ్యూల ద్వారా బండి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని బండి అనుచరులు తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. మొత్తానికి ఈ తాజా వివాదం ఇద్దరు అగ్రనేతల మధ్య ఉన్న పాత కక్షలను మళ్లీ బట్టబయలు చేసింది. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే బీజేపీలో ఎంపీల మధ్య సాగుతున్న ఈ అంతర్గత కుమ్ములాటలను చూపిస్తూ ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Published : 
  • 3 September 2026, 12:17 PM IST