ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ తన దృఢ సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన కూటమి విజయం తర్వాత.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం ఆయన చేపట్టిన సంకల్ప పాదయాత్ర నేటితో విజయవంతంగా అలిపిరి చేరుకుంది. 22 రోజుల పాటు 520 కిలోమీటర్లు నడిచాడు బండ్లన్న. ఏది అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోని తత్వం ఉన్న గణేష్.. గత 22 రోజులుగా ఎండనకా, వాననకా సాగించిన ఈ యాత్ర తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నపుడు ఆయనకు ఎలాంటి హానీ జరక్కూడదని.. ఆయనే మళ్లీ అధికారంలోకి రావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆయన చేపట్టిన ఈ దీక్ష నేడు ఒక కొలిక్కి వచ్చింది. సాధారణంగా బండ్ల గణేష్ అనగానే అందరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరభక్తుడిగానే గుర్తుకొస్తాడు. అయితే చంద్రబాబు నాయుడి పట్ల తనకు ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని ఈ పాదయాత్ర ద్వారా మరోసారి చాటుకున్నాడు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కలయిక రాష్ట్రానికి మేలు చేస్తుందని బలంగా నమ్మిన గణేష్, ఆ నమ్మకం నిజమైనందుకు కృతజ్ఞతగా ఈ కఠినమైన పాదయాత్రను చేపట్టాడు. ఒకపక్క పవన్ మీద భక్తిని చాటుకుంటూనే, కూటమికి పెద్ద దిక్కుగా ఉన్న చంద్రబాబు కోసం ఇలా మైళ్ళ కొద్దీ నడవడం ఆయనలోని అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది. సుదీర్ఘంగా సాగిన ఈ 22 రోజుల ప్రయాణంలో బండ్ల గణేష్‌కు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఆయన నడిచి వెళ్తున్న ప్రతి ఊరిలోనూ అభిమానులు, టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ, గజమాలలతో సత్కరిస్తూ ఆయనకు మద్దతుగా నిలిచారు. కేవలం ఒక సెలబ్రిటీగా కాకుండా, తమలో ఒకడిగా భావించి ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ యాత్రలో కనిపించిన జనసందోహం బండ్ల గణేష్ సంకల్పానికి మరింత బలాన్ని చేకూర్చింది.
ఫిబ్రవరి 9 సాయంత్రమే అలిపిరి చేరుకున్న బండ్ల గణేష్.. 10వ తేదీ ఉదయం తన మొక్కులో చివరి ఘట్టాన్ని పూర్తి చేసాడు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండపైకి ప్రయాణం చేసి శ్రీవారిని దర్శించుకున్నాడు గణేష్. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, చంద్రబాబు నాయుడు క్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు చేసాడు. ఇన్నాళ్లుగా చేసిన పాదయాత్రను స్వామి వారి పాదాల చెంత ముగించి, తన మొక్కును చెల్లించుకున్నాడు. మొత్తానికి సినిమాల్లో డైలాగులతో హల్చల్ చేసే బండ్ల గణేష్, నిజజీవితంలో తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్తారని ఈ యాత్ర నిరూపించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం, కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఆనందంగా ఉన్న గణేష్, తన సంతోషాన్ని ఇలా భక్తి మార్గంలో పంచుకున్నాడు. రాజకీయాలకు అతీతంగా, ఒక వ్యక్తిగా తాను పెట్టుకున్న నమ్మకాన్ని, మొక్కును పూర్తిచేసి అనుకున్నది సాధించిన బండ్ల గణేష్‌గా అందరి మన్ననలు పొందుతున్నాడు.