Top story: రాఘవ్ చద్దాకు మైక్‌ ఇవ్వొద్దు… డిప్యూటీ ప్లోర్‌ లీడర్‌ పదవి నుంచి ఔట్‌…!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చద్దాకు...ఆమ్‌ ఆద్మీ పార్టీ షాక్‌ ఇచ్చింది. రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్‌ పదవి నుంచి తొలగించింది. చద్దాకు పార్టీ మధ్య విభేదాలు ఉన్నాయా ? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కారణామా ? ఆప్‌కు రాఘవ్‌ చద్దా వైఖరి నచ్చలేదా ? అసలేం జరిగింది.

Post Published By: dialnews
Updated : 3 April 2026, 9:04 AM IST

రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చద్దాకు...ఆమ్‌ ఆద్మీ పార్టీ షాక్‌ ఇచ్చింది. రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్‌ పదవి నుంచి తొలగించింది. చద్దాకు పార్టీ మధ్య విభేదాలు ఉన్నాయా ? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కారణామా ? ఆప్‌కు రాఘవ్‌ చద్దా వైఖరి నచ్చలేదా ? అసలేం జరిగింది.
కొంతకాలంగా రాఘవ్‌ చద్దా పేరు మార్మోగిపోతోంది. పార్లమెంట్‌లో ఎక్కడ చూసినా ఆయన ప్రసంగం. ప్రజల్లోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. అనేక సమస్యలను ప్రస్తావించి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇంతలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం షాక్‌ ఇచ్చిది. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి సీనియర్ నేత రాఘవ్ చద్దాను తొలగించింది. సభలో పార్టీ తరపున మాట్లాడేందుకు రాఘవ్ చద్దాకు ఇకపై మైక్ ఇవ్వొద్దని...రాజ్యసభ సేక్రటేరియట్‌ను కోరింది.

రాఘవ్‌ చద్దా స్థానంలో మరో ఎంపీ అశోక్ మిట్టల్‌ను కొత్త డిప్యూటీ లీడర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించాలని రాజ్యసభ సెక్రటేరియట్‌కు అధికారికంగా లేఖ రాసింది. ఆయన స్థానంలో పార్టీ డిప్యూటీ లీడర్ గా అశోక్ మిట్టల్ ను నియమించాలని కోరింది. రాఘవ్ చద్దాను అకస్మాత్తుగా డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సభలో ఆయనకు పార్టీ తరపున మాట్లాడేందుకు మైక్ ఇవ్వొద్దని అధిష్టానం కోరడం వెనుక ఉన్న అంతర్గత కారణాలేమిటన్నది ఆసక్తికరంగా మారింది.

రాఘవ్ చద్దా పదవి కోల్పోవడానికి ఆయన వైఖరే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.ముఖ్యమైన అంశాలపై స్పందించకపోవడం, కొన్ని అంశాలపై మౌనం పాటించడం పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత రాఘవ్ చద్దా మౌనంగా ఉండడం అధిష్టానానికి నచ్చలేదు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వంటి నేతలపై వచ్చిన కేసుల విషయంలో చద్దా మౌనంగా ఉండడం, అలాగే పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండడం క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల ఆయన ఎయిర్‌పోర్టుల్లో ఆహార ధరలు, పెటర్నిటీ లీవ్ వంటి సామాన్య ప్రజల సమస్యలపై పార్లమెంటులో గళం విప్పారు. అయితే ఇవి పార్టీ వ్యూహానికి భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2026 ప్రారంభంలో గిగ్ వర్కర్ల నిరసనల మధ్య, ఆ రంగంలోని వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు ,సవాళ్లను మరింతగా అర్థం చేసుకోవడానికి అతను ఒక రోజు డెలివరీ బాయ్ గా పనిచేశాడు. 28 రోజులు రీచార్జ్ ప్లాన్ పై కూడా ఆయన రాజ్యసభలో ధ్వజమెత్తారు.పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైనా రాఘవ్ చద్దా... ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీతో అనుబంధం ఉంది.

2012లో ఢిల్లీ లోక్‌పాల్ బిల్లు సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు రాఘవ్‌ చద్దా..ఆమ్ ఆద్మీ పార్టీలో పాఅత్యంత వేగంగా ఎదిగారు. 2022లో 33 ఏళ్ల వయసులో రాజ్యసభకు ఎన్నికై..అతి పిన్న వయస్కుడైన ఎంపీగా రికార్డు సృష్టించారు. పార్టీ జాతీయ ప్రతినిధిగా, ట్రెజరర్‌గా, ఢిల్లీ జలమండలి వైస్ ఛైర్మన్‌గా ఆయన పనిచేశారు. 2023లో సంజయ్ సింగ్ స్థానంలో ఆయనను డిప్యూటీ లీడర్‌గా నియమించారు. రాఘవ్ చద్దా వంటి కీలక నేతపై వేటు వేయడం ఆమ్ ఆద్మీ పార్టీలో పెరుగుతున్న అంతర్గత సంక్షోభానికి అద్దం పడుతోంది. ఒకప్పుడు పార్టీకి ట్రబుల్ షూటర్‌గా ఉన్న నేత, ఇప్పుడు పార్టీకి దూరమవ్వడం భవిష్యత్తులో రాజకీయంగా ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Published : 
  • 3 April 2026, 9:04 AM IST