Top story:ట్రంప్‌ను వణికిస్తున్న ఇరాన్ లేడీ గూఢచారి…యుద్ధంలో US నుంచి ఇరాన్‌కు ఆయుధాలు…!

ఇక్కడ FBI అదుపులో ఉన్న మహిళ పేరు షమీమ్ మాఫి. ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా నిఘా వర్గాలను షేక్ చేస్తోంది ఈమె వ్యవహారమే. అందుకు కారణం యుద్ధ సమయంలో అక్రమంగా బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లు సరఫరా చేయడమే.

Post Published By: dialnews
Updated : 22 April 2026, 4:30 PM IST

ఇక్కడ FBI అదుపులో ఉన్న మహిళ పేరు షమీమ్ మాఫి. ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా నిఘా వర్గాలను షేక్ చేస్తోంది ఈమె వ్యవహారమే. అందుకు కారణం యుద్ధ సమయంలో అక్రమంగా బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లు సరఫరా చేయడమే. ఈ క్రమంలోనే అమెరికా అధికారులు లాస్‌ఏంజిలెస్‌ విమానాశ్రయంలో ఆమెను అరెస్టు చేశారు. ఇరాన్‌ మూలాలున్న 44ఏళ్ల షమీమ్‌ మాఫి అమెరికాలో స్థిరపడింది. అక్రమంగా యుద్ధ సామగ్రిని సరఫరా చేసేందుకు ఇరాన్‌ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఆత్మహుతి డ్రోన్లు, బాంబులు, మందుగుండు సామగ్రి తరలిస్తోందని FBI అధికారుల దర్యాప్తులో తేలింది. షమీమ్‌ మధ్యవర్తుల నుంచి లావాదేవీలు నిర్వహిస్తోంది. ఇరాన్‌ మంత్రిత్వశాఖకు మానవరహిత విమానాలైన మొహాజెర్‌-6 సాయుధ డ్రోన్లను అక్రమంగా సరఫరా చేసేందుకు 70 మిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2023లో మొదలైన అంతర్యుద్ధానికి సూడాన్‌ రక్షణ మంత్రిత్వశాఖకు ఈ నెట్‌వర్క్‌ నుంచే 55 వేల బాంబు ఫ్యూజ్‌లను సరఫరా చేసినట్టు నిందితురాలిపై ఆరోపణలు ఉన్నట్టు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి.

మరోవైపు.. షమీమ్‌ మాఫి 2022 డిసెంబర్‌, 2025 జూన్‌లో ఇరాన్‌ మంత్రిత్వశాఖతో నేరుగా సంప్రదింపులు జరిపినట్టు ఫోన్‌కాల్‌ రికార్డులను పోలీసులు కోర్టు ముందుంచారు. ఇరాన్ నిఘా, భద్రతా మంత్రిత్వ శాఖతో ప్రత్యక్ష సంబంధంలో ఉన్నారని, అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆమెకు టెహ్రాన్.. ఆదేశాలు, ఆర్థిక మద్దతు అందినట్లు దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ఆమెకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను టెహ్రాన్ స్వాధీనం చేసుకుందని, ఆ ఆస్తులను తిరిగి పొందాలంటే అమెరికాలో వ్యాపారాన్ని స్థాపించాలని ఆదేశించినట్లు కోర్టు రికార్డులు చెబుతున్నాయి. చట్టబద్ధమైన వ్యాపార కార్యకలాపాల ముసుగులో ఆయుధ ఒప్పందాలను సులభతరం చేయడానికి ఆమెను ఒక మధ్యవర్తిగా వాడుకున్నారని అధికారులు వాదిస్తున్నారు. 'ది న్యూయార్క్ పోస్ట్' కథనం ప్రకారం.. ఆమె కార్యకలాపాలు కేవలం వ్యక్తిగతమైనవి కావని, అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకోవడానికి ఇరాన్ ప్రభుత్వ సంస్థలు చేస్తున్న విస్తృత ప్రయత్నాలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను షమీమ్ తోసిపుచ్చారు. అమెరికాలో ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించాలని ఇరాన్ అధికారులు తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదని ఆమె దర్యాప్తు అధికారులకు చెప్పారు.

ఇరాన్ పౌరురాలు అయిన షమీమ్ మాఫి 2013లో ఇరాన్ నుండి అమెరికాకు వచ్చి, 2016లో గ్రీన్‌కార్డ్ పొందింది. సోషల్ మీడియాలో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు ఫోటోలు పెట్టేది. ఖరీదైన కార్లు, ప్రపంచ దేశాల పర్యటనలతో ఒక సాధారణ వ్యాపారవేత్తగా చలామణి అయ్యేది.సూడాన్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్యుద్ధంలో ప్రభుత్వ దళాలు ఇరాన్ తయారీ డెడ్లీ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు ఇటీవలే నివేదికలు వచ్చాయి. 2023 నుండి సూడాన్‌లో సైన్యానికి, పారామిలిటరీ దళాలకు మధ్య భీకరమైన అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో సూడాన్ సైన్యానికి ఇరాన్ డ్రోన్లు చాలా అవసరమయ్యాయి. సరిగ్గా ఈ గ్యాప్‌ను వాడుకుని షమీమ్ మాఫీ ఆయుధ ఒప్పందాలు కుదిర్చింది. అలాగే, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో ఇరాన్ ఆయుధ బదిలీలపై వాషింగ్టన్ తన పర్యవేక్షణను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన FBI షమీమ్‌పై నిఘా పెట్టింది. ఏప్రిల్ 18న రాత్రి ఇస్తాంబుల్‌కు వెళ్లే విమానం ఎక్కేలోపే షమీమ్ మాఫీని అరెస్ట్ చేశారు. షమీమ్ మాఫి తొలి కోర్టు విచారణ లాస్ ఏంజెల్స్‌లోని ఫెడరల్ కోర్టులో జరగనుంది. ఒకవేళ నేరం నిరూపితమైతే ఆమెకు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

షమీమ్ మాఫీ ఒక ప్రభుత్వ ఏజెంట్‌లాగా లేదా మధ్యవర్తిలాగా ఇరాన్ ప్రయోజనాల కోసం పనిచేసినట్లు కనిపిస్తోంది. అందుకే, న్యూయార్క్ పోస్ట్, ఇతర పాశ్చాత్య మీడియా సంస్థలు ఆమె విలాసవంతమైన జీవనశైలిని, ఆమె నడిపిన భారీ ఆయుధ నెట్‌వర్క్‌ను వివరిస్తూ, రష్యన్ వెపన్స్ డీలర్ విక్టర్ బౌట్ అలియాస్ మర్చంట్ ఆఫ్ డెత్‌తో పోల్చాయి. అయితే, ఈ వ్యవహారంపై ఇరాన్ ఇంకా స్పందించ లేదు. యుద్ధ సమయంలో తన ఏజెంట్ల గురించి బహిరంగంగా మాట్లాడటం ఇరాన్‌కు దౌత్యపరంగా ఇబ్బందులు తెస్తాయి కాబట్టి ఈ వ్యవహారంపై టెహ్రాన్ మౌనంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆమె ఇరాన్ ఇంటెలిజెన్స్‌కు అత్యంత కీలకమైన వ్యక్తి అని తేలితే, భవిష్యత్తులో ఆమెను విడిపించుకోవడానికి ఇరాన్ తన వద్ద ఉన్న అమెరికా ఖైదీలను వదిలేస్తామని ప్రతిపాదించే అవకాశం ఉంది. మరి ఈ ఎపిసోడ్‌ మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Published : 
  • 22 April 2026, 4:30 PM IST