డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో వైసీపీ నేత అనంతబాబు భార్య పాత్ర ఉందా ? హత్యకు ప్రేరించడమే కాదు...ఆధారాలను ధ్వంసం చేయడంలో కీలకంగా వ్యవహరించారా ? మృతదేహాన్ని పడేసే సమయంలో...అనంత లక్ష్మీదుర్గ వాహనంలోనే ప్రయణించారా ? సుబ్రమణ్యంను చంపేసిన తర్వాత...పోలీసులకు అనుమానం రాకుండా పలు సార్లు దుస్తులు మార్చుకున్నారా ? లక్ష్మీదుర్గపై సిట్ మోపిన అభియోగాలు ఏంటి ?దళితుడు వీధి సుబ్రమణ్యం హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుతో ఆయన భార్య అనంత లక్ష్మీదుర్గ ఆలియాస్ రోజా పాత్ర ఉన్నట్లు సిట్ అభియోగాలు మోపింది.
భర్త అనంతబాబును సుబ్రమణ్యంను హత్య చేసేలా ప్రేరేపించడమే కాదు...మృతదేహాన్ని మాయం చేయడంలోనూ కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సిట్ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, కాల్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు చేయించింది. రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో సిట్ అధికారులు...తాజాగా అభియోగ పత్రం దాఖలు చేశారు. నేరంలో అన్ని రకాలుగా అనంతబాబుకు పూర్తి సహకారం అందించినట్లు తేలింది. హత్య తర్వాత ఆధారాల ధ్వంసం చేయడం, ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడంలోనూ అన్ని విధాలా సహకరించారని సిట్ నిర్దారించింది.
సీసీ కెమెరాల్లోని దృశ్యాలను విశ్లేషించి సిట్...హత్య సమయంలో ఘటనా స్థలంలో, మృతదేహాన్ని తీసుకెళ్లిన వాహనంలో అనంతబాబుతో కలిసి ప్రయాణించినట్లు నిగ్గు తేల్చింది. ఈ కేసులో ఆమెను రెండో నిందితురాలిగా చేర్చింది. అంతేకాకుండా హత్య, హత్యకు ప్రేరేపించటం, ఆధారాలు ధ్వంసం చేశారంటూ ఆమెపై అభియోగాలు మోపింది. వైసీపీ హయాంలో పోలీసులు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు జరగలేదు. కీలకమైన సాంకేతిక ఆధారాలు సేకరించకుండా వదిలేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..గతేడాది జులైలో తదుపరి దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది.
సుబ్రహ్మణ్యం ఆరేళ్ల పాటు అనంతబాబు, అతని భార్య లక్ష్మీదుర్గ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేశారు. అదే సమయంలో తన పెళ్లి ఖర్చుల కోసం అనంతబాబు నుంచి 50 వేలు అప్పు తీసుకున్నారు. 30 వేలు తిరిగి చెల్లించేశారు. హత్యకు గురికావటానికి మూడు నెలల ముందు సుబ్రహ్మణ్యం.. అనంతబాబు దంపతుల దగ్గర ఉద్యోగం మానేశారు. దీంతో కక్ష పెంచుకున్న అనంతబాబు తనకు చెల్లించాల్సిన 20 వేలు ఇవ్వలేదు. దీంతో సుబ్రమణ్యాన్ని, అతని కుటుంబ సభ్యుల్ని డబ్బు కోసం అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ పదేపదే బెదిరించారు. 2022 మే 19న రాత్రి 7.30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం, అతని స్నేహితుడు కలిసి...రాంబగీచా అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వెళ్లారు. అదేరోజు రాత్రి 8.09 గంటల సమయంలో అనంతబాబు సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి అతని గురించి ఆరా తీశారు.
తనకు చెల్లించాల్సిన 20 వేలు ఇవ్వకపోతే కాళ్లు చేతులు, నరికేస్తానని వార్నింగ్ ఇచ్చారు. 2022 మే 19న అనంతబాబు జన్మదినం కావటంతో శంకర్ టవర్ అపార్ట్‌మెంట్‌లో తన భార్య లక్ష్మీదుర్గతో కలిసి ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. అదే రోజు రాత్రి 10.15 నుంచి 10.30 గంటల సమయంలో శంకర్ టవర్స్ పక్కనే ఉన్న నవభారత్ పబ్లిక్ స్కూల్ వద్ద సుబ్రహ్మణ్యం స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండటంతో.. అనంతబాబు అక్కడికి వెళ్లాడు. సుబ్రమణ్యంను తన ఏపీ 39బీ 0456 నంబరు వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. తర్వాత కొన్ని గంటల్లోనే అతని మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు.
19వ తేదీ అర్ధరాత్రి 12.53 గంటల సమయంలో అనంతబాబు.. సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేశాడు. నాగమల్లితోట కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం గాయాలపాలయ్యాడని ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో అనంతబాబు సెల్‌టవర్ లొకేషన్ నాగమల్లితోట దగ్గర కాకుండా ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డు ఏరియాలో, బృందావన్ కాలనీలో ఉంది. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు నాగమల్లితోట కూడలి వద్దకు వెళ్లి చూస్తే... అసలు అక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన ఆనవాళ్లే కనిపించలేదు. అదేరోజు అర్ధరాత్రి తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని అనంతబాబు తన వాహనంలో తీసుకొచ్చి.. సుబ్రహ్మణ్యం కుటుంబ నివసించే అపార్ట్‌మెంట్ వద్ద పడేశారు.
2 లక్షలు ఇస్తానని ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు చేయించాలని బెదిరించారు. బాధిత కుటుంబ సభ్యులు ఎదురుతిరగటంతో వెనక్కి వెళ్లిపోయారు. సుబ్రహ్మణ్యం హత్యకు ముందు, ఆ తర్వాత కూడా అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గలు వారు నివసించే శంకర్ టవర్స్ అపార్ట్‌మెంట్, ఎదురుగా ఉండే ఈశ్వర ధరణి అపార్ట్‌మెంట్స్‌లో పలుమార్లు హడావుడిగా తిరుగుతూ కనిపించారు. హత్యకు ముందు, తర్వాత నాలుగైదుసార్లు దుస్తులు మార్చుకుని కనిపించారు. ఇవన్నీ సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకొచ్చి తిరుగుతున్నారు.
ఆయన భార్య, రెండో నిందితురాలైన లక్ష్మీదుర్గను విచారణకు రావాలని పోలీసులు ఇదివరకే నోటీసులు జారీ చేయగా.. ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుని పరారైపోయారు. సుబ్రహ్మణ్యం హత్యకు ముందు రాత్రి వాచ్‌మన్ గదిలోకి వెళ్లిన లక్ష్మీదుర్గ.. వాచ్‌మన్ కుమార్తెను పెద్ద కర్ర తీసుకురావాలని సూచించారు. లేదని చెప్పడంతో ఏదో ఒక కర్ర తీసుకురావాలని తీవ్ర ఒత్తిడి చేశారు. హత్య గురించి తనకు తెలియదంటూ...అనంతబాబు భార్య గతంలో పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. సీసీ కెమెరా ఫుటేజీల విశ్లేషణలో తేల్చిన సిట్ అధికారులు.. అదే సమయంలో హత్య జరిగిన ఘటనా స్థలంలో ఆమె ఉన్నట్లు కూడా సీసీ ఫుటేజీల్లోనే గుర్తించారు. దీంతో అప్పట్లో ఆమె చెప్పిన వాంగ్మూలమంతా పచ్చి అబద్ధమని, హత్యలో ఆమెది క్రియాశీలక పాత్ర అని నిగ్గు తేలింది.