రెండేళ్లు గడిచిపోయాయి. ఇంకా మూడేళ్లు మాత్రమే ఉంది. చివరి సంవత్సరం ఎలాగూ ఎలక్షన్ ఇయర్. అంటే ఇంకా రెండేళ్లే. ఇక రాబోయేది మనకు గవర్నమెంటే. ఇక ఆ తర్వాత రప్ప... రప్ప.... రప్ప. వైసీపీలో జగన్ దగ్గర నుంచి.... నాయకులు కార్యకర్తలు వరకు... అందరూ ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. రాష్ట్రంలో టిడిపి జనసేన ఎమ్మెల్యేల పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కనుక వైసిపి గవర్నమెంట్ వచ్చేసినట్లే అని జగన్ అండ్ కో ప్రమాణస్వీకారానికి కొత్త బట్టలు కుట్టించేందుకు సిద్ధమైపోతున్నారు. కానీ గ్రౌండ్లో పరిస్థితి వాళ్లనుకునేటంత దారుణంగా ఏమీ లేదు. జగన్ చుట్టూ ఉన్నవాళ్లు రకరకాల సర్వేలు చేస్తూ... ఆయనకి చూపిస్తూ ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి 110 కి వస్తాయని..... రెండేళ్ల తర్వాత ఎన్నికలు జరిగితే 150 వస్తాయని, భ్రమల్లో వెళ్ళిపోతున్నారు. 2024 ఎన్నికల్లో అత్యంత దారుణంగా 11 సీట్లకు పడిపోతామనే ఓటమిని ఊహించలేని జగన్ వై నాట్ 175 అనే నినాదం ఇచ్చి బొక్క బోర్లా పడ్డారు.
జనాన్ని అంచనా వేయడంలో ఇండియాలోనే ఏ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా విఫలం అవ్వలేదు. ప్రభుత్వంలో ఉండి, ఇంటిలిజెంట్ చేతిలో ఉండి, 400 కోట్ల రూపాయలు ఐ ప్యాక్ లాంటి సంస్థకి ఇచ్చి... నిత్యం సర్వేలు చేయించుకుని... చివరికి ఎవ్వరూ ఊహించనంత దారుణంగా ఓడిపోయారు జగన్ అండ్ వైసిపి. దీనిని బట్టి వైసీపీలో ఎలాంటి వ్యవస్థ ఉంటుందో.... ఎంత మేధావులు ఉంటారో... వాళ్ల పనితీరు ఎలా ఉంటుందో దేశం మొత్తానికి తెలిసిపోయింది. వైసీపీలో తెరవెనక పాత్ర పోషించే ట్రంప్ అవినాష్ అనే కుహనా మేధావి ఈ మధ్యకాలంలో ఒక పెద్ద సర్వే చేశారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు అయితే 95 110 మధ్య వైసీపీకి సీట్లు రావడం ఖాయమని అది 2029 కి 150 కి వెళ్ళిపోయిన ఆశ్చర్యం లేదని చెప్పి, జగన్ చుట్టూ చేరి.... ముగ్గేసి అతన్ని మధ్యలో కూర్చోబెట్టారు. ఇదే మేధావి బృందం 2024 లోను వైసీపీకి నూట అరవై 175 మధ్య సీట్లు వస్తాయి అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. జగన్ మాత్రమే కాదు వైసీపీ నేతలు ,కార్యకర్తలు అందరూ ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. కానీ నిజానికి గ్రౌండ్లో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఏసీ రూముల్లో కూర్చుని లెక్కలేసే వాళ్ళకి ఫీల్డ్ లో ఉండే వాస్తవ పరిస్థితులు అర్థం కావు. అన్నిటికీ మించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ని తక్కువ అంచనా వేయడం ఇంకా దారుణం.
టిడిపి జనసేన ఎమ్మెల్యేల్లో కొందరు అవినీతికి పాల్పడడం, ఇసుక, మట్టి వ్యవహారాల్లో తల దూర్చడం ఇవన్నీ వాస్తవమే. కానీ కొందరు ఊహిస్తున్నట్లుగా చంద్రబాబు సర్కార్ పై విపరీతమైన వ్యతిరేకత ఏమీ జనంలో లేదు. అన్నిటికీ మించి సంక్షేమ పథకాల అమల్లో పూర్తిగా కాకపోయినా కొన్ని సమగ్రంగా అమలవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్ విషయంలో కూటమి సర్కార్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఒకటో తేదీకి కచ్చితంగా పెన్షన్ ఇవ్వగలుగుతున్నారు. అలాగే మిగిలిన సంక్షేమ పథకాల్లో అన్ని కాకపోయినా కొన్ని అమలు అవుతున్నాయి. వీటన్నిటికీ మించి పరిశ్రమల స్థాపన విషయంలో జగన్ కంటే చంద్రబాబు ఎంతో కొంత యాక్టివ్ గా పనిచేస్తున్నారని చెప్పుకోవాలి. విశాఖ విషయంలో అసంతృప్తి రాకుండా చంద్రబాబు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు 2019...24 మధ్య వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, ముఖ్యంగా విజయసాయిరెడ్డి దుర్మార్గాలు ఇంకా మర్చిపోలేదు. విశాఖలో 500 గజాల స్థలం ఉన్న వాడు కూడా దానిని రక్షించుకోవడానికి అల్లాడిపోయారు. అలా జనాన్ని వనికించేశాడు సాయి రెడ్డి.
జగన్ సర్కార్ అరాచకాలనీ జనం పూర్తిగా మర్చిపోయారని వైసీపీ నేతలు కొందరు భావిస్తున్నారు. అది చాలా అమాయకత్వం. మధ్యతరగతి జనం లో ఇప్పటికీ జగన్ వైసీపీ పట్ల చాలా భయం ఉంది. ఐదేళ్లలో జగన్ సర్కార్ పైకి ప్రజా సంక్షేమ పాలన అని ఎన్ని కథలు చెప్పిన మధ్యతరగతి జనాన్ని మాత్రం భయంతో వనికించేసింది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ అరాచకం, మీడియా మర్చిపోయిన జనం మర్చిపోలేదు. ప్రజా వేదిక లాంటి ప్రభుత్వ భవనాలు కూల్చేయడం , మాజీ మంత్రులను అరెస్టు చేసి జైల్లో వేయడం, ప్రత్యర్థి పార్టీ వాళ్లను హత్యలు చేయడం, రియల్ ఎస్టేట్ ని కుప్పకూల్చేయడం , ఒకటి కాదు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉండేది. అయితే ఈ రెండేళ్లకే ఆనాటి తమ అరాచకాలు జనం మర్చిపోయారని వైసీపీ నేతలు అప్పుడే చంకలు కొట్టేసుకుంటున్నారు. కానీ లోలోన అంతర్లీనంగా జగన్ అండ్ కో అరాచకాలపై జనంలో ఇప్పటికీ భయం ఉంది. రెండోసారి వైసిపి అధికారంలోకి రాకుండా ఆ భయం మళ్లీ టీడీపీ వైపు చూసే అవకాశం లేకపోలేదు.
కూటమి పాలనలో సామాన్యులను టార్గెట్ చేసి వేధించినట్లుగా ఎక్కడ మనకు కనబడదు. అన్నిటికీ మించి 76 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు నిత్యం రన్నింగ్ మెషిన్ లాగా పని చేస్తున్న తీరు ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అమరావతి కావచ్చు, పరిశ్రమల ఏర్పాటు కావచ్చు, శాఖా పరంగా మిగిలిన వ్యవహారాలు కావచ్చు రాష్ట్రంలో ఏదో ఒక ఆక్టివిటీ ఉంది. కానీ జగన్ ఐదేళ్ల పాలనలో డబ్బులు పంచడం తప్ప మరో యాక్టివిటీ లేదు. దీనికి తోడు వైసీపీ నేతల అరాచకాలు... వాళ్ల చేష్టలు మాటలు జనం మర్చిపోలేదు. ముఖ్యంగా వైసిపి నేతలు రోజా, విడదల రజిని, గుడివాడ నాని, అనిల్ కుమార్ యాదవ్ మరికొందరు జనంలో సొంత పార్టీ నీ చులకన చేసి పడేసారు. వీళ్లు మళ్లీ వస్తే అరాచకమే అనే భావన ఇప్పటికీ జనంలో ఉంది.జగన్ అండ్ వైసిపి కేవలం ప్రభుత్వ వ్యతిరేకత పైనే ఆధారపడి తన భవిష్యత్తు రాజకీయాన్ని రూపొందిస్తుంది. ఇక్కడే ఆ పార్టీ మరోసారి దారుణంగా దెబ్బతింటుంది.1999లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు మిగిలిన కాంగ్రెస్ నాయకులు కూడా ఇదేవిధంగా ఆలోచించి కేవలం జనంలో ఉన్న అరకొర ప్రభుత్వ వ్యతిరేకత పైనే ఆధారపడి దారుణంగా దెబ్బ తిన్నారు.
ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.1999 లో కాంగ్రెస్, వైయస్సార్ చేసిన తప్పులే ఇప్పుడు జగన్, వైసిపి నేతలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. దానిని అధిగమించి ముందుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. సోషల్ మీడియాలో వచ్చే రియాక్షన్స్ చూసి అవే ఓట్లుగా మారిపోతాయి అనుకోని జగన్ తప్పుడు అంచనాలు వేస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఆయన గమనించలేకపోతున్నారు.2019...24 మధ్య ఐదేళ్ల కాలంతో పోలిస్తే రెండు అంశాలు జనం కీలకంగా గమనిస్తున్నారు. ఆ ఐదేళ్లు ఉన్నంత అరాచకం, గొడవలు, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల దాస్టికాలు ఈ రెండేళ్లలో లేవు. ఆ తర్వాత స్టేట్లో ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ ఎంతో కొంత పెరిగింది. ఆ రోజుల్లో ఐపాక్ చేసిననీ డ్రామాలు ఇప్పుడు జరగటం లేదు. చంద్రబాబు కూటమి సర్కారు పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని సర్టిఫికెట్ ఇవ్వలేం కానీ, 2019...24 తో పోలిస్తే ఎంతో కొంత మెరుగ్గా ఉందని, అశాంతి అప్రసాంతత లేవని జనంలో కచ్చితంగా అభిప్రాయం ఉంది. అందువల్ల జగన్ అండ్ కో రేపు ఎల్లుండో పవర్ లోకి వచ్చేస్తున్నాం అనే భ్రమలో ఉంటే వైసీపీ షెడ్ కి వెళ్లిపోవడం ఖాయం.
వైసిపి కులాల సమీకరణలు బాగా లెక్కేసుకుంటుంది. ఎస్సీ ఎస్టీలు పూర్తిగా తమతోనే ఉన్నారని. కాపుల్లో డివిజన్ వస్తుందని. అందువల్ల కనీసం 60 శాతం కాపులు ఈసారి వైసిపి తో ఉంటారని. బీసీలు కూడా వైసిపి వైపే చూస్తున్నారని ఇలా కుల సమీకరణాలు.... కాకి లెక్కలు వేసి 20 29 లో అధికారంలోకి రావడం ఖాయం అని అప్పుడే జబ్బులు చరుచుకుంటున్నారు. నిజానికి 2024లో టిడిపి ఒంటరిగా పోటీ చేసిన .....ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లు కచ్చితంగా గెలుచుకొని ఉండేది. ముందు జాగ్రత్తగా కూటమి కట్టడం వల్ల 164 సీట్లు తో గ్రాండ్ విక్టరీ వచ్చింది. కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరు నూటికి నూరు శాతం పనిచేసింది. అప్పుడు జగన్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను బట్టి టిడిపి ఒంటరిగా పోటీ చేసిన గెలిచి ఉండేది. 24 లో జనంలో జగన్ పై అంత వ్యతిరేకత ఉంది. కూటమి కలిసి ఉన్నంతకాలం వైసిపి ఎన్ని సమీకరణాలు వేసిన... ఏపీలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టడం ఆ పార్టీకి సాధ్యం కాదు. ఈ లెక్కలన్నీ మిగిలిన వాళ్ళందరి కంటే చంద్రబాబుకు బాగా తెలుసు. జగన్ ఫుల్ టైం పొలిటిషన్ కాదు. ఆయన వ్యాపారస్తుడు. వారానికి రెండు రోజులు మాత్రమే రాజకీయం చేస్తాడు. చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలుగా ఫుల్ టైం పొలిటిషన్. రాజకీయం తప్ప మరొకటి తెలియని నాయకుడు. ఏపీలో జగన్ వస్తే మళ్లీ అరాచకమే అనే ఒక్క నినాదంతో చంద్రబాబు పిక్చర్ మొత్తం మార్చేయ గలుగుతారు. ఇప్పటికే ఆ కసరత్తు మొదలైంది. అందువలన రాష్ట్రంలో టిడిపి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, కుల సమీకరణాలు లెక్కలేసుకొని అప్పుడే తాము అధికారంలోకి వచ్చేసినట్లుగా వైసిపి ఫీల్ అయిపోతే అంతకన్నా బ్రమ మరొకటి ఉండదు.