గత నాలుగేళ్లుగా వైఎస్ కుటుంబంలో వచ్చిన చీలిక ఆ కుటుంబ అభిమానులకు, కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగులుస్తోంది. రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్న కుటుంబంలో ఇటువంటి పరిణామాలు.. వైయస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్న సమయంలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కటి కూడా బయటకు వచ్చేది కాదు. రాజకీయంగా కుటుంబాన్ని బలోపేతం చేసే దిశగానే రాజశేఖర్ రెడ్డి అడుగులు వేసేవారు. అయితే 2019 నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం, రాజకీయంగా వైసీపీని కూడా ఇబ్బంది పెట్టే దిశగానే ఉన్నాయి.
2019 తర్వాత తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించి, ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మారిపోయిన వైఎస్ షర్మిల.. వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసుతో పాటుగా, పలు అంశాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డితో విభేదిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కడప ఎంపీ సీటుకు ఆమె పోటీ కూడా చేశారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్న ఆమె.. కూటమి ప్రభుత్వం కంటే వైసీపీ పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. దీనితో రాజకీయంగా వైసిపి, రాయలసీమ జిల్లాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చు అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులను, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం కూడా షర్మిల చేస్తున్నారు.
ఇది 2029 ఎన్నికలు నాటికి వైసీపీకి మరింతగా దెబ్బకొట్టే అవకాశం ఉంటుంది. అందుకే షర్మిల విషయంలో జగన్ రాజీకి వెళ్లడమే మంచిదనే, అభిప్రాయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. దీనితోపాటుగా మరికొన్ని అంశాలను సీరియస్ గా తీసుకుంటున్న జగన్.. షర్మిల దూరం ఇలాగే కొనసాగితే మరిన్ని ఇబ్బందులు.. ఎదురయ్యే అవకాశం ఉంటుందని కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆస్తి పంపకాల విషయంలో కూడా త్వరలోనే ఒక క్లారిటీ కి వచ్చేయాలని కుటుంబంలో ఉన్న కొంతమంది పెద్దలు కూడా సూచిస్తున్నట్లు పులివెందులలో టాక్ నడుస్తోంది. దీనితో జగన్ రాజీ ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు సమాచారం.
జగన్ తో సన్నిహితంగా ఉండే ఓ మాజీ రాజ్యసభ ఎంపీ ద్వారా, ఈ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీలో ఎక్కువగా ఉంటున్న ఆయన గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తో కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆయనకు.. వైయస్ జగన్, షర్మిల చిన్నప్పటి నుంచి అతి దగ్గరగా ఉంటారు. దీనితో ఆయన ద్వారా త్వరలో వివాదాలను కొలిక్కి తీసుకురావాలని, కుటుంబం మొత్తాన్ని ఏకం చేస్తే.. తనకు రాజకీయ ప్రయోజనం ఉంటుందనే భావనలో జగన్ ఉన్నారట. మరో ఏడాది తర్వాత జగన్ పాదయాత్ర మొదలవుతుంది. ఈ పాదయాత్ర ద్వారా జగన్ మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారు.
అందుకే కుటుంబం మొత్తం దగ్గర అయితే పార్టీ వ్యవహారాలు.. కుటుంబ సభ్యులే గతంలో మాదిరిగా చూసుకునే అవకాశం ఉంటుందనేది కూడా.. ఆయన మనోగతం గా చెప్తున్నారు పార్టీ నాయకులు. అయితే ఇక్కడ షర్మిల పెడుతున్న కండిషన్ మాత్రం వైయస్ జగన్ గానీ, ఆయన సతీమణి భారతి గాని అంగీకరించే పరిస్థితి లేదనే మాట వినపడుతోంది. కడప ఎంపీ సీటు విషయంలో అంగీకారానికి ఇరువర్గాలు రాలేకపోతున్నట్లు సమాచారం. అవినాష్ రెడ్డికి కడప ఎంపీ సీటు ఇవ్వడాన్ని ముందు నుంచి షర్మిల తప్పుపడుతున్నారు. 2019లో కూడా దీని గురించి కుటుంబంలో విభేదాలు కూడా వచ్చాయి. వైయస్ వివేకానంద రెడ్డి మరణానికి దారి తీసిన పరిస్థితులు కూడా అవే అనే ప్రచారం ఉంది.
ఇక ఆ సీటును తనకు లేదా వైయస్ సునీత రెడ్డికి ఇవ్వాలని షర్మిల పట్టుబడుతున్నారు. లేదంటే వైయస్ విజయమ్మను పోటీ చేయించాలని కూడా షర్మిల పట్టుబట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఉన్నఫలంగా అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించాలనీ కూడా షర్మిల డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. వైయస్ భారతి కుటుంబానికి చెందిన అవినాష్ రెడ్డికి జగన్ ప్రాధాన్యత ఇవ్వడాన్ని షర్మిల జీర్ణించుకోలేకపోతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో కూడా అవినాష్ రెడ్డి పెత్తనం నడుస్తుందని ఆమె ఆగ్రహంగా ఉన్నారు. అందుకే అవినాష్ రెడ్డిని దూరం పెడితేనే తాను దగ్గరవుతానని కూడా షర్మిల స్పష్టంగా చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో వైయస్ విజయమ్మ కూడా షర్మిలకు అండగా ఉంటున్నారు. అందుకే ఆమె పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఈ విషయంలో షర్మిల వెనక్కు తగ్గడం లేదు. ఇదే ఇప్పుడు ఆ మాజీ రాజ్యసభ ఎంపీ గారికి ఇబ్బందికరంగా మారిందట. ఆస్తి పంపకాల విషయంలో కూడా షర్మిల కొన్ని విషయాల్లో కాస్త గట్టిగానే పట్టుబట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించి కోర్టుల్లో కూడా వాదనలు జరుగుతున్నాయి. వైయస్ విజయమ్మ కూడా ఈ కేసుల్లో కాస్త ఇబ్బంది పడుతున్నారు. అయితే మరో ఏడాదిలోపు షర్మిల కుటుంబంతో కలవకపోతే మాత్రం జగన్ స్వేచ్ఛగా రాజకీయం చేయలేని పరిస్థితి ఉంటుంది. పాదయాత్ర సమయంలో ఇది మరింత ఇబ్బందులకు దారితీసే అవకాశం కూడా ఉండవచ్చు.