Top Story: అనుభవం అయితే గాని తత్వం బోధపడలేదా? పాలిటిక్స్ కి జెడి గుడ్ బై… మేఘా కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ జాబ్…!

నికార్స్ అయినా ఐపీఎస్. ఉద్యోగం చేసినంత కాలం విలువలు కోసం తపించిన వాడు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి జెడి అనే టైటిల్ని తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు.

Post Published By: dialnews
Updated : 17 February 2026, 12:51 PM IST

నికార్స్ అయినా ఐపీఎస్. ఉద్యోగం చేసినంత కాలం విలువలు కోసం తపించిన వాడు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి జెడి అనే టైటిల్ని తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. ఆయనే వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణ. రాజకీయాల్లో మార్పు కోసం, సమాజంలో చైతన్యం కోసం ఏదో చేయాలని ఆరాటపడి పాలిటిక్స్ లోకి వచ్చి... చివరికి ఏమీ చేయలేక ... రాజకీయాలకు కి గుడ్ బై చెప్పి ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీ మేఘ ఇంజనీరింగ్ మెయిల్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా వైస్ ప్రెసిడెంట్ గా చేరిపోయారు జెడి. ఇదంతా సరే, ముడుపులకు... కమిషన్లకు కేరాఫ్ అడ్రస్ లాంటి కార్పొరేట్ ఇన్ఫ్రా కంపెనీల్లో జెడి లక్ష్మీ నారాయణ... ఎలా మన గలుగుతారు అనే దానిపైనే ఇప్పుడు జనంలో చర్చ జరుగుతుంది.

జెడి లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా జగన్ అక్రమార్జన కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు అందరూ దృష్టి లక్ష్మీనారాయణ పై పడింది. సిన్సియర్ ఆఫీసర్ గా, ముక్కుసూటి మనిషిగా ముద్రపడిన జెడి ,మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కేసులో డబ్బు తీసుకున్న ఒక జడ్జిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సంచలనం సృష్టించారు. దాంతో లక్ష్మీనారాయణ పేరు దేశమంతా మార్మోగి పోయింది. జగన్ అక్రమార్జన కేసు , ఓబులాపురం మైనింగ్ కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్, సత్యం స్కాం లాంటి సంచల కేసులను దర్యాప్తు చేశారు లక్ష్మీనారాయణ. పోలీసు అధికారిగా తనకొచ్చిన పేరు తో రాజకీయాల్లో రాణించాలనుకున్నారు జెడి.

అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పని చేస్తూనే సర్వీస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పెట్టడంతో ఆయన పార్టీలో చేరారు. 2019లో విశాఖ ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పవన్ తో విభేదాలు వచ్చి జనసేనకు కూడా గుడ్ బై చెప్పారు.2023లో జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వ్యవసాయం, గ్రామీణ జీవితంలో మార్పులు తీసుకురావాలని ఉద్దేశంతో జెడి ఫౌండేషన్ స్థాపించి గ్రామాల్లో కృషి చేశారు.కానీ రియాలిటీలో రాజకీయ జీవితం ఎలా ఉంటుందో లక్ష్మీనారాయణకు తెలిసి వచ్చినట్టుంది.

పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా ఏదో ఒక అవినీతిమయమైన పార్టీతో అంట కాగితే కానీ రాజకీయ మనుగడ సాధించలేడని, పిఠాపురంలో సైతం డబ్బులు పంచే గెలవాల్సి వచ్చిందని నిజాన్ని జీర్ణించుకోవడానికి జెడికి కొంత సమయం పట్టింది. రాజకీయాల్లో విలువలు అనేవి ఉండవని, తనలాంటి వ్యక్తులకు ఏ మాత్రం సాధ్యం కాదని ప్రాక్టికల్ గా తెలుసుకున్నారు జెడి. ఆయన కుమారుడు ఐపీఎస్ సాధించి ప్రస్తుతం చెంగల్పట్టు జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఇటీవలే జెడి భార్య ఒక ఆన్లైన్ ముఠా చేతిలో మోసపోయి రెండున్నర కోట్లు పోగొట్టుకున్నారు.పోలీస్ అధికారిగా ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ నీ చూసి, వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలు గమనించి... తాను రాజకీయాల్లోకి వెళితే కానీ.... సమాజాన్ని ప్రక్షాళన చేయలేనని, భావించి ఉన్న సర్వీస్ ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి భంగపడ్డారు జేడి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగితే గాని వ్యవస్థలు ఎంతగా కుళ్ళిపోయాయో ఆయనకు అర్థం కాలేదు. అందుకే తెలివిగా చేతులు కడుక్కొని మేఘ ఇంజనీరింగ్ మెయిల్.... సహ సంస్థ అయినటువంటి ఒలక్ట్రా ఈ వి వాహనాల కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉద్యోగం సంపాదించి అందులో చేరిపోయారు.

కాకపోతే జేడీ లక్ష్మీనారాయణ మేఘ సంస్థలో చేరడమే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దేశంలోనే అతిపెద్ద ఇన్ఫ్రా కంపెనీలో ఒకటైన మేఘ కొన్ని ఏళ్ళ క్రితం ఒలక్ట్రా కంపెనీని కొన్నది. ఇటీవలే ఆ కంపెనీ సీఈవో తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో 20 కి పైగా రాష్ట్రాల్లో ఇన్ఫ్రా తో పాటు ఇతర ప్రాజెక్టులు చేస్తున్న మేఘ... అన్ని పొలిటికల్ పార్టీలకు, అధికారులకు ముడుపులు ఇవ్వడంలో దిట్ట అని విమర్శలు ఉన్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో కొందరు అధికారులకు ముడుపులు ఇస్తూ మేఘా సిబ్బంది దొరికిపోయారు.

ప్రతి ప్రాజెక్టు లో సిక్స్ పర్సెంట్ కమిషన్ సంస్కృతిని దిగ్విజయంగా అమలు చేస్తున్నది మేఘాయినని పొలిటికల్ సర్కిల్స్ లో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి కంపెనీలో నిజాయితీపరుడైన జేడీ లక్ష్మీనారాయణ చేరడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మేఘ సంస్థ సహజంగానే సమర్థులైన రిటైర్డ్ ఇంజనీర్లను, రిటైర్డ్ ఐఏఎస్ లను తన దగ్గర తెచ్చి కట్టిపడేస్తుంది. వాళ్ల ద్వారా ప్రభుత్వాల్లో వివిధ శాఖల్లో వ్యవహారాలన్నీ చక్కబెడుతుంది. అలాంటి సంస్థ కి జెడి ఎలా లొంగిపోయారు?... రేపు భవిష్యత్తులో విలువలు వదిలేసి ఎలా పని చేస్తారు?అని చాలామంది చర్చిస్తున్నారు. మరికొందరు జేడిని నేరుగానే విమర్శిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల్లో చేరడం ద్వారా ఇన్నాళ్లు తాను కూడబెట్టుకున్న విశ్వసనీయతను లక్ష్మీనారాయణ కోల్పోయారని.... అనుభవం అయితే గాని తత్వం బోధపడలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Published : 
  • 17 February 2026, 12:51 PM IST