Top story: రహస్యంగా పుతిన్‌ను కదిసిన కిమ్ దూత.. ఇద్దరూ కలిసి ట్రంప్‌కు స్పాట్ పెట్టేశారా?

గ్లోబల్ డిప్లమసీలో ప్రతీ పర్యటనకు ఒక కారణం ఉంటుంది. అధికారిక ప్రకటనలు కూడా ఉంటాయి. కానీ, నార్త్ కొరియా ఫారిన్ మినిస్టర్ మాస్కో పర్యటన మాత్రం చాలా అంటే చాలా సీక్రెట్‌గా మొదలైంది.

Post Published By: dialnews
Updated : 22 July 2026, 10:00 PM IST

గ్లోబల్ డిప్లమసీలో ప్రతీ పర్యటనకు ఒక కారణం ఉంటుంది. అధికారిక ప్రకటనలు కూడా ఉంటాయి. కానీ, నార్త్ కొరియా ఫారిన్ మినిస్టర్ మాస్కో పర్యటన మాత్రం చాలా అంటే చాలా సీక్రెట్‌గా మొదలైంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పిలుపుతో ఆమె ప్యాంగ్యాంగ్ నుండి స్పెషల్ ఫ్లైట్‌ లో మాస్కో వెళ్లారు. సాధారణంగా ఒక దేశ విదేశాంగ మంత్రి వస్తే.. ఆ దేశ ప్రధాని లేదంటే విదేశాంగ మంత్రి మాత్రమే కలుస్తారు. కానీ ఇక్కడ స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రోటోకాల్ సైతం పక్కన పెట్టి క్రెమ్లిన్‌లో ఆమెతో భేటీ అయ్యారు. ఈ అసాధారణ పరిణామమే ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకూ కిమ్ దూత మాస్కో పర్యటన అజెండా ఏంటి? అమెరికా లక్ష్యంగా కిమ్, పుతిన్ అసలేం ప్లాన్ చేస్తున్నారు? తెరవెనుక చైనా పన్నుతున్న వ్యూహాలేంటి?

నార్త్ కొరియా విదేశాంగ మంత్రి చోయ్ సన్ హుయ్ మాస్కో పర్యటన అంతర్జాతీయ రాజకీయాన్ని షేక్ చేస్తోంది. పుతిన్ ప్రొటోకాల్ పక్కనపెట్టి మరీ ఆమెతో సమావేశం కావడం పాశ్చాత్య దేశాలకు అంతుచిక్కడం లేదు. ఈ భేటీలో పుతిన్ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనిక చర్యకు ఉత్తర కొరియా అందిస్తున్న పూర్తి మద్దతుకు గాను కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వానికి, నార్త్ కొరియా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యానికి నార్త్ కొరియా ఎంతపెద్ద ఆయుధ సరఫరాగా మారిందో పుతిన్ మాటలే నిరూపిస్తున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధంలో కిమ్ జోంగ్ ఉన్ కేవలం ఆయుధాలు మాత్రమే కాకుండా, వేలాది మంది ఉత్తర కొరియా ప్రత్యేక రక్షణ బలగాలను నేరుగా రష్యా సరిహద్దుల్లోకి, ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలోకి పంపించారు. ఒక దేశం సాగిస్తున్న యుద్ధంలో మరో దేశ సైనికులు నేరుగా పాల్గొనడం ఆధునిక చరిత్రలో ఇదే మొదటి సారి. 2024లో పుతిన్ ప్యాంగ్యాంగ్‌లో అడుగుపెట్టినప్పుడు.. కిమ్‌ జోంగ్‌తో కలిసి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. రష్యా లేదా నార్త్ కొరియాపై ఏ దేశమైనా దాడి చేస్తే.. ఇరు దేశాలు కలిసి ఎదుర్కొంటాయి. అంటే, అమెరికా గనుక ఉత్తర కొరియాపై దాడికి దిగితే రష్యా అణుబాంబులతో అమెరికాపైకి వస్తుంది.. అలాగే రష్యాపై నాటో దాడి చేస్తే కిమ్ సైన్యం. రంగంలోకి దిగుతుంది.

అయితే, కిమ్ జోంగ్ ఉన్ అంత సులభంగా తన సైనికులను మరణ ముఖంలోకి పంపడం లేదు. దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. యుద్ధంలో రష్యాకు సాయం చేస్తున్నందుకు ప్రతిఫలంగా, రష్యా వద్ద ఉన్న అత్యున్నత సైనిక సాంకేతికతను కిమ్ పొందుతున్నాడు. ముఖ్యంగా అమెరికా నేవీ అంతు చూడగల న్యూక్లియర్ సబ్‌మెరైన్ సాంకేతికత, అంతరిక్షంలో అమెరికా కదలికలను కనిపెట్టే మిలిటరీ శాటిలైట్ టెక్నాలజీ, అమెరికా రక్షణ వ్యవస్థలను ఛేదించే ఖండాంతర క్షిపణుల గైడెన్స్ సిస్టమ్‌ను రష్యా ఇప్పుడు ఉత్తర కొరియాకు బదిలీ చేస్తోంది. ఇది అమెరికా పశ్చిమ తీరానికి నేరుగా ముప్పు తెచ్చిపెట్టే పరిణామం. మాస్కోలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై పక్కనే ఉన్న దక్షిణ కొరియా తీవ్ర ఆందోళన చెందుతోంది. సియోల్ స్పందిస్తూ, ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కిమ్ జోంగ్ ఉన్ త్వరలోనే మూడోసారి రష్యాలో పర్యటించి పుతిన్‌తో మరో సదస్సు నిర్వహించేందుకు చోయ్ సన్ హుయ్.. రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సియోల్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఒకవేళ కిమ్ రష్యాకు వెళ్తే, కొరియా ద్వీపకల్పంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన మలుపు చైనా పాత్ర. చోయ్ సన్ హుయ్ రష్యాకు వెళ్లడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందే, ఉత్తర కొరియా టాప్ ఎకనామిక్ అఫీషియల్ పాక్ థా సంగ్ బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిశారు. అదే సమయంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత వాంగ్ హునింగ్ ప్యాంగ్యాంగ్‌లో పర్యటించారు. దీనిని బట్టి చూస్తే, అగ్రరాజ్యం ఏకఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా రష్యా, చైనా, ఉత్తర కొరియా ఒక త్రైపాక్షిక కూటమి నిర్మిస్తున్నాయని, ఈ భారీ వ్యూహానికి చైనా బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ పూర్తిగా ఉందని స్పష్టమవుతోంది. 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కిమ్ జోంగ్ ఉన్ జరిపిన అణు చర్చలు ఘోరంగా విఫలమయ్యాయి. ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను పూర్తిగా వదులుకుంటేనే ఆంక్షలు ఎత్తివేస్తామని అమెరికా స్పష్టం చేసింది. దీంతో కిమ్ వాషింగ్టన్‌తో దౌత్యానికి శాశ్వతంగా స్వస్తి పలికాడు. అమెరికా తన డిమాండ్లను తగ్గించుకునే ప్రసక్తే లేదని తేల్చేయడంతో, కిమ్ తన అణ్వాయుధ సంపత్తిని మరింత పెంచుకుంటూ రష్యాతో జట్టుకట్టారు.
కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు ప్రపంచ వేదికపై ఒక సరికొత్త సిద్ధాంతాన్ని బలంగా వినిపిస్తున్నాడు. అదే న్యూ కోల్డ్ వార్.

ప్రపంచం ఇప్పుడు ఒకే కేంద్రం చుట్టూ తిరగడం లేదని, అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమికి కాలం చెల్లిందని కిమ్ వాదిస్తున్నాడు. వాషింగ్టన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే దేశాలన్నీ ఒకే తాటిపైకి రావాలని పిలుపునిస్తూ, తన దేశాన్ని ఆ కూటమిలో ఒక అగ్రభాగంగా నిలబెడుతున్నాడు. పుతిన్ సైనిక శక్తి, చైనా ఆర్థిక శక్తి, కిమ్ అణు శక్తి కలిస్తే అమెరికాను ప్రపంచంలోనే ఒంటరిని చేయవచ్చనేది వీరి వ్యూహం. చోయ్ సన్ హుయ్ మాస్కో పర్యటన ముగిసిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ అధికారిక రష్యా పర్యటన ఎప్పుడనేది ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ పర్యటన ఖరారైతే అంతర్జాతీయ రాజకీయాలలో ఒక పెద్ద భూకంపం సంభవించినట్లే. అమెరికాను మానసికంగా, సైనికంగా దెబ్బతీయడానికి పుతిన్-కిమ్ కలిసి వేస్తున్న ఈ అడుగులు ప్రపంచాన్ని మరో వినాశకర యుద్ధం వైపు నెడతాయా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

 

Published : 
  • 22 July 2026, 10:00 PM IST