రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే అనడానికి లేటెస్ట్, లైవ్ ఎగ్జాంపుల్ పుట్టా మహేష్ యాదవ్. ఏపీలో టీడీపీ 2019 నుంచి 2024 వరకు చేసిన ఆరోపణలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పోరాటం, “మత్తు పదార్ధాలపై యుద్ధం”. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా, ఏపీ మూలాలు ఉన్నాయని అప్పట్లో ఆరోపించిన టీడీపీకి.. సరిహద్దున తెలంగాణాలోనే తమ పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. క్రమశిక్షణకు, విలువలకు మారుపేరైన పార్టీలో, నేడు 'డ్రగ్స్' కంపు కొడుతుండటం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ చుట్టూ ముసురుకున్న ఈ వివాదం కేవలం ఒక వ్యక్తిగత తప్పిదం కాదు.. టీడీపీకి అగ్నిపరీక్ష లాంటిది. “రాష్ట్రాన్ని గంజాయి ముఠాల నుండి కాపాడతాం" అని గొంతు చించుకుని నినదిస్తున్న నారా లోకేష్, ఇప్పుడు తన సొంత మనిషి, ఎంపీ మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో దొరికిపోవడానికి ఏం సమాధానం చెప్తారు? అంటూ వైసీపీ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తుంది. ఇది టీడీపీ నైతిక విలువలకు పట్టిన గ్రహణంగా పలువురు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యర్థుల నోటికి ఇదొక 'రెడీమేడ్ అస్త్రం'గా మారిపోయింది.
భవిష్యత్తు అసెంబ్లీ సమావేశాలు, సభల్లో టీడీపీ నేతలు ఏ మొహం పెట్టుకుని నీతులు చెప్తారు? అంటూ వైసీపీ ప్రశ్నించే అవకాశాలే కనపడుతున్నాయి. "చెప్పేది శ్రీరంగనీతులు.. చేసేది డ్రగ్స్ దందాలా?" అన్న విమర్శలు కూడా వైసీపీ నుంచి వినపడే ఛాన్స్ ఉంటుంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న లోకేష్, తన చుట్టూ ఎలాంటి వారిని చేర్చుకుంటున్నారు? లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న పుట్టా మహేష్ వంటి 'వారసత్వ' నాయకులు ఇలాంటి విచ్చలవిడి సంస్కృతికి అలవాటు పడితే, పార్టీని నమ్ముకున్న సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.
లోకేష్ నిర్మించుకుంటున్న "క్లీన్ అండ్ డైనమిక్" ఇమేజ్‌కు ఈ ఒక్క సంఘటన ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఏలూరు వంటి కీలక స్థానంలో కమ్మ సామాజిక వర్గం పట్టును కాదని, బీసీ కార్డుతో పుట్టా మహేష్‌ను చంద్రబాబు బరిలోకి దింపారు. కానీ, ఆయన ఇప్పుడు ఒక్క సంఘటనతో.. పార్టీకి పెను భారంలా మారారు. గెలిపించిన ప్రజలకు, నమ్మిన బీసీ ఓటు బ్యాంక్‌కు ఆయన ఇచ్చే సందేశం ఇదేనా? అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. పార్టీ కోసం రక్తం ధారపోసే కార్యకర్తలకు, ఇలాంటి విలాస పురుషుల వల్ల అవమానం తప్పడం లేదు. ఈ వ్యవహారం బీసీ వర్గాల్లో పార్టీ పట్ల తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉంది.
ఎప్పుడూ విలువలు, క్రమశిక్షణ అని మాట్లాడే సిఎం చంద్రబాబు.. గతంలో చిన్న తప్పు చేసినా ఉపేక్షించే వారు కాదు. ఇప్పుడు తన సొంత ఎంపీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికర అంశం. ఒకవేళ కఠిన చర్యలు తీసుకోకపోతే, అది పార్టీలో క్రమశిక్షణ రాహిత్యానికి దారితీయడమే కాకుండా, టీడీపీని 'అరాచక శక్తుల అడ్డా'గా ముద్ర వేస్తుంది. వైసీపీ వంటి దూకుడున్న ప్రత్యర్థులు ఈ ఇష్యూని అంత సులభంగా వదిలిపెట్టరు. సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో టీడీపీని కడిగి పారేయడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్.
ఈ దెబ్బ పార్టీ గ్రాఫ్ పై కూడా పడుతుంది. పుట్టా మహేష్ వ్యవహారం టీడీపీకి ఒక 'పొలిటికల్ పాయిజన్' లాంటిదనే భావన వ్యక్తమవుతోంది. పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం టీడీపీకి ఒక మేల్కొలుపు లాంటిది. తప్పు చేసిన వారిని పక్కన పెట్టకపోతే, ప్రజలే టీడీపీని పక్కన పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇది కేవలం ఒక ఎంపీ ఇష్యూ కాదు.. పార్టీ గౌరవ మర్యాదలకు జరిగిన విధ్వంసం. ప్రక్షాళన చేయకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే. ఈ విషయంలో పార్టీ అగ్ర నేతగా లోకేష్ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.