Top story: సెకన్లలో బ్రతికిన మోజ్తాబా, ఫిబ్రవరి 28న ఏం జరిగింది..?

ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ ఘర్షణల్లో ఇప్పటి వరకు చోటు చేసుకున్న అత్యంత కీలక ఘట్టాలలో ఒకటి.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మిస్సైల్ తో హతమార్చడం. ఆయన తర్వాత ఇరాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగిన

Post Published By: dialnews
Updated : 18 March 2026, 11:31 AM IST

ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ ఘర్షణల్లో ఇప్పటి వరకు చోటు చేసుకున్న అత్యంత కీలక ఘట్టాలలో ఒకటి.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మిస్సైల్ తో హతమార్చడం. ఆయన తర్వాత ఇరాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగిన ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే మోజ్తాబా ఫిబ్రవరిలో జరిగిన భీకర క్షిపణి దాడుల నుండి తృటిలో ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన తండ్రి, ఇరాన్ సుప్రీం నేతగా ఉన్న, అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన అదే దాడిలో మొజ్తాబా ఎలా తప్పించుకున్నారనే అంశంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఫిబ్రవరి 28 న అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడిలో అలీ ఖమేనీతో పాటు మొజ్తాబా భార్య (జహ్రా హద్దాద్-అదేల్), వారి సంతానం, ఇతర కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మరణించారు. ఈ దాడి ఎంత భీకరంగా జరిగిందంటే, అక్కడ ఉన్న భద్రతా అధికారులు, ఇతర సిబ్బంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిద్రమయ్యాయి. దాడుల తీవ్రతకు మృతదేహాలు శరీరపు ముద్దలుగా మారిపోయాయని ప్రత్యక్ష సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయి.

భవనం పై అంతస్తులో ఉన్న వారెవరూ బతికే అవకాశం లేకుండా పోయింది. మరి ఇలాంటి దాడిలో మొజ్తాబా ఎలా ప్రాణాలతో బయటపడ్డారు అనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. మొజ్తాబా ఖమేనీ ప్రాణాలతో బయటపడటం వెనుక ఒక వింత యాదృచ్చిక సన్నివేశం ఉందని ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి. క్షిపణి సరిగ్గా మొజ్తాబా నివాసం ఉండే పై అంతస్తును తాకడానికి కొన్ని క్షణాల ముందు, ఆయన ఏదో పని మీద కింద ఉన్న ఆవరణలోకి వెళ్లారు. ఆయన లోపలికి తిరిగి వెళ్దామని అడుగు వేసే సమయానికే క్షిపణి భవనాన్ని ఢీకొట్టింది.

ఆ కొద్ది సెకన్ల టైం ఆయన ప్రాణాలను కాపాడింది. ఈ దాడిలో మొజ్తాబా పూర్తిగా బయటపడలేదు అని.. ఆయన కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని, ముఖం కూడా కొంతవరకు దెబ్బతిన్నదని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ పేర్కొన్నారు. తండ్రి మరణం తర్వాత మార్చి 8న మొజ్తాబాను ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ప్రకటించారు. అయితే బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఆయన ప్రస్తుతం ఒక రహస్య బంకర్ నుండి పాలిస్తున్నట్లు సమాచారం.

ఆయన ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వస్తున్నప్పటికీ, ఇరాన్ అధికారులు మాత్రం ఆయన క్షేమంగానే ఉన్నారని, కేవలం గాయాల కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ దాడి నుండి ప్రాణాలతో బయటపడిన మొజ్తాబా, ఇప్పుడు అమెరికా మరియు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలను మరింత తీవ్రతరం చేసాయి.

Published : 
  • 18 March 2026, 11:31 AM IST