Top story:ట్రంప్ తో ఇరాన్ మైండ్ గేమ్… ఒప్పుకోకపోతే యుద్ధం ఆగదా…?

వారంలో ముగుస్తుందని అంచనా వేసిన ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఏళ్ళ తరబడి సాగుతుంది. అలాగే వారంలో సమసిపోతుందనుకున్న ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కూడా.. ఎన్నాళ్ళు సాగుతుందో క్లారిటీ రావడం లేదు

Post Published By: dialnews
Updated : 14 March 2026, 9:14 AM IST

వారంలో ముగుస్తుందని అంచనా వేసిన ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఏళ్ళ తరబడి సాగుతుంది. అలాగే వారంలో సమసిపోతుందనుకున్న ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కూడా.. ఎన్నాళ్ళు సాగుతుందో క్లారిటీ రావడం లేదు. ఇరాన్ పూర్తిగా వెనక్కు తగ్గే వరకు యుద్దాన్ని ఆపేది లేదని అమెరికా అంటుంది. కానీ ఇరాన్ అంత తేలికగా తగ్గే అవకాశాలు మాత్రం ఇప్పట్లో లేవు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ చేసిన కామెంట్స్ గాని, ఆ దేశ నయా సుప్రీం లీడర్ చేసిన కామెంట్స్ గానీ.. ఎక్కడా కూడా వెనక్కు తగ్గేలా కనపడటం లేదు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్.. అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా అంటే ముఖ్యంగా రష్యా, చైనా మరియు పాకిస్థాన్ ద్వారా అమెరికాకు పంపిన 'శాంతి ప్రతిపాదనలు' చూద్దాం.

సార్వభౌమాధికారం, అణు హక్కుల గుర్తింపు:

ఇరాన్ మొదటి షరతు అమెరికా, ఇజ్రాయిల్ ను షాక్ కు గురి చేసింది. ఆ దేశాన్ని ఒక స్వతంత్ర శక్తిగా ప్రపంచం గుర్తించాలి. ఇరాన్ తన అణు ఇంధన తయారీని శాంతియుత అవసరాల కోసం (విద్యుత్, వైద్యం) కొనసాగించే హక్కును అమెరికా అంగీకరించాలి. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో లేదా వారి మిలిటరీ వ్యూహాల్లో అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ జోక్యం చేసుకోకూడదు.

యుద్ధ నష్టపరిహారం

ఇది అత్యంత కఠినమైన కండీషన్. యుద్ధం మొదలైన 12 రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్‌లోని ప్రధాన ఓడరేవులు, చమురు క్షేత్రాలు, మరియు ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ విధ్వంసానికి గాను బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అమెరికా చెల్లించాలని ఇరాన్ పట్టుబడుతోంది. కేవలం యుద్ధం ఆపడమే కాదు, ఇరాన్‌పై దశాబ్దాలుగా ఉన్న అన్ని రకాల ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని కోరుతోంది.

'నో అటాక్' గ్యారెంటీ

భవిష్యత్తులో మళ్ళీ ఇరాన్ మీద దాడులు జరగవని అంతర్జాతీయంగా గ్యారెంటీ కావాలని డిమాండ్ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి లేదా ఐక్యరాజ్యసమితి నుండి ఒక బలమైన లిఖితపూర్వక ఒప్పందం కావాలని ఇరాన్ కోరుతోంది. పశ్చిమ ఆసియా నుండి అమెరికా సైనిక స్థావరాలను క్రమంగా తొలగించాలని కూడా ఇరాన్ తన అంతర్గత చర్చల్లో ప్రస్తావిస్తోంది.అసలు ఈ షరతుల వెనుక ఉన్న 'మైండ్ గేమ్' ఏంటో చూస్తే.. హార్ముజ్ జలసంధిని అడ్డు పెట్టుకోవడం ప్రధానంగా కనపడుతోంది. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన ఈ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలో ఉంచుకుంది. ఒకవేళ యుద్ధం ఆగకపోతే, ఈ మార్గాన్ని శాశ్వతంగా మూసివేస్తామని, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయని ఇరాన్ హెచ్చరిస్తోంది. రష్యా, చైనాలు ఇరాన్‌కు వెన్నుదన్నుగా ఉన్నాయి. ఈ దేశాల ద్వారా అమెరికాపై ఒత్తిడి తెచ్చి, తమకు అనుకూలమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరాన్ ప్లాన్.

యుద్ధం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వం పెట్టిన ఈ కఠిన షరతులు ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ "యుద్ధం ఆపడానికి నేను సిద్ధం, కానీ ఇరాన్ తన ఉగ్రవాద చర్యలను పూర్తిగా ఆపేయాలి" అని అంటున్నారు. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు సామర్థ్యం సున్నా అయ్యే వరకు దాడులు ఆపబోమని భీష్మించుకుని కూర్చుంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ, ఇరాన్ మిలిటరీ సామర్థ్యం పూర్తిగా తగ్గే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా అధికారులు చెప్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఒక ప్రధాన కండిషన్ పెడుతున్నాయి. ఇరాన్ కేవలం యుద్ధం ఆపడం మాత్రమే కాదు, లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హుతీలు, మరియు పాలస్తీనాలోని హమాస్ వంటి గ్రూపులకు ఇస్తున్న ఆయుధ, ఆర్థిక మద్దతును పూర్తిగా నిలిపివేయాలి. ఈ గ్రూపుల ద్వారా ఇరాన్ తన శత్రువులపై దాడులు చేయిస్తోందని వారి ఆరోపణ.

అలాగే ఈ యుద్ధం కేవలం క్షిపణులతోనే జరగడం లేదు. ఇరాన్ తనపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా అమెరికాలోని ఆర్థిక సంస్థలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సైబర్ దాడులు చేస్తోంది. యుద్ధ విరమణ ఒప్పందంలో ఈ 'డిజిటల్ దాడుల' విరమణ కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారనుంది. ఇజ్రాయెల్ చుట్టూ ఇరాన్ మద్దతు ఉన్న దేశాలు మరియు గ్రూపులు ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఇజ్రాయెల్‌ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోంది. ఈ 'రింగ్' ను బ్రేక్ చేయడమే ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్. ఈ వ్యూహాన్ని ఇరాన్ వదులుకుంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఏది ఎలా ఉన్నా యుద్ధం ఆపడం అనేది కేవలం క్షిపణులు ఆపడం కాదు, దశాబ్దాల కాలంగా ఉన్న నమ్మకద్రోహాలను, ఆధిపత్య పోరును ఆపడం. ఇరాన్ పెట్టిన ఈ మూడు షరతులు అమెరికా అంగీకరిస్తుందా లేదా అనేది ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.

Published : 
  • 14 March 2026, 9:14 AM IST