అగ్రరాజ్యం అమెరికాలోనే కాదు వరల్డ్ వైడ్ గా.. ఒకే ఒక్క పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. కోల్ థామస్ అలెన్. అతను ఒక క్రిమినల్ కాదు.. ఒక మేధావి. అతను ఒక గ్యాంగ్ స్టర్ కాదు.. నాసా మాజీ రీసెర్చ్ ఫెలో. మరి ఇంతటి చదువు చదివిన వ్యక్తి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న హై-ప్రొఫైల్ విందులో తుపాకీతో ఎందుకు దొరికిపోయాడు..? నాసాలో పనిచేసిన మేధావికి తుపాకీ పట్టాల్సిన అవసరం ఏం వచ్చింది..? అతని ల్యాప్‌టాప్‌లో ఏముంది..? అతని రాజకీయ నేపథ్యం ఏంటి..? ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్..
శనివారం రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్ వెలుపల ఒక భయానక వాతావరణం నెలకొంది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కోసం దాదాపు 2,500 మంది వీవీఐపీలు ఒకచోట చేరారు. అధ్యక్షుడు, ప్రథమ మహిళ బాల్‌రూమ్‌లోకి అడుగుపెట్టే కొద్ది నిమిషాల ముందే.. 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ అనే వ్యక్తి సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చాడు. అతని వద్ద షాట్‌గన్, హ్యాండ్‌గన్ మరియు అనేక కత్తులు ఉండటాన్ని సీక్రెట్ సర్వీస్ గుర్తించింది. అడ్డుకోబోయిన అధికారులపై అతను కాల్పులకు తెగబడ్డాడు. ఒక అధికారికి బుల్లెట్ తగిలినా, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ప్రాణాలను కాపాడింది.
అలెన్ నేపథ్యం చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. ఇతను కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన వ్యక్తి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన Caltech (California Institute of Technology) నుండి 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ కూడా పూర్తి చేశాడు. 2014లోనే నాసా యొక్క ప్రఖ్యాత Jet Propulsion Laboratory (JPL) లో సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోగా పనిచేశాడు. IJK కంట్రోల్స్‌లో ఇంజనీర్‌గా, కాల్టెక్లో టీచింగ్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే.. C2 ఎడ్యుకేషన్ అనే సంస్థలో పార్ట్-టైమ్ టీచర్‌గా ఉంటూ, డిసెంబర్ 2024లో 'టీచర్ ఆఫ్ ది మంత్' గా అవార్డు అందుకున్నాడు. అలెన్ ఒక స్వయం ఉపాధి పొందిన 'ఇండి గేమ్ డెవలపర్'. అతను మాలిక్యులర్ కెమిస్ట్రీ ఆధారంగా గేమ్స్ రూపొందించేవాడు. అతను సృష్టించిన గేమ్స్ పేర్లు 'Boredom' మరియు 'First Law'. విశేషం ఏంటంటే.. కాల్పుల ఘటనకు ముందు అతను ఒక కొత్త 'టాప్-డౌన్ షూటర్' పోరాట గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ గేమ్‌లో ఉన్న హింస, ఇప్పుడు నిజ జీవితంలో అతను చేసిన దాడికి ఏమైనా సంబంధం ఉందా అని ఎఫ్.బి.ఐ ఆరా తీస్తోంది. అంటే అతను తన దాడిని ఒక వీడియో గేమ్ లాగా ప్లాన్ చేశాడా..? అనే కోణంలో విచారణ సాగుతోంది. అలెన్ డెవలప్ చేసిన 'First Law', అలాగే 'Boredom' అంటే విసుగు అని అర్ధం. గేమ్స్‌లోని కోడింగ్‌లో ఏదైనా రహస్య సందేశాలు ఉన్నాయా అనే కోణంలో సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. సాధారణంగా 'ఇండి గేమ్ డెవలపర్లు' తమ ఆలోచనలను గేమ్స్ ద్వారా వ్యక్తపరుస్తారు.
అతను సృష్టించిన గేమ్స్ టైటిల్స్.. అతని మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయా..? అనేది ఒక పెద్ద ప్రశ్న. అతను డెవలప్ చేసిన గేమ్ 'మాలిక్యులర్ కెమిస్ట్రీ' బేస్ చేసుకుని ఉండటం గమనార్హం. అంటే అతనికి కెమికల్స్ మరియు బాంబు తయారీపై కూడా అవగాహన ఉండే అవకాశం ఉందా..? అతని వద్ద దొరికిన కత్తులు మరియు గన్స్ కాకుండా, అతని కారులో ఏవైనా ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా అని పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఫెడరల్ రికార్డుల ప్రకారం.. అలెన్ 2024లో డెమోక్రటిక్ పార్టీకి, ముఖ్యంగా కమలా హారిస్ ప్రచారానికి విరాళం ఇచ్చాడు.
ఇది రాజకీయ కక్షతో చేసిన దాడా..? లేక ఒంటరిగా ప్లాన్ చేసిన కుట్రా..? ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనిపై ఫెడరల్ ఆఫీసర్‌పై దాడి, ఆయుధాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఒక మేధావి, టీచర్, గేమింగ్ నిపుణుడు ఇలాంటి నేరానికి ఎందుకు ఒడిగట్టాడనేది అమెరికాలో హాట్ టాపిక్ అయింది. ఘటన జరిగిన కొద్దిసేపటికే అతని లింక్డ్ఇన్ మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్స్ గురించి సమాచారం బయటకు రావడం మొదలైంది.
ఒక మెకానికల్ ఇంజనీర్, కంప్యూటర్ సైంటిస్ట్ అంతటి హై-ప్రొఫైల్ ఉన్న వ్యక్తి.. ఎందుకు తన కెరీర్‌ను పణంగా పెట్టాడు..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అతిపెద్ద షాకింగ్ పాయింట్ ఏంటంటే.. నిందితుడు కోల్ థామస్ అలెన్ ఆ సమయంలో ఆ హోటల్లోనే ఒక అతిథిగా ఉన్నట్లు కూడా కొన్ని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. అంటే లోపల ఉంటూనే బయట చెక్ పాయింట్ వద్దకు వచ్చి దాడికి యత్నించాడా..? అనే దానిపై ఆరా తీస్తున్నారు. చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందని నమ్ముతాం.. కానీ అలెన్ విషయంలో ఆ చదువే ఒక ప్రమాదకరమైన కుట్రకు పునాది వేసిందా..? మేధావులు ఇలా హింస వైపు మళ్లడం వెనుక అసలు కారణమేంటి..? దర్యాప్తులో మరిన్ని నిజాలు తెలియాల్సి ఉంది.