ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా పర్యటన మిడిల్ ఈస్ట్‌ను షేక్ చేస్తోంది. ఫిబ్రవరి 18న అమెరికాలో పర్యటించాల్సి ఉండగా.. నెతన్యాహు వారం రోజుల ముందే వాషింగ్టన్లో ల్యాండ్ అవ్వడం పశ్చిమాసియాను వణికిస్తోంది. అమెరికా సైతం టెహ్రాన్‌తో చర్చలు జరుపుతూనే.. ఖతార్‌లో యుద్ధ సన్నాహాలు చేస్తోంది. అబ్రహం లింకన్ నౌకకు తోడుగా మరో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌ను రంగం లోకి దించే ప్లాన్‌లో ఉన్నారన్న వార్తలూ వణికిస్తున్నాయి. ఇంతకూ, ఇజ్రాయెల్ పీఎం షెడ్యూల్ కంటే ముందే వాసింగ్టన్ ఎందుకెళ్లారు? ఖతార్ ఎయిర్‌బేస్‌లో అమెరికా చేస్తున్న యుద్ధ సన్నద్ధత ఏంటి? మరో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌ను మిడిల్ ఈస్ట్‌కు పంపాలని ఎందుకు ప్లాన్ చేస్తున్నారు? టాప్ స్టోరీలో చూద్దాం..
ఇజ్రాయెల్ ప్రధానితో మూడు గంటల పాటు సాగిన సమావేశం తర్వాత ట్రంప్ చేసిన ప్రకటన ఇది. నెతన్యాహుతో సమావేశం చాలాసానుకూల వాతావరణంలో జరిగిందని వెల్లడించాడు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలు మరింత బలపడుతున్నాయని పేర్కొన్నాడు. ఐతే, ఇంకా ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశాడు. ముఖ్యంగా ఇరాన్ అంశంపై చర్చలు కొనసాగించాలని తాను నెతన్యాహూను కోరినట్లు చెప్పుకొచ్చాడు. ఇరాన్‌తో చర్చలు కొనసాగి ఒక ఒప్పందం కుదిరితే మంచిదని తాను స్పష్టంచేశాననీ.. అది సాధ్యం కాకపోతే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలని ట్రంప్ పేర్కొన్నాడు. ఇక గతంలో ఇరాన్‌తో ఒప్పందం కుదరని సందర్భాన్ని ట్రంప్ ప్రస్తావించాడు. "లాస్ట్ టైం ఇరాన్ ఒప్పందాన్ని తిరస్కరించింది. దాంతో మేము మిడ్నైట్ హ్యామర్ ఆపరేషన్ చేపట్టాం. అది వారికి అనుకూలంగా మారలేదు" అని గుర్తుచేశాడు. గత ఆపరేషన్‌ను గుర్తు చేయడం ద్వారా మరో భీకర దాడికి తాము సిద్ధం అనే సంకేతాలిచ్చే ప్రయత్నం చేశాడు.
గతేడాది జూన్ 21-22 తేదీల్లో అమెరికా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ అణు మౌలిక వసతులపై దాడులు జరిపింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లోని కీలక న్యూక్లియర్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని బంకర్ బస్టర్లతో విరుచుకుపడింది. ఈసారి అలా జరగొద్దంటే ఇరాన్ మరింత బాధ్యతగా వ్యవహరించాలనీ, ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని స్పష్టం చేశాడు. ఒక వేళ అణు ఒప్పందం కుదిరితే పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. మరోవైపు గాజా పరిస్థితులపై కూడా ఇరు నాయకులు విస్తృతంగా చర్చించారు. గాజాలో జరుగుతున్న పరిణామాలు, భద్రతా అంశాలు, మానవతా పరిస్థితులు, ప్రాంతీయ శాంతి వంటి విషయాలు భేటీలో ప్రాధాన్యం పొందినట్లు ట్రంప్ తెలిపాడు. ఇక ఇదే పర్యటనలో నెతన్యాహు మార్కో రూబియోతోనూ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత బోర్డ్ ఆఫ్ పీస్‌లో సభ్యత్వం నమోదు చేసుకున్నట్లు ఆయన కార్యాలయం పేర్కొంది.
ట్రంప్ తన ప్రకటనలో చర్చలే సమస్యకు పరిష్కారం అని చెబుతున్నా.. అమెరికా చర్యలు మాత్రం యుద్ధమే సమాధానం అని నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, ఇరాన్ లక్ష్యంగా చాలా రహస్యంగా సైనిక సన్నద్ధత జరుగుతోంది. పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక కేంద్రమైన ఖతార్‌లోని అల్-ఉదీద్ ఎయిర్‌బేస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్‌తో జనవరి నుంచి ఘర్షణ వాతావరణం పెరగడంతో అక్కడ మోహరించిన పేట్రియాట్ క్షిపణులను అమెరికా దళాలు మొబైల్ ట్రాక్ లాంచర్లలోకి ఎక్కించాయి. సాధారణంగా వీటిని సెమీ స్టాటిక్ అంటే స్థిరంగా ఉండే స్టేషన్లలోనే ఉంచుతారు. వీటిని మొబైల్ లాంచర్లలోకి మార్చడం అంటే.. శత్రువుల కంటికి చిక్కకుండా తరలించడానికి, అత్యంత వేగంగా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థమని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జనవరిలో తీసిన ఫొటోలతో పోలిస్తే, ఫిబ్రవరిలో అల్-ఉదీద్ స్థావరంలో యుద్ధ విమానాలు, నిఘా విమానాలు, భారీ మిలిటరీ సామగ్రి మోహరింపు భారీగా పెరిగింది.
మరోవైపు.. అమెరికా మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఒక సంచలన నిజాన్ని బయటపెట్టింది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ పశ్చిమాసియాకు రెండవ విమానవాహక నౌకను పంపడానికి సిద్ధం కావాలని ఆదేశించినట్లు నివేదించింది. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు ఫెయిల్ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ ఉన్న USS అబ్రహం లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌కు తోడుగా మరొక యుద్ధ నౌకను పంపాలని పెంటగాన్ యోచిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. వర్జీనియా తీరంలో శిక్షణలో ఉన్న 'USS జార్జ్ హెచ్.డబ్ల్యు. బుష్' విమానవాహక నౌకను రెండు వారాల్లోపు పశ్చిమ ఆసియాకు తరలించే అవకాశం ఉందని తెలిపింది. అబ్రహం లింకన్, జార్జ్ హెచ్.డబ్ల్యు బుష్ నౌకలు అమెరికా నేవీలోనే అత్యంత శక్తివంతమైనవి. అలాంటి నౌకలను ఇరాన్ లక్ష్యంగా రంగంలోకి దించుతున్నారంటే.. ట్రంప్ ప్లాన్ చర్చలు కాదు, యుద్ధమే. ఓమన్‌లో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య ఇటీవల పరోక్ష చర్చలు జరిగినప్పటికీ, "అణ్వస్త్రాలు లేని" ఒప్పందం కావాలని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. దీనికి ఇరాన్ ససేమిరా అంటోంది. యుద్ధం జరిగినా న్యూక్లియర్ పరీక్షలు ఆగవని తేల్చేసింది. సో.. మిడిల్ ఈస్ట్‌లో ఎప్పుడైనా విధ్వంసం మొదలుకావచ్చు.