కిమ్ జోంగ్ ఉన్, వ్లాదిమిర్ పుతిన్.. ఈ ఇద్దరి శత్రువు ఒకరే.. ఆ ఇద్దరి లక్ష్యం కూడా ఒక్కటే. ఆ కామన్ ఎనిమీ ఎవరో కాదు.. అగ్రరాజ్యం అమెరికా..! ఇప్పుడు ఆ దేశం లక్ష్యంగానే ఇద్దరి యాక్షన్ కంటిన్యూ అవుతోంది. ఉక్రెయిన్ వార్ జోన్లో పెను విధ్వంసం సృష్టిస్తున్నారు. రష్యాకు మద్దతుగా ఎప్పుడో తన సైన్యాన్ని రంగంలోకి దించిన కిమ్.. తాజాగా తన డేంజరస్ మిస్సైళ్లనూ అందించారు. ఉక్రెయిన్‌లో విధ్వంసంసృష్టించింది ఆ మిస్సైలే. దానిపేరు KN-23. ఇది రష్యాకు చెందినపవర్ ఫుల్ క్షిపణి ఇస్కందర్‌ను పోలి ఉంటుందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అధికారికంగా ఈ మిస్సైల్‌ను హ్వాసాంగ్-11ఏ అని పిలుస్తున్నారు. రష్యా గతంలో అంటే 2023 చివరి నుండి 2025 ఆగస్టు వరకూ నార్త్ కొరియా క్షిపణులను వాడింది. అయితే, ఈ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను మాత్రం ఇప్పుడే వాడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పుతిన్‌కు సపోర్ట్ చేయడాన్ని తప్పుబడుతూ కిమ్ జోంగ్ ఉన్ను పిచ్చి పాలకుడిగా విమర్శించాడు.
జెలెన్స్కీ విమర్శలను పక్కనపెడితే.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ప్రత్యక్షంగా సాయం చేస్తోంది కిమ్ ఒక్కరే. ఉక్రెయిన్‌కు అమెరికా, యూరోపియన్ దేశాలు ఆయుధాలిస్తుంటే, రష్యాకు తన సైన్యాన్నే మద్దతుగా రంగంలోకి దించాడు కిమ్. తాజా బాలిస్టిక్ మిస్సైల్ దాడితో భారీగా ఆయుధాలు ఎగుమతి చేస్తున్నట్టు తేలిపోయింది. లక్షలాది ఫిరంగి గుండ్లు, క్షిపణులను రైళ్లద్వారా రష్యాకు చేరవేస్తూ, పుతిన్ సైన్యానికి ఆయుధ కొరత లేకుండా ప్యాంగ్యాంగ్ చూసుకుంటోంది. అయితే, ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న ఈ బంధానికి చట్టబద్ధత కల్పించింది 2024 జూన్‌లో జరిగిన చారిత్రక ఒప్పందమే. 24 ఏళ్ల తర్వాత పుతిన్ ప్యాంగ్యాంగ్లో అడుగుపెట్టినప్పుడు, కిమ్ జోంగ్ ఉన్‌తో కలిసి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. రష్యా లేదా నార్త్ కొరియాపై ఏ దేశమైనా దాడి చేస్తే.. ఇరు దేశాలు ఒక్కటిగా ఎదుర్కొంటాయి. అంటే, అమెరికా గనుక ఉత్తర కొరియాపై దాడికి దిగితే రష్యా అణుబాంబులతో అమెరికాపైకి వస్తుంది.. అలాగే రష్యాపై నాటో దాడి చేస్తే కిమ్ సైన్యం రంగంలోకి దిగుతుంది. ఈ డీల్‌లో భాగంగానే ఏకంగా బాలిస్టిక్ మిస్సైళ్లు పంపించినట్టు కనిపిస్తోంది.
నిజానికి.. సుదీర్ఘ యుద్ధంలో రష్యాకు మద్దతు ఇవ్వడం వెనుక కిమ్ టార్గెట్ ఉక్రెయిన్ ఒక్కటే కాదు, అగ్రరాజ్యం అమెరికా కూడా. అందుకు కారణం తన శత్రు దేశమైన సౌత్ కొరియాకు వాషింగ్టన్ ఇస్తున్న మద్దతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తూ రష్యాను ఎలా టార్గెట్ చేస్తున్నారో.. దక్షిణ కొరియాకు మద్దతు ఇస్తూ ఉత్తర కొరియాను కూడా అలాగే లక్ష్యం చేసుకుంటున్నారు. అందుకే, సుదీర్ఘ యుద్ధంలో పుతిన్‌తో చేయి కలిపాడు కిమ్ జోంగ్ ఉన్. రష్యాకు ఇన్ని రకాలుగా మద్దతు ఇవ్వడం వెనుక కిమ్ మార్క్ స్వార్థం కూడా ఉంది. యుద్ధంలో రష్యాకు సాయం చేస్తున్నందుకు ప్రతిఫలంగా, రష్యా వద్ద ఉన్న అత్యున్నత సైనిక సాంకేతికతను కిమ్ పొందుతున్నాడు. ముఖ్యంగా అమెరికా నేవీ అంతు చూడగల న్యూక్లియర్ సబ్‌మెరైన్ సాంకేతికత, అంతరిక్షంలో అమెరికా కదలికలను కనిపెట్టే మిలిటరీ శాటిలైట్ టెక్నాలజీ, అమెరికా రక్షణ వ్యవస్థలను ఛేదించే ఖండాంతర క్షిపణుల గైడెన్స్ సిస్టమ్‌ను రష్యా ఇప్పుడు ఉత్తర కొరియాకు బదిలీ చేస్తోంది. ఇది అమెరికా పశ్చిమ తీరానికి నేరుగా ముప్పు తెచ్చిపెట్టే పరిణామంగా రక్షణ నిపుణులు చెబుతున్నారు.
కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు ప్రపంచ వేదికపై ఒక సరికొత్త సిద్ధాంతాన్ని బలంగా వినిపిస్తున్నాడు. అదే న్యూ కోల్డ్ వార్! ప్రపంచం ఇప్పుడు ఒకే కేంద్రం చుట్టూ తిరగడం లేదని, అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమికి కాలం చెల్లిందని కిమ్ వాదిస్తున్నాడు. వాషింగ్టన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే దేశాలన్నీ ఒకే తాటిపైకి రావాలని పిలుపునిస్తూ, తన దేశాన్ని ఆ కూటమిలో ఒక అగ్రభాగంగా నిలబెడుతున్నాడు. పుతిన్ సైనిక శక్తి, చైనా ఆర్థిక శక్తి, కిమ్ అణు శక్తి కలిస్తే అమెరికాను ప్రపంచంలోనే ఒంటరిని చేయవచ్చనేది వీరి వ్యూహం. ఇందులో భాగంగానే రష్యాకు సైనిక మద్దతు పెంచుతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే.. త్వరలోనే కిమ్ రష్యా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల నార్త్ కొరియా విదేశాంగ మంత్రి చోయ్ సన్ హుయ్ మాస్కోలో పర్యటించారు. అప్పుడే కిమ్ పర్యటన కన్ఫమ్ అయిందని అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి. సో.. ఉక్రెయిన్‌పై జరిగిన KN-23 బాలిస్టిక్ మిస్సైల్ దాడి ఆరంభం మాత్రమే కావచ్చు. భవిష్యత్‌లో ఈ యుద్ధం ఎన్ని విధ్వంసక మలుపులు తిరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.