Top story: నేపాల్ కోసం రంగంలోకి భారత్ ఎన్ని కుట్రలు చేసినా నేపాల్‌కు అండగా భారత్.. దక్షిణాసియా దేశాలను కాపాడే శక్తి ఇండియానే..!

ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ బ్రహ్మ, ఆపరేషన్ సాగర్ బంధు.. ఇవన్నీ పొరుగు దేశాలను సేవ్ చేయడానికి భారత్ చేపట్టిన మిషన్లే. ప్రకృతి విపత్తుల సమయంలో తన, మన అన్న తేడా లేకుండా కష్టాల్లో ఉన్న దేశాలకు కొండంత అండగా నిలుస్తోంది ఇండియా.

Post Published By: dialnews
Updated : 28 August 2026, 5:55 PM IST

ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ బ్రహ్మ, ఆపరేషన్ సాగర్ బంధు.. ఇవన్నీ పొరుగు దేశాలను సేవ్ చేయడానికి భారత్ చేపట్టిన మిషన్లే. ప్రకృతి విపత్తుల సమయంలో తన, మన అన్న తేడా లేకుండా కష్టాల్లో ఉన్న దేశాలకు కొండంత అండగా నిలుస్తోంది ఇండియా. తాజాగా హిమాలయ దేశం నేపాల్‌ విషయంలోనూ అదే చేసింది. మెరుపు వరదలు గ్రామాలకు గ్రామాలనే మింగేసిన వేళ.. నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీని ఆచరణలో పెడుతూ హిమాలయ దేశానికి భరోసాగా నిలిచింది. తద్వారా దక్షిణాసియా దేశాలకు అతిపెద్ద రక్షకుడిని తానే అని మరోసారి చాటిచెప్పింది. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో విరుచుకుపడిన ఆకస్మిక వరదలు హిమాలయ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. వంతెనలు కొట్టుకుపోయాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి, కీలకమైన మౌలిక వసతులు పూర్తిగా స్తంభించిపోయాయి.

వందల మంది ప్రజలు గల్లంతయ్యారు. నేపాల్ ప్రజలు హాహాకారాలు చేస్తున్న ఆ విపత్కర క్షణాల్లో... భారత ప్రధాని మోదీ వెంటనే నేపాల్ పీఎం బాలేంద్ర షాతో నేరుగా మాట్లాడారు. ఆ ఫోన్‌కాల్ ముగిసిన గంటల వ్యవధిలోనే భారత్ నుంచి ఖాట్మండుకు ముమ్మర సహాయక చర్యలు మొదలయ్యాయి. కష్టకాలంలో ఆపన్నహస్తం అందించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యూఢిల్లీ వేగానికి, మానవతా నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శక్తిమంతమైన C-130J సూపర్ హెర్క్యులస్ మిలిటరీ రవాణా విమానం దాదాపు 10 టన్నుల అత్యవసర సహాయ సామగ్రితో ఖాట్మండులో ల్యాండ్ అయింది. ఇది ఆరంభం మాత్రమే.. హిమాలయ దేశం కోలుకునే వరకూ ఈ సాయం ఇలాగే కొనసాగుతుందని న్యూఢిల్లీ స్పష్టమైన మెసేజ్ ఇచ్చింది.

మరోవైపు.. ఈ తక్షణ ప్రతిస్పందనపై నేపాల్ ప్రధాని బాలేన్ షా భావోద్వేగంతో స్పందిస్తూ, భారత్ అందించిన ఈ సహకారం ఇరు దేశాల మధ్య యుగాలుగా కొనసాగుతున్న విడదీయరాని మైత్రీ బంధానికి సజీవ సాక్ష్యమని కొనియాడారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ సైతం ఇండియా అందించిన మెడికల్ సప్లైలు, తక్షణ సాయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సంక్షోభ సమయంలో భారత్ నిలిచిన తీరు ద్వైపాక్షిక సంబంధాల అసలైన బలాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నైబర్‌హుడ్ ఫస్ట్ అంటే పొరుగుకే ప్రథమ ప్రాధాన్యం విధానం, కేవలం రాజకీయ సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు, సరిహద్దు కనెక్టివిటీలకు మాత్రమే పరిమితం కాలేదు. విపత్తులు సంభవించినప్పుడు పొరుగు దేశాలకు రక్షణ కవచంలా నిలవడమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశంగా మారింది. ఈ విధానం ద్వారా దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కడ ఎటువంటి ప్రకృతి లేదా మానవ తప్పిదాల వల్ల సంక్షోభం తలెత్తినా, సహాయం అందించే దేశాల్లో భారత్ అగ్రభాగాన నిలుస్తూ అంతర్జాతీయ సమాజంలో శెభాష్ ఇండియా అనిపించుకుంటోంది.

2015 ఏప్రిల్ 25న సంభవించిన నేపాల్ భూకంపం ఒక కీలక ఘట్టంగా నిలిచిపోతుంది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో వచ్చిన ఆ పెను విలయంలో వేలాది భవనాలు నేలమట్టమై, వేల ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆ సమయంలో భారత్ ప్రారంభించిన ఆపరేషన్ మైత్రి విదేశీ గడ్డపై భారత్ చేపట్టిన అతిపెద్ద డిజాస్టర్ రెస్పాన్స్ ఆపరేషన్‌గా చరిత్రకెక్కింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ డాక్టర్లు శిథిలాలను తొలగించి ప్రాణాలు కాపాడారు. భారతీయులతో పాటు అనేక ఇతర దేశాల పౌరులను సైతం క్షేమంగా ఖాళీ చేయించారు. ఆ తర్వాత ఖాట్మండులో జరిగిన పునర్నిర్మాణ సదస్సులో నేపాల్ పునర్వైభవం కోసం భారత్ ఏకంగా 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించి, పొరుగు దేశానికి నిజమైన మార్గదర్శిగా నిలిచింది. కేవలం ప్రకృతి వైపరీత్యాలలోనే కాదు.. ఆర్థిక సంక్షోభాల్లోనూ భారత్ కొంబంత అండగా నిలిచింది. 2022లో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు భారత్ 1 బిలియన్ డాలర్ల క్రెడిట్ ఫెసిలిటీతో పాటు ఇంధనం కోసం మరో 500 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను పొడిగించి ద్వీప దేశాన్ని గట్టెక్కించింది. 2025లో భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌ను ఆపరేషన్ బ్రహ్మ పేరుతో ఆదుకుంది.

గతేడాది నవంబర్‌లో శ్రీలంకను వణికించిన దిత్వా తుఫాను బీభత్సం తర్వాత భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా మరోసారి అండగా నిలిచింది భారత్. 1,058 టన్నుల భారీ సహాయ సామగ్రిని భారత యుద్ధ నౌకలు, ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా బాధితులకు చేరవేశారు. విపత్తులో చిక్కుకున్న 2,500 మంది భారతీయులను రక్షించడమే కాకుండా, శ్రీలంక ప్రజల కోసం భారత సైనిక ఆసుపత్రిలో 2,200 మందికి వైద్యం అందించారు. అంతటితో ఆగకుండా, వరదలకు తెగిపోయిన కీలకమైన రవాణా మార్గాలను పునరుద్ధరించేందుకు భారత ఆర్మీ ఇంజనీర్లు స్వయంగా రంగంలోకి దిగి 'బెయిలీ వంతెనలను నిర్మించి సాధారణ జీవనం త్వరగా పుంజుకునేలా చేశారు. ఇలా విపత్తు సంభవించినప్పుడు కేవలం సానుభూతి సందేశాలతో చేతులు దులుపుకోవడం కాకుండా... క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి బాధితుల కన్నీళ్లు తుడవడం, రోడ్లు, వంతెనలను నిర్మించి తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం ఇండియా మాత్రమే చేయగలుగుతోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ఆపద్బాంధవుడిగా మారి విశ్వబంధుగా నిలుస్తోంది.

Published : 
  • 28 August 2026, 5:55 PM IST